breaking news
Human organs
-
ప్రింట్ కొడితే బాడీ పార్ట్లు వస్తాయా? షాకింగ్ నిజాలు!
త్రీడీ ప్రింటర్ల సహాయంతో ఇప్పటికే చిన్న చిన్న రాకెట్లు లేదా గేమింగ్ వస్తువులను తయారు చేస్తున్నాం. అదే ప్రింటర్లు మన చెవి, ఊపిరితిత్తులు లేదా చర్మం వంటి శరీర భాగాలను కూడా తయారు చేయగలిగితే? ఆ ప్రయత్నమూ జరగబోతోంది! శాస్త్రవేత్తలు ఇప్పటికే జీవకణాలను ‘ఇంక్’ (సిరా)గా ఉపయోగించి మానవ అవయవాల నమూనాలను తయారు చేసే పనిలో ఉన్నారు. బొమ్మలు, విగ్రహాలు లేదా లోహపు వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించే త్రీడీ ప్రింటింగ్ పద్ధతినే ఇక్కడ కూడా ఉపయోగిస్తున్నారు. ఇందులో ప్లాస్టిక్ లేదా లోహానికి బదులుగా జీవకణాలు ఉంటాయి. అయితే... ఇలా ప్రింట్ కొడితే అలా బాడీ పార్ట్లు వచ్చేయటం అన్నది ఫలించే ప్రయోగమేనా?!నిజానికి, ఇది అనుకున్నంత సులభం కాదు. మామూలు వస్తువులను తయారు చేసే ప్రింటర్లతో శరీర భాగాలను ప్రింట్ చేయలేం. పైగా కణాలను ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ పోతే అవి అవయవాలుగా మారవు. ఆ కణాలు ఒకదానితో ఒకటి కలిసి పనిచేయడానికి, వాటిని జెల్ లాంటి ఒక మెత్తటి పదార్థంతో కలపాల్సి ఉంటుంది. అది ఇంకా పరిశోధనల దశలోనే ఉంది. అయినప్పటికీ శాస్త్రవేత్తలు ఇప్పటికే చర్మం, మృదులాస్థి (కార్టిలేజ్), రక్తనాళాల నమూనాలను ప్రింట్ చేయగలిగారు. 2025లో ఆస్ట్రేలియాలోని పరిశోధకులు ఒక కొత్త పద్ధతిని ఉపయోగించి, ఒక బాధితురాలి చర్మ కణాలతో చేసిన ఇంక్‌ను నేరుగా ఆమె కాలిన గాయాలపై ప్రింట్ చేసి చికిత్స అందించారు.అంతా ‘ఇంక్’ లోనే ఉంది!సాధారణ త్రీడీ ప్రింటర్లలో ప్లాస్టిక్ లేదా లోహాలను ఇంక్గా ఉపయోగిస్తారు. కానీ ఈ బయోప్రింటర్లు... జీవకణాలను, వాటిని బతికించే ఒక పదార్థాన్ని ఇంక్గా ఉపయోగిస్తాయి. బయోఇంక్స్ అనేవి జీవకణాలను కలిగి ఉండే ఒక రకమైన ప్రత్యేకమైన జెల్లీ పదార్థాల వంటివి. ఇవి మెత్తగా, కాస్త కదులుతూ ఉన్నప్పటికీ, తమ రూపాన్ని కోల్పోకుండా లోపల ఉన్న కణాలకు రక్షణగా నిలుస్తాయి. వీటిని హైడ్రోజెల్స్ అని అంటారు. శాస్త్రవేత్తలు ఈ హైడ్రోజెల్స్‌ను తయారు చేయడానికి ‘ఆల్జినేట్’, ‘కోలాజెన్’ వంటి పదార్థాలను ఉపయోగిస్తారు.ఆల్జినేట్ సముద్రపు పాచి నుండి లభిస్తుంది. కోలాజెన్ అనేది మన చర్మం, ఎముకలలో ఉండే ఒక రకమైన ప్రొటీన్. అయితే, ఈ బయోఇంక్స్లో కేవలం కణాలు, జెల్ మాత్రమే ఉండవు. మన శరీరంలో కణాల చుట్టూ ఉండే వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించటానికి ఈ మిశ్రమంలో కొన్ని అదనపు పోషకాలను కూడా చేరుస్తారు. సాధారణ త్రీడీ సిరాలకు, బయోఇంక్స్కు ఉన్న ప్రధాన తేడా ఏమిటంటే వీటిలో ప్రాణమున్న కణాలు ఉంటాయి. ప్రింటింగ్ ప్రక్రియలో ఇవి చిన్న చిన్న నాజిల్స్ (గొట్టాల) ద్వారా ఒత్తిడికి గురవుతూ బయటకు వస్తాయి, అలాగే ఉష్ణోగ్రత మార్పులను తట్టుకోవాల్సి ఉంటుంది. కణాలు ఈ మార్పులన్నింటినీ తట్టుకుని బతికి ఉండేలాగే ఈ మిశ్రమాన్ని తయారుచేస్తారు.ప్రింటింగ్ పూర్తయిన తర్వాత, ఆ నిర్మాణాలను ‘ఇంక్యుబేటర్లు’ అనే ప్రత్యేక పెట్టెలలో ఉంచుతారు. ఇవి కణాలు పెరగడానికి కావలసిన సరైన వాతావరణాన్ని అందిస్తాయి. అక్కడ ఈ కొత్త కణాలు బలంగా తయారై, ఒకదానితో ఒకటి కలిసి కణజాలాలుగా (ఉదా : కీళ్లలోని గుజ్జు లేదా రక్తనాళాలు ఉన్న చర్మం పొరలుగా) ఎదుగుతాయి.