 
													పథనంతిట్ట: శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో బంగారు తాపడాల బరువు తగ్గిన వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కీలక ఆధారాలను సేకరించింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి.. 476 గ్రాముల బంగారాన్ని అమ్మేసినట్లు దర్యాప్తులో వెల్లడించాడు. ఆ బంగారాన్ని 2019లోనే కర్ణాటకలో గోవర్ధన్ అనే వ్యాపారికి విక్రయించినట్లు వాంగ్మూలమిచ్చినట్లు సిట్ అధికారులు తెలిపారు.
2019లో బంగారు తాపడాలకు మెరుగులు దిద్దే పనిలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే..! దీంతో కేరళ సర్కారుపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. పినరయి విజయన్ సర్కారు ఈ అంశంపై దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ ప్రాథమిక దర్యాప్తులో ఉన్నికృష్ణన్‌ను ప్రధాన నిందితుడిగా తేల్చి, అరెస్టు చేసింది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న ఉన్నికృష్ణన్‌ను సిట్ అధికారులు కోర్టు అనుమతితో ఈ నెల 30వ తేదీ వరకు కస్టడీకి తీసుకుని, విచారించారు. ఈ క్రమంలో తొలుత 2 కిలోల బంగారం చోరీ అయినట్లు అనుమానాలు వ్యక్తమైనా.. తాజాగా ఉన్నికృష్ణన్ ఇచ్చిన వాంగ్మూలంలో దొంగతనానికి గురైన బంగారం బరువును 476 గ్రాములుగా తేల్చారు. ఉన్నకృష్ణన్ కస్టడీ ముగియడంతో గురువారం కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు.

ఇక ట్రావెన్‌కోర్ బోర్డు సభ్యుల విచారణ 
ఉన్నికృష్ణన్ వాంగ్మూలం నేపథ్యంలో సిట్ అధికారులు ఇప్పుడు ట్రావెన్‌కోర్ దేవొస్వం బోర్డు(టీడీబీ) సభ్యులను విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. 2019 నుంచి ఆరేళ్ల పాటు.. ఈ మోసాన్ని ఎందుకు గుర్తించలేదు? వ్యవస్థలో ఎక్కడ లోపముంది? ఉన్నికృష్ణన్‌కు ఇంటిదొంగల అండదండలున్నాయా? అనే కోణంపై బోర్డు సభ్యుల వాంగ్మూలాలు సేకరించనుంది. అంతేకాదు.. ఇప్పటికే 2019-25 మధ్యకాలంలో జరిగిన బోర్డు మీటింగ్‌లలో మినిట్స్ వివరాలను సిట్ స్వాధీనం చేసుకుంది. దాని ఆధారంగా బోర్డు సభ్యులను విడివిడిగా, కలిపి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

సంపన్న భక్తులతో ఉన్ని క్లోజ్ 
శబరిమలకు తరచూ బంగారం, నగదు వితరణ చేసే సంపన్న భక్తులతో ఉన్నికృష్ణన్ సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడని సిట్ గుర్తించింది. అతను బంగారంతోపాటు.. శబరిమలకు చెందిన భూముల వ్యవహారంలోనూ తలదూర్చినట్లు సిట్ నిగ్గుతేల్చింది. అక్రమ మార్గాల్లో సంపాదించిన మొత్తంతో ఉన్నికృష్ణన్ కేరళతోపాటు.. బెంగళూరు శివార్లలో తన పేరిట, బినామీల పేరిట భవనాలు, భూములను కొనుగోలు చేసినట్లు నిర్ధారించింది. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుందని సమాచారం.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
