సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం సంభవించింది(Saudi Arabia Bus Accident). మక్కా నుండి మదీనాకు ఉమ్రా యాత్రికులతో వెళ్తున్న బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయి అందులోని 42 మంది సజీవ దహనం అయ్యారు. మృతుల్లో భారతీయులు.. అందునా హైదరాబాదీలే(తెలంగాణ) అత్యధికంగా ఉన్నట్లు సమాచారం.
స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి దాటాక 1.30గం. ప్రాంతంలో ముఫ్రిహాత్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీ కొట్టడంతో రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండడంతో అగ్నికి ఆహుతి అయ్యారు. మక్కా యాత్ర ముగించుకుని మదీనాకు వెళ్తున్న సమయంలో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది.
మృతుల్లో 11 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ప్రమాద స్థలంలో అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి. ఎంత మంది గాయపడ్డారు?.. ప్రమాదం నుంచి ఎవరైనా సురక్షితంగా బయటపడ్డారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
సౌదీ ఘోర ప్రమాదంలో మల్లేపల్లి బజార్ ఘాట్ ప్రాంతానికి చెందిన 16 మంది మృతి చెందారని తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కేంద్రం, సౌదీ ఎంబసీతో మాట్లాడాలని సూచించారు. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖతో ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంప్రదింపులు జరుపుతున్నారు.
కంట్రోల్ రూమ్ నెంబర్లు
సౌదీలో బస్సు ప్రమాదానికి సంబంధించిన వివరాలు, సహయచ చర్యల వివరాలు తెలుసుకునేందుకు తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలు 24X7 సమాచారం కోసం +91 79979 59754, +91 99129 19545 ఫోన్‌నెంబర్లను ఆశ్రయించాలని అధికారులు సూచిస్తున్నారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్‌తో సమన్వయం చేయాలని అధికారులకు ఇప్పటికే సీఎస్ అదేశాలు జారీ చేశారు.
జెడ్డా హెల్ప్‌లైన్ నెంబర్ ఇదే..
సౌదీ అరేబియాలో మదీనా సమీపంలో జరిగిన దుర్ఘటనలో భారతీయ ఉమ్రా యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. ఈ నేపథ్యంలో జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో 24x7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్: 8002440003 ద్వారా బాధితుల సమాచారం కోసం ఎప్పుడైనా సంప్రదించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.


