తిరువనంతపురం: శబరిమలలో భక్తుల రద్దీ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందంటూ విపక్షాలు మండిపడ్డాయి. కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు ఈ విషయంపై పినరయి విజయన్ సర్కారును దుయ్యబట్టారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం ఊమెన్ చాందీ పంపాకు వెళ్లి మరీ.. పరిస్థితిని సమీక్షించారని, వేర్వేరు శాఖలను సమన్వయపరిచి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నారని కేరళ అసెంబ్లీలో విపక్ష నేత వీడీ సతీశన్ అన్నారు.
బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శబరిమలలో ప్రస్తుత పరిస్థితి భయంకరంగా ఉందని దేవస్వం బోర్డు అధ్యక్షుడే స్వయంగా అన్న విషయాన్ని గుర్తుచేశారు. ‘గ్లోబల్ అయ్యప్ప సంగమం’ పేరుతో లాభాల వేట ప్రారంభించిన పినరయి సర్కారు.. భక్తుల సమస్యలను గాలికొదిలేసిందన్నారు.
‘‘భక్తులకు తాగునీరు లేదు. మరుగుదొడ్డ సౌకర్యం లేదు. క్యూలైన్లలో 10-15 గంటల పాటు నిలబడి.. ఇబ్బందులపాలవుతున్నారు. స్వాములు నడిచే దారిలో మురుగునీరు ప్రవహిస్తోంది. పంపానది మురికికూపంగా మారుతోంది. సీజన్ ప్రారంభానికి వారం ముందు నుంచే సన్నాహాలు చేయాల్సిన సర్కారు.. భక్తుల సదుపాయాలను గాలికొదిలేసింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే శబరిమల సీజన్‌ను గందరగోళం చేస్తోంది’’ అంటూ ఆయన మండిపడ్డారు. శబరిమల అభివృద్ధికి నిధులను ప్రకటించినా.. విడుదల చేయడం లేదని, స్వాములు నడిచే మార్గంలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని విమర్శించారు.

కేంద్రం జోక్యం తప్పనిసరి: బీజేపీ
శబరిమలలో భక్తులు అసౌకర్యానికి గురవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.మురళీధరన్, ఆ పార్టీ నేత పీకే కృష్ణదాస్ అన్నారు. శబరిమల చరిత్రలోనే తొలిసారి పరిస్థితులు దారుణంగా మారాయని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని విమర్శించారు.
‘‘కేంద్ర ప్రభుత్వం శబరిమల విషయంలో కచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోంది. త్వరలో శబరిమలకు బీజేపీ ప్రతినిధి బృందం వెళ్తుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సమాచారం అందజేశాం’’ అని వారు వివరించారు. నీలక్కల్ పార్కింగ్ ప్రదేశం మురికి కూపంగా తయారైందని, పంపాలో నీళ్లు నలుపురంగుకు మారిపోయాయని విమర్శించారు. దీనిపై ముఖ్యమంత్రిని విచారించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి విజయన్ యుద్ధప్రాతిపదికన ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్నారు.


