నసీరాబాద్: పాకిస్తాన్‌లో ‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’కు పెను ప్రమాదం తప్పింది. బలూచిస్తాన్‌లో గల నసీరాబాద్ జిల్లా గుండా రైలు వెళుతుండగా బాంబు దాడి జరిగింది. అయితే రైలు ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. షాహీద్ అబ్దుల్ అజీజ్ బుల్లో ప్రాంతంలో రైలు ట్రాక్‌ను దాటిన కొన్ని సెకన్ల తర్వాత రైల్వే ట్రాక్ వెంట అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) పేలిపోయింది. ఈ ఘటనతో రైల్వే ట్రాక్‌కు కొంత నష్టం వాటిల్లినప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. భద్రతా చర్యల్లో భాగంగా నాలుగు రోజుల పాటు నిలిపివేసిన తర్వాత, ఈ రైలు సేవలు తిరిగి ప్రారంభించిన వెంటనే ఈ దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది.
క్వెట్టా నుండి పెషావర్ వెళ్లే ఈ రైలుపై జరుగుతున్న దాడుల పరంపరలో ఈ తాజా ఘటన ఒకటి. దాడి జరిగిన వెంటనే పోలీసులు, భద్రతా దళాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, దర్యాప్తు ప్రారంభించాయి. నసీరాబాద్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గులాం సర్వార్, దాడికి పాల్పడినవారిని గుర్తించేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ధృవీకరించారు. ట్రాక్‌కు నష్టం జరగడం వలన క్వెట్టాతో పాటు ఇతర ప్రాంతాల మధ్య రైలు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
జాఫర్ ఎక్స్‌ప్రెస్ గత కొన్ని నెలలుగా తిరుగుబాటు గ్రూపులకు ప్రధాన లక్ష్యంగా మారింది. ఈ సంవత్సరంలో మార్చి, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లలో ఈ రైలుపై పలు దాడులు జరిగాయి. మార్చిలో నిషేధిత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ఈ రైలును హైజాక్ చేసింది. ఈ ఘటనలో 26 మంది మరణించారు. అక్టోబర్‌లో సింధ్‌లో జరిగిన పేలుడులో ఐదు కోచ్‌లు పట్టాలు తప్పగా, సెప్టెంబర్, ఆగస్టులలో జరిగిన దాడులలోనూ రైలుకు నష్టం వాటిల్లింది. పలువురు ప్రయాణికులు గాయాల పాలయ్యారు.
బలూచిస్తాన్ భౌగోళిక పరిస్థితులను అనువుగా చేసుకున్న తిరుగుబాటు గ్రూపులు కీలకమైన రైలు మౌలిక సదుపాయాలు, సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పాకిస్తాన్ రైల్వేలు నవంబర్ 9 నుండి 12 వరకు రైలు కార్యకలాపాలను నిలిపివేసినప్పటికీ, సేవలు తిరిగి ప్రారంభమైన వెంటనే దాడి జరగడం, భద్రతా వ్యవస్థకు సవాలుగా మారింది. పదేపదే జరుగుతున్న ఈ దాడులు రైల్వే ప్రయాణికులు, సిబ్బంది భద్రతపై ఆందోళనను మరింతగా పెంచుతున్నాయి.