దారికి రాని గుండె, కిడ్నీలుగుండె, మూత్రపిండాలు (కిడ్నీలు) వంటి సంక్లిష్టమైన, పూర్తిస్థాయిలో పనిచేసే అవయవాల తయారీపై పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కొన్ని మిల్లీమీటర్ల కంటే ఎక్కువ మందం ఉండే కణజాలాలలో ఒక పెద్ద సమస్య ఎదురవుతోంది: ప్రింట్ చేసిన కొద్దిసేపటికే ఆక్సిజన్, పోషకాలు అందక లోపల ఉన్న కణాలు చనిపోతున్నాయి. ‘రక్తనాళాలు’ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. కణజాలాల లోపల ఉండే కణాలకు ఆక్సిజన్ అందించడానికి, వ్యర్థాలను బయటకు పంపడానికి రక్తనాళాలు చాలా అవసరం. అవి లేకపోతే కణాలు బతకలేవు. అందుకే పూర్తిస్థాయి అవయవాలను ప్రింట్ చేయడానికి రక్తనాళాలను తయారు చేయడమే శాస్త్రవేత్తల ముందున్న అతి పెద్ద సవాలు.‘శాక్రిఫిషియల్ ఇంక్’ ప్రయోగంఈ సమస్యను వ్యాపనం (డిఫ్యూజన్) ప్రక్రియ ద్వారా అర్థం చేసుకోవచ్చు. (ద్రవాలు లేదా వాయువుల్లోని అణువులు, కణాలు ఎక్కువ సాంద్రత ఉన్న ప్రాంతం నుండి తక్కువ సాంద్రత ఉన్న ప్రాంతానికి వాటంతటవే కదిలే ప్రక్రియను వ్యాపనం అంటారు). ఆక్సిజన్.. కణజాలం లోపలికి కేవలం కొన్ని మిల్లీమీటర్ల వరకు మాత్రమే ప్రసరించగలదు. మందపాటి అవయవాలలో, ఆక్సిజన్ అందక లోపల ఉండే కణాలు ఊపిరాడక చనిపోతాయి. దీన్ని రోడ్లు లేని ఒక పెద్ద నగరంతో పోల్చవచ్చు. రోడ్లు లేకపోతే ఆహార పదార్థాల ట్రక్కులు లోపలికి రాలేవు, చెత్తను తీసుకువెళ్లే ట్రక్కులు బయటకు వెళ్లలేవు! ఈ సమస్యను దాటేందుకు శాస్త్రవేత్తలు కొన్ని మార్గాలలో ప్రయత్నిస్తున్నారు. అందులో ఒకటి.. ‘శ్యాకిఫిషియల్ ఇంక్’లను ఉపయోగించడం.మొదట ఈ ఇంక్‌తో రక్తనాళాల ఆకారంలో తాత్కాలిక నమూనాను ప్రింట్ చేస్తారు. దాని చుట్టూ అసలైన కణజాలాన్ని ప్రింట్ చేస్తారు. కణజాలం గట్టిపడిన తర్వాత, లోపల ఉన్న ఈ తాత్కాలిక ఇంక్ కరిగిపోతుంది. దాని స్థానంలో ఖాళీ గొట్టాల్లాంటి మార్గాలు ఏర్పడతాయి, వీటి ద్వారా రక్తం ప్రవహిస్తుంది. దీనితో పాటు, కణజాలాన్ని ప్రింట్ చేస్తున్నప్పుడే నేరుగా రక్తనాళాలను కూడా అందులోనే తయారుచేసే పద్ధతులపై శాస్త్రవేత్తలు ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు.అంతరిక్షంలో బయోప్రింటింగ్2025 సెప్టెంబర్ 17న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో, నాసా వ్యోమగామి జానీ కిమ్ ఒక ప్రత్యేక గ్లోవ్-బ్యాగ్ లో బయోప్రింట్ చేసిన కాలేయ కణజాలాన్ని పరీక్షించారు. లాబొరేటరీలో తయారు చేసిన త్రీడీ కణజాలాలు గురుత్వాకర్షణ లేని అంతరిక్ష వాతావరణంలో రక్తనాళాలుగా ఎలా రూపాంతరం చెందుతాయో అధ్యయనం చేయడానికి జానీ కిమ్ ఈ నమూనాలను మరొక పరిశోధనా పరికరంలోకి పంపారు.జీవకణాలను ఎలా ప్రింట్ చేస్తారు?!బయోఇంక్స్ ద్వారా టిష్యూలను (జీవకణాలను) తయారు చేయడానికి ఇంజనీర్లు అనేక రకాల పద్ధతులను అభివృద్ధి చేశారు. తాము తయారు చేయాలనుకుంటున్న అవయవాన్ని బట్టి ఆ పద్ధతిని ఎంచుకుంటారు. చాలా సందర్భాల్లో, టూత్‌పేస్ట్ ట్యూబ్ నుండి పేస్టును బయటకు నొక్కినట్లుగానే బయోఇంక్ కూడా ఒక గొట్టం ద్వారా బయటకు వస్తుంది. ఈ పద్ధతిని ‘ఎక్స్‌ట్రూజన్’ అంటారు. ఒక యంత్రం సహాయంతో ఈ ఇంక్ వచ్చే వేగాన్ని నియంత్రిస్తూ, ఒక పొర తర్వాత మరొక పొరను తయారుచేస్తారు.ఉదాహరణకు: చర్మాన్ని తయారుచేయడానికి మొదట చర్మం లోపలి పొరలో ఉండే ఫైబ్రోబ్లాస్టులు అనే కణాలను ప్రింట్ చేస్తారు. ఆ తర్వాత చర్మం వెలుపలి పొరను నిర్మించే కెరాటినోసైట్స్ అనే కణాలను దానిపై పొరలుగా వేస్తారు. ఇలా ప్రింట్ చేసిన నిర్మాణాన్ని ‘ఇంక్యుబేటర్’లో ఉంచుతారు. అది పూర్తి చర్మంగా ఎదుగుతుంది. చర్మం, మృదులాస్థి వంటి కాస్త మందంగా ఉండే భాగాలను తయారు చేయడానికి ఈ ఎక్స్‌ట్రూజన్ పద్ధతి చక్కగా పనిచేస్తుంది. కానీ ఇది కొంచెం నెమ్మదిగా జరిగే ప్రక్రియ. అంతే కాకుండా, సన్నని గొట్టం ద్వారా నొక్కి పంపడం వల్ల కణాలు స్వల్పంగా ఒత్తిడికి గురవుతాయి.