బెట్టియా: బీహార్‌లోని బెట్టియా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లౌరియా-బాగా ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఒక కారు వివాహ అతిథుల బృందంపైకి దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దుర్ఘటనలో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వివాహ కార్యక్రమం ముగించుకుని తిరిగివస్తున్న అతిథులు రోడ్డు పక్కన నిలుచుని ఉండగా, అటుగా వచ్చిన ఒక కారు అదుపుతప్పి వారిని ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారందరినీ లౌరియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మరణించగా, చికిత్స పొందుతూ ఒక యువకుడు మృతి చెందాడు. బాధితుల్లో చాలా మందిని గుర్తించడం కష్టతరంగా మారిందని తెలుస్తోంది.
తీవ్రంగా గాయపడిన మొత్తం 16 మందికి తొలుత ప్రథమ చికిత్స అందించి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెట్టియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకుని, తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. నార్కటియాగంజ్‌లోని మాల్దహియా పోఖారియా నుండి బిషున్‌పూర్వాకు ఈ వివాహ అతిథుల బృందం వచ్చినట్లు సమాచారం. పెళ్లి వేడుకలు పూర్తయిన తర్వాత, పలువురు అతిథులు రోడ్డు పక్కన గుమిగూడి ఉండగా, అదుపు తప్పిన ఒక కారు వారిపైకి దూసుకెళ్లడం ఈ విషాదానికి కారణంగా నిలిచింది. కారు అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Pakistan: మళ్లీ ‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’ టార్గెట్.. రైలు వెళ్లగానే పేలుడు


