మాస్కో: ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రతరం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ రీజియన్‌లో ఉన్న ఓ కేఫ్ అండ్ హోటల్‌పై భారీ డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో 24 మంది చనిపోయారు. కొత్త సంవత్సర వేడుకల్లో పౌరులు ఉండగా ఈ దాడి చోటుచేసుకున్నట్లు ఖేర్సన్ గవర్నర్ తెలిపారు.

ఖోర్లీ గ్రామంలో ఉన్న ఆ హోటల్‌పై మూడు డ్రోన్లతో దాడి జరిగింది. ఘటనలో 24 మంది మరణించగా, 50 మంది గాయపడ్డారని అధికారులు టెలిగ్రామ్ చానెల్ ద్వారా వెల్లడించారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అంటున్నారు.
ఒకవైపు ట్రంప్ తన మధ్యవర్తిత్వంతో ఈ యుద్ధాన్ని ముగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే పుతిన్‌తో ఓసారి.. జెలెన్‌స్కీతో మూడుసార్లు భేటీ అయ్యారు. తాజాగా 90 శాతం శాంతి ప్రణాళిక ఖరారైనట్లేనని, ఏక్షణమైనా యుద్ధం ఆగిపోతుందని ట్రంప్ స్వయంగా ప్రకటించారు కూడా.
అయితే.. శాంతి చర్చల వేళ ఇరు దేశాలు మాత్రం డ్రోన్లతో పరస్పరం దాడులు జరుపుకుంటున్నాయి.. తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి జరగ్గా.. సైన్యం దానిని తిప్పి కొట్టింది. ఇది ఉక్రెయిన్ పనేనని మాస్కో ఆరోపిస్తుండగా.. కీవ్ మాత్రం అవి ఆరోపణలేనని తోసిపుచ్చింది. ఈ క్రమంలో.. ఆధారాలంటూ కొన్ని వీడియోలను బయటపెట్టింది రష్యా.


