శబరిమలలో తెలుగు స్వాములకు ఘోర అవమానం!
Nov 19 2025 2:13 PM | Updated on Nov 19 2025 4:01 PM
శబరిమలలో ఈసారి అయ్యప్ప భక్తుల కోసం ఏర్పాట్లలో ఆలయ నిర్వాహకులు, అలాగే ప్రభుత్వం విఫలమవుతోందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులకు ఘోర అవమానం జరిగింది. ఓ పోలీస్ అధికారి భక్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో స్వాములు ఆందోళనకు దిగారు.
తాము దారి తప్పి వెళ్తన్న క్రమంలో ఓ పోలీస్ అధికారి ఎదురు పడ్డాడని.. దర్శనం క్యూ ఎక్కడ అని అడిగినందుకు ప్యాంట్ జిప్పు విప్పి అసభ్య సైగలు చేశాడని భక్తులకు తెలిపారు. ఈ మేరకు ఓ భక్తుడు మిగతా స్వాములతో ఆ వీడియోను తీసి నెట్‌లో షేర్ చేశాడు.
ఆ అధికారి తీరును ఖండిస్తూ తాము నిరసన చేపట్టామని.. ఇంతలో కొందరు అధికారులు ఆ పోలీసు అతన్ని దొడ్డిదారిన పంపించి రక్షించారని భక్తులు ఆరోపించారు. తెలుగు భాషలో మాట్లాడినందుకే తమకు ఇలాంటి ఘోర అవమానం ఎదురైందని భక్తులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. శబరిమలలో ఇతర రాష్ట్రాల భక్తులకు ఈ తరహా చేదు అనుభవాలు ఎదురు కావడం కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. అయితే.. ఈసారి భక్తులకు అలాంటి పరిస్థితులు ఎదురు కాబోవని నిర్వాహకులు ఇటు కేరళ ప్రభుత్వం, అటు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(TDB) భరోసా ఇచ్చాయి. అయినా కూడా ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అయితే ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది.
Advertisement
Advertisement


