కిడ్నీల నుంచి కాలేయం వరకు అమ్మకాలు

Kidney And Liver Market Running Successfully In Iran - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మూలిగే నక్క మీద తాడిపండు పడ్డట్టు ఆర్థికంగా దివాలా తీసిన ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడంతో అక్కడ పేదరికం పెచ్చరిల్లుతోంది. కూడు, గుడ్డ కరువైన పేద వారు అక్కడ బతకడం కోసం కిడ్నీల నుంచి కాలేయం వరకు శరీర అవయవాలను అమ్ముకుంటున్నారు. దాంతో మూడు కిడ్నీలు, ఆరు లివర్లుగా అక్కడ అవయవాల వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో టెహరాన్‌లోని ఓ వీధి కాస్త ‘కిడ్నీ స్ట్రీట్‌’గా మారిందని, అక్కడ పదివేల డాలర్లకు కిడ్నీ, 50 వేల డాలర్లకు లివర్‌ దొరుకుతోందని పారిస్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రెసిస్టెన్స్‌ ఆఫ్‌ ఇరాన్‌ (ఎన్‌సీఆర్‌ఐ)’ వెల్లడించింది. 

తాము సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాం..
కొనేవాళ్లు తమను సంప్రదించేందుకు వీలుగా టెహ్రాన్‌లోని కిడ్నీ స్ట్రీట్‌లో తమ కిడ్నీలను అమ్ముకోదలచిన వారు తమ పేరు, బ్లడ్‌ గ్రూప్, ఫోన్‌ నెంబర్లను రాసిన చీటీలను గోడల మీద అతికించి పోతున్నారని ఎన్‌సీఆర్‌ఐ వర్గాలు తెలిపాయి. దివ్యాంగురాలైన తన తల్లి సంరక్షణ కోసం తన కిడ్నీని అమ్మకానికి పెట్టిన పీహెచ్‌డీ విద్యార్థితోపాటు, రెండు కిడ్నీలతోపాటు ఎముక మూలుగను కూడా అమ్మకానికి పెట్టిన ఓ 26 ఏళ్ల యువకుడి వివరాలు ‘మానవ అవయవాల అమ్మకాలు జరిపే ఓ వెబ్‌సైట్‌’లో ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా తమ అవయవాలను అమ్మకానికి పెట్టిన వారిలో ఎక్కువ మంది తాము క్రీడాకారులమని, తాము సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామని ఆ వెబ్‌సైట్‌లో ప్రకటనలు కూడా ఇస్తున్నారు. ఆ వెబ్‌సైట్‌ ద్వారా కాలేయం 15 వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్ల వరకు, కిడ్నీలు పదివేల డాలర్ల వరకు, ఎముకల మూలుగ పది వేల డాలర్ల వరకు అమ్ముడు పోతున్నాయని ఆ వర్గాలు వివరించాయి.

ఎక్కడ చూసినా అవే వివరాలు..
‘కిడ్నీ స్ట్రీట్‌’లోని అన్ని ఆస్పత్రుల వద్ద అవయవ అమ్మకం దార్ల పేర్లు, ఫోన్‌ నెంబర్ల వివరాలు విరివిగా లభిస్తున్నాయని ఓ ఏజెంట్‌ తెలిపారు. ఏ గోడ మీద చూసినా, ఏ తలుపు మీద చూసిన వారి వివరాలు ఉంటున్నాయని, తనను ఈ విషయంలో సంప్రదించిన వాళ్లే కొన్ని వందల మంది ఉంటారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఆ ఏజెంట్‌ తెలిపారు. అమెరికా–ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి ఇరాన్‌ బయటకు వచ్చిన 2015 సంవత్సరంలో ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. సౌదీ అరేబియాలోని ఓ చమురు క్షేత్రంపై ఇటీవల జరిగిన డ్రోన్‌ దాడి వెనక కూడా ఇరాన్‌నే ఉందన్న ఆరోపణలతో అమెరికా గురువారం నాడు కూడా మరిన్ని ఆంక్షలు విధించింది. దాంతో ఇరాన్‌ ప్రజల్లో ఆర్థిక వ్యవస్థ పట్ల భయాందోళనలు తీవ్రమయ్యాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top