ఇక, ఇంక్జెట్ బయోప్రింటింగ్ అనేది మరింత వేగవంతమైన, సున్నితమైన పద్ధతి. మనం ఆఫీసుల్లో ఉపయోగించే ప్రింటర్ కాగితంపై సిరా చల్లినట్లే, ఇది కూడా బయోఇంక్ చుక్కలను ట్రే ఉపరితలంపై చల్లుతుంది. ఇది సన్నని, పలుచని కణాల పొరలను తయారుచేయడానికి (ఉదా : రక్తనాళాల లోపలి పొరలు) బాగా ఉపయోగపడుతుంది. మరొక ఆధునిక పద్ధతిలో, పొరలు పొరలుగా కాకుండా మొత్తం నిర్మాణాన్ని ఒకేసారి తయారుచేస్తారు. ఇందులో కణాలు ఉన్న ఒక ప్రత్యేకమైన జెల్ కలిగిన గొట్టాన్ని వేగంగా తిప్పుతూ, దానిపై లేజర్ కాంతిని ప్రసరింపజేస్తారు. ఆ కాంతి పడగానే జెల్ క్షణాల్లో ఘనరూపంలోకి మారి మనకు కావలసిన ఆకారంలోకి వస్తుంది.ఈ లేజర్ పద్ధతి ద్వారా శాస్త్రవేత్తలు అనేక శాఖలుగా విడిపోయే సన్నని రక్తనాళాల వ్యవస్థను కేవలం కొన్ని సెకన్లలోనే తయారుచేయగలరు. కణాలు ఎక్కువ సేపు బయట వాతావరణంలో ఉంటే పాడైపోతాయి కాబట్టి, వేగంగా ప్రింట్ చేయడం చాలా ముఖ్యం.ఏమేమి ప్రింట్ చేస్తున్నారు?2022లో ఒక రోగికి వారి సొంత కణాలతో తయారు చేసిన త్రీడీ ప్రింటెడ్ చెవిని అమర్చారు. 2025 చివరిలో, చూపు లేని ఒక వ్యక్తికి శాస్త్రవేత్తలు బయోప్రింట్ చేసిన ‘కార్నియా’ (కనుగుడ్డు వెలుపలి పారదర్శక పొర)ను విజయవంతంగా అమర్చారు.చర్మ మార్పిడి (స్కిన్ గ్రాఫ్టింగ్) అనేది బయోప్రింటింగ్‌లో అత్యంత పురోగతి సాధించిన విభాగం. దెబ్బతిన్న చర్మం స్థానంలో కొత్త చర్మాన్ని అమర్చడాన్ని స్కిన్ గ్రాఫ్టింగ్ అంటారు. 2025లో ఆస్ట్రేలియాలో, కాలిన గాయాల బాధితులపై బయోప్రింటెడ్ చర్మాన్ని అతికించి పరీక్షించారు. ఈ చికిత్స పొందిన మొదటి మహిళ, తన కాలిపై ఉన్న గాయం పూర్తిగా నయమైందని విలేకరుల సమావేశంలో చూపించారు.ఇక ఎముకలను ప్రింట్ చేయడమైతే కాస్త కష్టమైన పనే. చర్మం లేదా మృదులాస్థి కాకుండా, ఎముకల్లో జీవకణాలతో పాటు గట్టి ఖనిజాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఎముకల నిర్మాణాలు (స్కాఫోల్డ్స్) తయారుచేస్తున్నారు. ఇవి శరీరంలోని సొంత ఎముక కణాలు వృద్ధి చెందేందుకు సహాయపడతాయి. అయితే, ప్రాణమున్న కణాలతో కూడిన అసలైన ఎముకను ప్రింట్ చేసి మనుషులకు అమర్చడం ఇంకా సాధ్యపడలేదు.ముందుడుగు ఎప్పటికి?2025 సెప్టెంబర్‌లో, పరిశోధకులు ‘గ్రేస్’ అనే త్రీడీ బయోప్రింటింగ్ విధానంతో ఒక ఆశాజనకమైన పురోగతిని సాధించారు. ఈ సాంకేతికత ద్వారా ప్రింట్ చేసిన కణజాలం చుట్టూ నేరుగా రక్తనాళాలను ప్రింట్ చేయడం సాధ్యమవుతుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే : మొదట ఒక ‘కంప్యూటర్–విజన్’ వ్యవస్థ కణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తిస్తుంది. తర్వాత, ఆ కణాలన్నింటికీ ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని అందించడానికి ఏ ఆకారంలో రక్తనాళాలు ఉంటే బాగుంటుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిర్ణయిస్తుంది.అనంతరం, కేవలం కొద్ది సెకన్లలోనే, బయోప్రింటర్.. గొట్టం లాంటి నిర్మాణాలను (రక్తనాళాలను) ప్రింట్ చేసి రక్తాన్ని సరఫరా చేయడం ప్రారంభిస్తుంది. ఇక్కడ వేగం అనేది అత్యంత ముఖ్యమైన అంశం. పాత పద్ధతుల్లో రక్తనాళాల వ్యవస్థను పొరలు పొరలుగా ప్రింట్ చేయడానికి గంటల సమయం పట్టేది. కానీ ‘గ్రేస్’ పద్ధతి ద్వారా కొన్ని సెకన్లలోనే ఇది పూర్తవుతుంది. దీనివల్ల ఆక్సిజన్ అందక కణాలు చనిపోయే ప్రమాదం తగ్గుతుంది.ఏమైనా, పూర్తిస్థాయి అవయవాలను తయారు చేయడానికి ఇంకా కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. పెద్ద ధమనుల నుండి చిన్న సన్నని రక్తనాళాల (క్యాపిల్లరీస్) వరకు చెట్టు కొమ్మల్లా ఉండే రకరకాల పరిమాణాల రక్తనాళాలను తయారుచేసి, వాటిని మనుషుల రక్త ప్రసరణ వ్యవస్థతో సజావుగా అనుసంధానించడం ఇప్పటికీ ఒక పెద్ద సవాలు. అయితే, బయోఇంక్స్, ప్రింటింగ్ వేగం పెరుగుతున్న కొద్దీ, రక్తనాళాలతో కూడిన కృత్రిమ అవయవాలను అమర్చే రోజులు చాలా వేగంగా దగ్గరపడుతున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, త్రీడీ బయోప్రింటింగ్ ద్వారా అవయవాలను తయారు చేయడం సాధ్యమా, కాదా అని కాదు... ఎప్పుడు సాధ్యమవుతుంది అని మాత్రమే!- సాక్షి స్పెషల్ డెస్క్ -
