కేరళ కేంద్రంగా ఇరాన్‌కు నడిచిన అవయవాల అక్రమ రవాణా కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు మధు జయకుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా అంతర్జాతీయ ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే మధు పిల్ల చేప మాత్రమేనని.. దీని వెనుక పెద్ద చేపలు చాలానే ఉన్నాయని.. త్వరలో ఆ వివరాలు బయటపెడతామని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కొచి కోర్టుకు బుధవారం నివేదించింది.
ఈ కేసులో ఇరాన్ నుంచి వచ్చిన ఎర్నాకులం వాసి మధు జయకుమార్‌ను నవంబర్ 8వ తేదీన కొచి ఎయిర్‌పోర్టులో ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. అయితే.. అతను ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా కేరళతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్యులు ఈ కుంభకోణంలో ఇన్‌వాల్వ్ అయ్యాయని తేలింది. అంతేకాదు ఒక్క మధునే ఇరాన్‌కు భారత్ నుంచి 14 మంది బాధితుల్ని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
2019 జనవరి నుండి 2024 మే మధ్య.. ఈ చానెల్ ద్వారా కేరళ నుంచి అనేక మందిని అక్రమంగా అవయవదానం కోసం తరలించినట్లు ఎన్‌ఐఎ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. కేసు కేవలం కేరళకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించిందని ఎన్‌ఐఏ వెల్లడించింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణలో కూడా ఈ రాకెట్ కార్యకలాపాలు నడుస్తున్నట్లు ఎన్‌ఐఏ కోర్టుకు తెలిపింది. అవయవాలు దానం చేసిన వాళ్లకు రూ.50 లక్షల దాకా ఆఫర్ చేసినట్లు బాధితుల వాంగ్మూలాన్ని ప్రస్తావించింది. మరోపక్క.. మధు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆసుపత్రులు, బాధితులు తదితర అంశాలపై విస్తృత దర్యాప్తు కొనసాగుతోంది.
కిందటి ఏడాది మే నెలలో త్రిస్సూర్‌కు చెందిన సబిత్ నసర్(30) కొచి ఎయిర్‌పోర్టులో అధికారులకు పట్టుబడ్డాడు. ఇరాన్ నుంచి వయా కువైట్ ద్వారా అతను వచ్చాడని, మానవ అవయవాల రవాణా అక్రమ ముఠాతో అతనికి లింకులు ఉన్నట్లు తేలడంతో ఈ వ్యవహారం కలకలం రేపింది. తన ఆధ్వర్యంలో కిడ్నీ మార్పిడి కోసం 20 మందిని తీసుకెళ్లానని.. అందులో చాలా మంది ఉత్తర భారతానికి చెందిన వాళ్లు ఉన్నారని పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ఎర్నాకులం పోలీసులు సిట్ ఏర్పాటు చేసి విచారణ జరపగా.. ఆ తర్వాత అది ఎన్‌ఐఏ చేతికి వెళ్లింది.
కిందటి ఏడాది అగష్టులో ఎన్‌ఐఏ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. మెడికల్ టూరిజం పేరిట అవయవాల అక్రమ రవాణా ముఠా నడిపించిన నలుగురు నిందితులు సబిత, సాజిత్ శ్యామ్, బెల్లంకొండ రాం ప్రసాద్, మధు జయకుమార్‌లను గుర్తించింది. ఇదంతా చట్టబద్ధమైన వ్యవహారమేనని బాధితులను నమ్మించి ఇరాన్‌కు తీసుకెళ్లినట్లు తేలింది. సోషల్ మీడియా, ఏజెన్సీల ద్వారా యువతను ఇందుకు లక్ష్యంగా చేసుకున్నట్లు నిర్ధారించుకుంది. అయితే అప్పటి నుంచి జయ కుమార్ పరారీలో ఉన్నాడు. అతను ఇరాన్‌లో ఉన్నాడనే సమాచారంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్‌పోల్ సాయంతో రెడ్‌కార్నర్ నోటీసును జారీ చేయించారు. చివరకు స్వదేశానికి వచ్చిన అతన్ని అరెస్ట్ చేయగా.. ఇందులో పెద్ద తలకాయలు ఉన్నట్లు చెబుతున్నాడు. దీంతో సమగ్ర దర్యాప్తు జరపాలని ఎన్‌ఐఏ భావిస్తోంది.


