జైపూర్: విజయ్ హజారే వన్డే టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళుతున్న ముంబైని మహారాష్ట్ర నిలువరించింది. గ్రూప్ ‘సి’లో శనివారం జరిగిన పోరులో మహారాష్ట్ర 128 పరుగుల భారీ తేడాతో ముంబైపై ఘనవిజయం సాధించింది. మొదట మహారాష్ట్ర 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 366 పరుగుల భారీ స్కోరు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అర్షిన్ కులకర్ణి (114 బంతుల్లో 114; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, పృథ్వీ షా (75 బంతుల్లో 71; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. తొలి వికెట్‌కు వీరిద్దరు 140 పరుగులు జోడించారు. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (52 బంతుల్లో 66; 7 ఫోర్లు)కూడా ఫిఫ్టీ బాదాడు. ఆఖర్లో రామకృష్ణ ఘోష్ (27 బంతుల్లో 64; 3 ఫోర్లు; 5 సిక్స్‌లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
తుషార్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత ముంబై 42 ఓవర్లలోనే 238 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ అంగ్‌క్రిష్ రఘువంశీ (88 బంతుల్లో 92; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), సిద్ధేశ్ లాడ్ (41 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రమే అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. మహారాష్ట్ర బౌలర్లలో ప్రదీప్ 3, సత్యజీత్ 2 వికెట్లు తీశారు. ఐదు మ్యాచ్‌లాడిన ముంబైకి ఇది తొలి పరాజయం కాగా, మహారాష్ట్రకిది మూడో విజయం.