అతడో పిల్ల చేప.. ‘ఆర్గాన్’ స్కాంలో తెలంగాణకు లింకులు!
కేరళ కేంద్రంగా ఇరాన్‌కు నడిచిన అవయవాల అక్రమ రవాణా కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు మధు జయకుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అంతర్జాతీయ ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే మధు పిల్ల చేప మాత్రమేనని.. దీని వెనుక పెద్ద చేపలు చాలానే ఉన్నాయని.. త్వరలో ఆ వివరాలు బయటపెడతామని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కొచి కోర్టుకు బుధవారం నివేదించింది. ఈ కేసులో ఇరాన్ నుంచి వచ్చిన ఎర్నాకులం వాసి మధు జయకుమార్‌ను నవంబర్ 8వ తేదీన కొచి ఎయిర్‌పోర్టులో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అయితే.. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేరళతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్యులు ఈ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయ్యాయని తేలింది. అంతేకాదు ఒక్క మధునే ఇరాన్‌కు భారత్ నుంచి 14 మంది బాధితుల్ని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. 2019 జనవరి నుండి 2024 మే మధ్య.. ఈ చానెల్ ద్వారా కేరళ నుంచి అనేక మందిని అక్రమంగా అవయవదానం కోసం తరలించినట్లు ఎన్ఐఎ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. కేసు కేవలం కేరళకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించిందని ఎన్ఐఏ వెల్లడించింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణలో కూడా ఈ రాకెట్ కార్యకలాపాలు నడుస్తున్నట్లు ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. అవయవాలు దానం చేసిన వాళ్లకు రూ.50 లక్షల దాకా ఆఫర్ చేసినట్లు బాధితుల వాంగ్మూలాన్ని ప్రస్తావించింది. మరోపక్క.. మధు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆసుపత్రులు, బాధితులు తదితర అంశాలపై విస్తృత దర్యాప్తు కొనసాగుతోంది.కిందటి ఏడాది మే నెలలో త్రిస్సూర్‌కు చెందిన సబిత్ నసర్(30) కొచి ఎయిర్‌పోర్టులో అధికారులకు పట్టుబడ్డాడు. ఇరాన్ నుంచి వయా కువైట్ ద్వారా అతను వచ్చాడని, మానవ అవయవాల రవాణా అక్రమ ముఠాతో అతనికి లింకులు ఉన్నట్లు తేలడంతో ఈ వ్యవహారం కలకలం రేపింది. తన ఆధ్వర్యంలో కిడ్నీ మార్పిడి కోసం 20 మందిని తీసుకెళ్లానని.. అందులో చాలా మంది ఉత్తర భారతానికి చెందిన వాళ్లు ఉన్నారని పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ఎర్నాకులం పోలీసులు సిట్ ఏర్పాటు చేసి విచారణ జరపగా.. ఆ తర్వాత అది ఎన్ఐఏ చేతికి వెళ్లింది. కిందటి ఏడాది అగష్టులో ఎన్ఐఏ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. మెడికల్ టూరిజం పేరిట అవయవాల అక్రమ రవాణా ముఠా నడిపించిన నలుగురు నిందితులు సబిత, సాజిత్ శ్యామ్, బెల్లంకొండ రాం ప్రసాద్, మధు జయకుమార్‌లను గుర్తించింది. ఇదంతా చట్టబద్ధమైన వ్యవహారమేనని బాధితులను నమ్మించి ఇరాన్‌కు తీసుకెళ్లినట్లు తేలింది. సోషల్ మీడియా, ఏజెన్సీల ద్వారా యువతను ఇందుకు లక్ష్యంగా చేసుకున్నట్లు నిర్ధారించుకుంది. అయితే అప్పటి నుంచి జయ కుమార్ పరారీలో ఉన్నాడు. అతను ఇరాన్లో ఉన్నాడనే సమాచారంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్‌పోల్ సాయంతో రెడ్‌కార్నర్ నోటీసును జారీ చేయించారు. చివరకు స్వదేశానికి వచ్చిన అతన్ని అరెస్ట్ చేయగా.. ఇందులో పెద్ద తలకాయలు ఉన్నట్లు చెబుతున్నాడు. దీంతో సమగ్ర దర్యాప్తు జరపాలని ఎన్ఐఏ భావిస్తోంది. -
తోటా యాక్ట్.. అమలు దిశగా తెలంగాణ సర్కార్ మరో అడుగు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తోటా యాక్ట్ అమలు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. యాక్ట్‌లో పలు మార్పులు చేసి.. అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే యాక్ట్‌లో మార్పులు చేసి అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పర్యటించాలని అధికారులను వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. త్వరలోనే గుజరాత్‌తో సహా పలు రాష్ట్రాల్లో అధికారుల బృందం పర్యటించనుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తోటా యాక్ట్‌లో మార్పు బిల్లును తెలంగాణ ప్రభుత్వం పెట్టనుంది. యాక్ట్‌లో మార్పు వల్ల కార్పొరేట్ ఆసుపత్రుల దందాకు అడ్డుకట్ట వేస్తామని ప్రభుత్వం చెబుతోంది.రాష్ట్రంలో 1994 నాటి అవయవ మార్పిడి చట్టం ‘టీహెచ్‌ఓఏ’ (ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యుమన్ ఆర్గన్స్ యాక్ట్)ను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం గత పదకొండేళ్లుగా అమలు చేస్తూ వచ్చింది. దీంతో అవయవ మార్పిడి ఆశించిన స్థాయిలో జరగలేదు. కానీ ఇప్పుడు.. ఆ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2014లో తీసుకొచ్చిన ‘టీహెచ్ఓటీఏ–తోటా’ (ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యుమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్) చట్టాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేసేలా గత నెలలో శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించింది. దీంతో రాష్ట్రంలో మరింత పారదర్శకంగా, మానవ అవయవాల వ్యాపారాన్ని నిరోధించి, అవసరమైన వారికి చట్టబద్ధంగా, ఎక్కువ సంఖ్యలో అవయవ మార్పిడి జరిగేందుకు అవకాశం ఏర్పడింది.అవయవ దానం ఎంతో ఉదాత్తమైనది. సంకల్ప బలం ఉంటే గానీ సాధ్యమయ్యే విషయం కాదు. కొంతమంది కళ్లు, మూత్రపిండాలు ఇతర అవయవాలు దానం చేస్తారు. దాతలు చనిపోయాక వాటిని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. తమవారి ప్రాణాలు కాపాడేందుకు కుటుంబసభ్యులు కిడ్నీ దానం చేయడం కూడా అడపాదడపా జరుగుతుంటుంది. గతంలో అవయవ దానం అంటే చనిపోయిన వారి కళ్లు దానం చేయడమే అనుకునేవారు. కానీ పదేళ్లలో పెరిగిన అవగాహన వల్ల కళ్లతో పాటు ఇతర అవయవాల దానం కూడా పెరిగింది. అవయవ మార్పిడితో పునర్జన్మ పొంది ప్రాణాలు కాపాడుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది.తాజాగా ‘తోటా’ అమలు తీర్మానంతో ఇది మరింత ఊపందుకునే అవకాశం ఏర్పడింది. గత పదేళ్లలో రాష్ట్రంలో అవయవాలను దానం చేసిన వారి సంఖ్య 1,594 కాగా.. ఎవరైనా చనిపోయిన తర్వాత, బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి సేకరించిన కంటి కారి్నయా, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు ఇతర అవయవాలను ట్రాన్స్ ప్లాంట్ చేయడం ద్వారా పన్నెండేళ్లలో ఏకంగా 6 వేల మంది పునర్జన్మ పొందారు. ఇంకా 3,823 మంది అవయవ మార్పిడి కోసం రాష్ట్ర ప్రభుత్వ ‘జీవన్‌దాన్’ కార్యక్రమం కింద నమోదు చేసుకున్నారు. దీనిని బట్టే రాష్ట్రంలో అవయవ దానం, అవయవ మార్పిడిపై ప్రజల్లో అవగాహన ఎంతగా పెరుగుతోందో స్పష్టమవుతోంది. -
గురువుని మించిన శిష్యులు, అంతరిక్షానికి మనుషుల అవయవాలు!!
అమెరికాకు చెందిన ఇద్దరు కుర్రాళ్లు మనుషుల కృత్తిమ అవయవాల్ని స్పేస్‌లో స్టోర్ చేసేందుకు ప్రయోగాల్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ ప్రయోగాల్లో భాగంగా తొలిసారి వాళ్లిద్దరు తయారు చేస్తున్న ప్రత్యేక క్యాప్సుల్స్‌లో కొన్ని వస్తువుల్ని స్పేస్‌లోకి పంపి.. తిరిగి 25 రెట్లు వేగంతో భూమికి చేర్చాలని చూస్తున్నారు. ఈ ప్రయోగాల కోసం 10 మిలియన్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంతకీ వాళ్లిద్దరూ ఎవరని అనుకుంటున్నారా? ఒకరు కాలేజీ డ్రాపౌట్ కాగా మరొకరు స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ శిష్యుడు. భూమిపై ఏదైనా నష్టం జరిగి.. మనిషి మనుగుడ కష్టమైతే ఏం చేయాలి. అందుకే అంతరిక్షంలో ఇళ్లు ఏర్పాటు చేసేలా ఎలన్ మస్క్ ఆ దిశగా ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు అదే ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌లో ఇంటర్న్ షిప్‌ని మధ్యలోనే వదిలేసిన ఆయన శిష్యుడు జస్టిన్ ఫియాషెట్టి, మరో కాలేజీ డ్రాపౌట్ ఆస్టిన్ బ్రిగ్స్ తో కలిసి స్టార్టప్‌ను ప్రారంభించారు. ఆ స్టార్టప్ ముఖ్య ఉద్దేశం. మనుషుల కృత్తిమ అవయావాల్ని అంతరిక్షంలో స్టోర్ చేయడమే. అలా స్టోర్ చేసిన ఆర్టీఫిషియల్ ఆర్గాన్స్‌ను ట్రీట్మెంట్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడీ ఈ స్టార్టప్ ఐడియా అమెరికాలో హాట్ టాపిగ్గా మారింది. ఎందుకంటే స్పేస్ టూరిజం ఊపందుకోవడంతో.. ఈ ఇద్దరు యువకులు చేస్తున్న ప్రయోగం విజయవంతం అవుతుందని అందురు భావిస్తున్నారు. అందుకే ఇన్వెస్టర్లు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఆ పెట్టుబడులతోనే ఆ ఇద్దరు యువకులు ముందుగా వాళ్లు తయారు చేస్తున్న క్యాప్సుల్స్‌లో కొన్ని వస్తువుల్ని స్పేస్‌లోకి పంపించాలని ప్రయోగాల్ని కొనసాగిస్తున్నారు. అదే విజయవంతం అయితే కృత్రిమ మానవ అవయవాలను స్పేస్‌లో స్టోర్ చేసి.. అవసరం అనుకున్నప్పుడు ఆస్పత్రికి తరలించవచ్చు. ఇందుకోసం అంతరిక్షంలో స్పేస్ స్టోరేజ్ యూనిట్లు మొబైల్ హాస్పిటల్ యూనిట్లను ఏర్పాటు చేయోచ్చని జస్టిన్ ఫియాషెట్టి, ఆస్టిన్ బ్రిగ్స్ చెబుతున్నారు. మరి వాళ్లిద్దరు ప్రారంభించిన స్టార్టప్ విజయ వంతం అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మరిన్ని ప్రయోగాల్ని చేయాల్సి ఉంటుంది. చదవండి: గ్యాప్ తీసుకోలేదు..వచ్చింది అంతే! ఎలన్ మస్క్ యుద్ధం వచ్చినా ఆగేలా లేడే! -
మూడు కిడ్నీలు, ఆరు లివర్లుగా వ్యాపారం..!
