ఎక్కడికక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిన సర్కారు
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సూచికలు
శ్వాస ఇబ్బందులు ఎదురయ్యే భక్తుల కోసం ఆక్సిజన్ కేంద్రాలు
పథనంతిట్ట జనరల్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ కార్డియాలజీ ట్రీట్ మెంట్
పరిసర ఆసుపత్రుల్లో డీఫిబ్రిలేటర్లు, వెంటిలేటర్లు, కార్డియాక్ మానిటర్ల ఏర్పాటు
నీలక్కల్ బేస్ వద్ద పూర్తిస్థాయి ల్యాబ్‌లను ఏర్పాటు చేసిన అధికారులు
శబరిమల చరిత్రలోనే తొలిసారి పంపాబేస్, సన్నిధానం వద్ద ఆపరేషన్ థియేటర్లు
పందలం, అడూర్, వడసేరిక్కర, పథనంతిట్టల్లోనూ వైద్య సేవలు
తక్షణం వైద్య సాయం కోసం ఎమర్జెన్సీ నంబరు 04735-203232
పథనంతిట్ట: శబరిమలలో కొలువైన హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి సన్నిధానం ఈరోజు (నవంబరు 16) సాయంత్రం 5 గంటలకు తెరుచుకుంది. మేల్‌శాంతిగా ఎంపికైన ప్రసాద్ నంబూద్రి శనివారం ఉదయం పంపా బేస్ వద్ద ఇరుముడి కట్టుకుని, ఆదివారం సాయంత్రానికి సన్నిధానం చేరుకున్నారు. పద్దెనిమిది మెట్లను అధిరోహించిన తర్వాత ఆయన శబరిమల సన్నిధానం ద్వారాలకు హారతి ఇచ్చి, ఆలయం తలుపులును తెరిచారు. ఆ వెంటనే.. ‘స్వామియే.. శరణం అయ్యప్పా’ అనే భక్తుల శరణుఘోషలతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది.
మండల పూజ సీజన్‌లో శబరిమలకు వచ్చే భక్తుల కోసం కేరళ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు మౌలిక సదుపాయాలను కల్పించింది. అదేవిధంగా కేరళ వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. వైద్య కళాశాల ప్రొఫెసర్లు మొదలు.. పీజీ విద్యార్థులను రంగంలోకి దింపి.. శబరిమల మార్గంలో ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు, తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంపాబేస్‌లో 24 గంటలూ పనిచేసేలా వైద్య కేంద్రం పనిచేస్తుందని అధికారులు తెలిపారు. వైద్య శిబిరాలు ఎక్కడెక్కడున్నాయి? భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? అనే అంశాలపై దీర్ఘకాలిక వ్యాధులు, కొమార్బరిటీస్‌తో బాధపడే భక్తులు అత్యవసర స్థితిలో ఎవరిని సంప్రదించాలి? అనే అంశాలపై మళయాలంతోపాటు.. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో పైన పేర్కొన్న భాషల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ట్రెకింగ్ మార్గంలో..
పంపాబేస్ నుంచి శబరిమల సన్నిధానం వరకు పలు చోట్ల అత్యవసర వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా సముద్రమట్టానికి ఎత్తులో వెళ్తున్నప్పుడు శ్వాస ఇబ్బందులు ఎదురయ్యే భక్తుల కోసం ఆక్సిజన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మార్గంలో కొన్ని వైద్య కళాశాలలు బేస్ ఆస్పత్రులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పథనంతిట్ట జనరల్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ కార్డియాలజీ ట్రీట్ మెంట్, క్యాథ్ ల్యాబ్ ట్రీట్ మెంట్ అందుబాటులో ఉన్నట్లు వివరించారు. పంపాబేస్ వద్ద అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. పంపాకు సమీపంలో ఉన్న అన్ని ఆస్పత్రులలో డీఫిబ్రిలేటర్లు, వెంటిలేటర్లు, కార్డియాక్ మానిటర్లు ఉంటాయని తెలిపారు. నీలక్కల్ బేస్ వద్ద పూర్తిస్థాయి ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. శబరిమల చరిత్రలోనే తొలిసారి పంపాబేస్, సన్నిధానం వద్ద ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించారు. అటు అయ్యప్పస్వామి వంశస్తుల రాజ్యంగా పేర్కొనే పందలం వద్ద కూడా తాత్కాలిక డిస్పెన్సరీలు ఏర్పాటయ్యాయి. శబరిమలకు వచ్చే మార్గాల్లో అడూర్, వడసేరిక్కర, పథనంతిట్టల్లోనూ 24 గంటలు పనిచేసే ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయి.
భక్తులకు ప్రభుత్వ సూచనలు
ప్రస్తుతం వివిధ వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు తమ వైద్య రికార్డులను వెంట తెచ్చుకోవాలి
శబరి యాత్రకు కొద్దిరోజుల ముందు నుంచి నడక, తేలికపాటి వ్యాయామాలు చేయాలి
పంపాబేస్ నుంచి కొండను ఎక్కేప్పుడు వేగం పనికిరాదు. నిదానంగా కొండను అధిరోహించాలి. అవసరమైతే.. తరచూ విశ్రాంతి తీసుకోవాలి
కొండను అధిరోహించేప్పుడు అలసట, ఛాతీ నొప్పి రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే.. తక్షణం వైద్య సాయం కోసం 04735 203232 నంబరుకు కాల్ చేయాలి
కాచి, చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి
వివిధ వ్యాధులతో బాధపడేవారు బహిరంగ ప్రదేశాల్లో లభించే చిరుతిళ్లను తినకూడదు
నీలిమల, శరణ్‌గుత్తి ప్రాంతాల్లో పాములను పట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ విషకీటకాలు కరిస్తే.. వెంటనే 04735 203232 నంబరుకు కాల్ చేయాలి. తాత్కాలిక వైద్య శిబిరాల్లో పాముకాటుకు విరుగుడు ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి


