పాల్ఘర్: మహారాష్ట్రలోని పాల్ఘర్ పరిధిలో గల వాసాయిలో జరిగిన ఒక ఘటన పలువురిలో ఆందోళనను నింపింది. పాఠశాలకు కొద్ది నిమిషాలు ఆలస్యంగా వచ్చిందనే నెపంతో 12 ఏళ్ల ఆరో తరగతి విద్యార్థిని కాజల్ గోండ్‌కు ఉపాధ్యాయుడు కఠినమైన శిక్ష విధించారు.
భుజాలపై స్కూల్ బ్యాగు ఉంచుకుని, ఏకబిగిన వంద గుంజీలు తీయాలంటూ ఆదేశించాడు.
పాఠశాల తరగతులు ముగిసి, ఇంటికి చేరుకున్న కాజల్ తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. వెంటనే తల్లిదండ్రులు ఆ చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సూచనమేరకు ఆ చిన్నారిని ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. కాజల్ తల్లి షీలా గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..ఉపాధ్యాయులు విధించిన శిక్ష కారణంగా కాజల్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు చెప్పింది. తనలాగే మరికొందరు పిల్లలు కూడా 50 నుండి 100 గుంజీలు తీసినట్లు కాజల్ తెలిపింది. రెండుమూడు నిమిషాల ఆలస్యం అయిన కారణంగా టీచర్ తమ కూతురికి కఠిన శిక్ష విధించారని, అప్పటి నుంచి ఆమెకు అనారోగ్య సమస్యలు పెరిగాయని ఆ తల్లి కన్నీటితో మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ సంఘటనపై ముంబైలోని సర్ జెజె మార్గ్ పోలీస్ స్టేషన్‌లో తొలుత ప్రమాదవశాత్తూ సంభవించిన మృతిగా (Accidental Death) కేసు నమోదైంది. తరువాత ఈ కేసు వాలివ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యింది. పాఠశాలలో విధించిన అమానుష శిక్ష కారణంగానే తమ కుమార్తె మరణించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జేజే ఆస్పత్రి వైద్యులు కాజల్ కుటుంబ సభ్యులకు తెలిపిన వివరాల ప్రకారం.. కాజల్‌కు ఆస్తమా సమస్య ఉంది. ఇలాంటి పరిస్థితిలో, అదనపు బరువున్న బ్యాగును మోస్తూ, అధిక సంఖ్యలో గుంజీలు తీసిన కారణంగా ఆమె అంతర్గత రక్తస్రావానికి గురైంది. అది ఆ చిన్నారి మరణానికి దారితీసింది. పాఠశాలల్లో పిల్లలపై కఠిన శిక్షలు విధించడానికి ఉదాహరణగా నిలిచిన ఈ ఘటన మరోసారి కలకలం రేపింది.
ఇది కూడా చదవండి: పెళ్లి బృందంపై కారు విధ్వంసం.. నలుగురు మృతి