సాక్షి, న్యూఢిల్లీ : మూలిగే నక్క మీద తాడిపండు పడ్డట్టు ఆర్థికంగా దివాలా తీసిన ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడంతో అక్కడ పేదరికం పెచ్చరిల్లుతోంది. కూడు, గుడ్డ కరువైన పేద వారు అక్కడ బతకడం కోసం కిడ్నీల నుంచి కాలేయం వరకు శరీర అవయవాలను అమ్ముకుంటున్నారు. దాంతో మూడు కిడ్నీలు, ఆరు లివర్లుగా అక్కడ అవయవాల వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో టెహరాన్‌లోని ఓ వీధి కాస్త ‘కిడ్నీ స్ట్రీట్’గా మారిందని, అక్కడ పదివేల డాలర్లకు కిడ్నీ, 50 వేల డాలర్లకు లివర్ దొరుకుతోందని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇరాన్ (ఎన్సీఆర్ఐ)’ వెల్లడించింది. తాము సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాం.. కొనేవాళ్లు తమను సంప్రదించేందుకు వీలుగా టెహ్రాన్‌లోని కిడ్నీ స్ట్రీట్‌లో తమ కిడ్నీలను అమ్ముకోదలచిన వారు తమ పేరు, బ్లడ్ గ్రూప్, ఫోన్ నెంబర్లను రాసిన చీటీలను గోడల మీద అతికించి పోతున్నారని ఎన్సీఆర్ఐ వర్గాలు తెలిపాయి. దివ్యాంగురాలైన తన తల్లి సంరక్షణ కోసం తన కిడ్నీని అమ్మకానికి పెట్టిన పీహెచ్డీ విద్యార్థితోపాటు, రెండు కిడ్నీలతోపాటు ఎముక మూలుగను కూడా అమ్మకానికి పెట్టిన ఓ 26 ఏళ్ల యువకుడి వివరాలు ‘మానవ అవయవాల అమ్మకాలు జరిపే ఓ వెబ్సైట్’లో ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా తమ అవయవాలను అమ్మకానికి పెట్టిన వారిలో ఎక్కువ మంది తాము క్రీడాకారులమని, తాము సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామని ఆ వెబ్సైట్లో ప్రకటనలు కూడా ఇస్తున్నారు. ఆ వెబ్సైట్ ద్వారా కాలేయం 15 వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్ల వరకు, కిడ్నీలు పదివేల డాలర్ల వరకు, ఎముకల మూలుగ పది వేల డాలర్ల వరకు అమ్ముడు పోతున్నాయని ఆ వర్గాలు వివరించాయి. ఎక్కడ చూసినా అవే వివరాలు.. ‘కిడ్నీ స్ట్రీట్’లోని అన్ని ఆస్పత్రుల వద్ద అవయవ అమ్మకం దార్ల పేర్లు, ఫోన్ నెంబర్ల వివరాలు విరివిగా లభిస్తున్నాయని ఓ ఏజెంట్ తెలిపారు. ఏ గోడ మీద చూసినా, ఏ తలుపు మీద చూసిన వారి వివరాలు ఉంటున్నాయని, తనను ఈ విషయంలో సంప్రదించిన వాళ్లే కొన్ని వందల మంది ఉంటారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఆ ఏజెంట్ తెలిపారు. అమెరికా–ఇరాన్ అణు ఒప్పందం నుంచి ఇరాన్ బయటకు వచ్చిన 2015 సంవత్సరంలో ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. సౌదీ అరేబియాలోని ఓ చమురు క్షేత్రంపై ఇటీవల జరిగిన డ్రోన్ దాడి వెనక కూడా ఇరాన్‌నే ఉందన్న ఆరోపణలతో అమెరికా గురువారం నాడు కూడా మరిన్ని ఆంక్షలు విధించింది. దాంతో ఇరాన్ ప్రజల్లో ఆర్థిక వ్యవస్థ పట్ల భయాందోళనలు తీవ్రమయ్యాయి. -
పందుల్లో మానవ అవయవాల పెంపకం
పందుల్లో మానవ అవయవాలను పెంచడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఎన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నా అమెరికాకు చెందిన కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మాత్రం దీనివైపే మొగ్గు చూపుతున్నారు. రోగులకు అవసరమైన కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు తదితర అవయవాలను దానం చేసే దాతలు తగినంత మంది అందుబాటులోలేని నేటి సమాజంలో ఇదొక్కటే తమ ముందున్న ప్రత్యామ్నాయమని వారు వాదిస్తున్నారు. మానవ అవయవాలను పంది పిండంలో పెంచడం వల్ల పంది మెదడులో ఊహించని మార్పులు సంభవించవచ్చని, వాటికి కూడా ఏదో రకమైన మానవ లక్షణాలు రావచ్చని, ఈ సంకర పద్ధతి సహజ ప్రకృతికి విరుద్ధమనే వాదనను కూడా వారు కొ్ట్టేస్తున్నారు. పంది పిండంలోకి మానవ మూలకణాలను ఎక్కించి 28 రోజులపాటు అవి ఆ పిండంలో పెరిగేందుకు వీలు కల్పిస్తామని, దీన్ని సంకర పిండమని పిలుస్తామని, ఆ పిండం పిల్లగా మారడానికి ముందే వాటిని తొలగిస్తామని యూనివర్శిటీకి చెందిన డేవిస్ అనే ప్రొఫెసర్ తెలియజేస్తున్నారు. పిండం పెరిగే దశలో పంది మెదడులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం లేదని, ఒక్క పిండంలో తప్పించి పంది ఏ అవయవాల్లోను ఎలాంటి మార్పులు లేవని తమ పరిశోధనల్లో తేలినట్లు ఆయన వాదిస్తున్నారు. పిండాన్ని పిల్లగా ప్రసవించేందుకు పందికి అవకాశం కల్పిస్తేనే ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరించినట్లు అవుతుందని ఆయన అంటున్నారు. మానవ రోగికి అవసరమైన రీతిలో అవయవాలను పెరిగేలా చేయడం కోసం సంకర పిండాన్ని రెండు దశల్లో ఎడిట్ చేస్తామని, మొదటి దశను క్రిస్మర్ అని పిలుస్తామని డేవిస్ తెలిపారు. పంది క్లోమగ్రంధి పెరిగేదశలో దానికి సంబంధించిన డీఎన్ఏను తొలగించేందుకు క్రిస్పర్ టెక్నిక్కు ఉపయోగిస్తామని ఆయన వివరించారు. రెండో దశలో 'హ్యూమన్ ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్' మూల కణాలను పిండంలోకి ఎక్కిస్తామని, ఈ కణాల వల్ల పందిపిండంలో మానవ క్లోమగ్రంధి ఏర్పడుతుందని ఆయన వివరించారు. మానవ అవయవాలకు పంది మంచి 'బయోలోజికల్ ఇంక్యుబేటర్' అని ఇలాంటి ప్రయోగాలకు నేతత్వం వహిస్తున్న పాబ్లో రోస్ తెలిపారు. దాతాలు ఇచ్చే అవయవాలకన్నా యవ్వనంగా, ఆరోగ్యకరంగా పందుల్లో పెంచుతున్న మానవ అవయవాలు ఉంటున్నాయని ఆయన చెప్పారు. పందులను మానవ ఇంక్యుబేటర్‌గా వాడడాన్ని జంతుకారుణ్య సంస్థలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది అనైతికమని వాదిస్తున్న వైద్యనిపుణులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గతేడాది అమెరికా జాతీయ వైద్య పరిశోధనా సంస్థ ఇలాంటి ప్రయోగాలకు నిధులు సమకూర్చడంపై ఆంక్షలు విధించింది. మానవ అవయవాలను దానం చేసేందుకు చాలినంత మంది దాతలు పెరిగిన పక్షంలో పందులపై ఆధారపడాల్సిన అవసరం లేదని, అంతవరకు ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించక తప్పదని ఇలాంటి ప్రయోగాలు నిర్వహించే మిన్నేసోటాకు చెందిన కంపెనీ యజమాని స్కాట్ ఫహ్రేన్ క్రగ్ అంటున్నారు. బ్రిటన్‌లో ఎప్పుడు చూసినా అవయవ దానం కోసం ఏడువేల మంది రోగులు నిరీక్షిస్తూ ఉంటారని, అవయవాలు దొరక్క వారిలో వందలాది మంది చనిపోతున్నారని ఆయన చెప్పారు. -
పోలీసులను, ప్రజలను హడలెత్తించిన ప్రచారం
మచిలీపట్నం: మచిలీపట్నంలో ఆదివారం జంట హత్యలు జరిగాయంటూ జరిగిన ప్రచారం అటు పోలీసులను, ఇటు ప్రజలను హడలెత్తించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సైతం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. బందరు డీఎస్పీ సహా పలువురు ఎస్.ఐ.లు, సిబ్బంది మృత దేహాలు పడి ఉన్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఆ ప్రాంతంలో మానవ శరీర అవయవాలు కుళ్లిపోయి పడి ఉన్నాయి. మునిసిపల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వాటిని అలా వదిలివేయడం కలకలం రేపిందని పోలీస్ అధికారులు తేల్చి చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అసలు జరిగింది ఇదీ.. జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని రెండు అనాథ శవాలను శనివారం మధ్యాహ్నం మునిసిపల్ సిబ్బంది ఖననం చేసేందుకు బైపాస్ రోడ్డులోని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. మద్యం మత్తులో ఉన్న వారు వాటిని ఖననం చేయకుండా భద్రపరచిన అట్టపెట్టెల్లోనే చెట్ల మధ్య విసిరేసి వెనుదిరిగారు. ఆదివారం ఉదయం పెట్టెల్లోని అవయవాలను స్థానికంగా సంచరించే పందులు, కుక్కలు పీక్కుతింటూ ఆ ప్రాంతవాసుల కంటపడ్డాయి. దీంతో కంగారుపడిన స్థానికులు పలువురు ఎవరినో హత్య చేసి చెట్ల మధ్య పడేశారంటూ ప్రచారం మొదలుపెట్టారు. డీఎస్పీ డి.ఎస్. శ్రావణ్‌కుమార్, చిలకలపూడి స్టేషన్ ఎస్ఐలు, సిబ్బంది హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. శరీర అవయవాలతో పాటు అట్టపెట్టెల్లో కెమికల్స్ ఉండడంతో బాక్సులను తెరచి చూసిన పోలీసులు విషయాన్ని గ్రహించి ఆస్పత్రిలోని శవాలను శ్మశానవాటికలో ఖననం చేయాల్సిన మునిసిపల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వదిలేయడంతో హత్యలు జరిగినట్లు స్థానికులు భావించి భయభ్రాంతులకు గురైనట్లు తేల్చారు. ఈ విషయమై మునిసిపల్ కమిషనర్ ఎ.మారుతీదివాకర్ మాట్లాడుతూ ఆస్పత్రిలోని శవాలను మునిసిపల్ సిబ్బందితో ఖననం చేయించాలంటే ముందుగా పురపాలక సంఘానికి ఆస్పత్రి తరపున లెటర్ పెడితే అప్పుడు సిబ్బందిని అక్కడికి పంపుతామని చెప్పారు. జరిగిన వ్యవహారంలో తమకెలాంటి సమాచారం లేదని, అయినప్పటికీ ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.


