చెన్నై: శబరిమలకు నడిచే ప్రైవేటు బస్సుల విషయంలో తమిళనాడు వర్సెస్ కేరళ అన్నట్లుగా పరిస్థితులు మొదలయ్యాయి. దీంతో 10 రోజుల పాటు కేరళకు బస్సులను నడిపేది లేదంటూ తమిళనాడు ప్రైవేటు బస్ ఆపరేటర్లు భీష్మించుకున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇప్పటికే తమకు రూ.22 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రైవేట్ బస్ ఆపరేటర్లు చెబుతున్నారు.
వివాదమేంటి??
శబరిమల సీజన్ ప్రారంభం కావడంతో.. ఎప్పటిలాగే తమిళనాడు ప్రైవేటు బస్ ఆపరేటర్లు కేరళకు సర్వీసులను ప్రారంభించారు. నిజానికి ప్రభుత్వ రవాణా సంస్థలు నడిపే బస్సుల సంఖ్య డిమాండ్‌కు అనుగుణంగా లేకపోవడంతో.. ఆ భర్తీని ప్రైవేటు బస్ ఆపరేటర్లు తీరుస్తున్నారు. 150 వరకు బస్సులు తమిళనాడులోని వేర్వేరు ప్రాంతాల నుంచి అయ్యప్ప భక్తులను శబరిమలకు తీసుకువస్తుంటాయి. అయితే.. ఈసారి సీజన్ ప్రారంభమైనా.. తమిళనాడు బస్ ఆపరేటర్లకు కేరళ రాష్ట్ర రవాణా శాఖ పర్మిట్లు ఇవ్వలేదు. పర్మిట్లు లేకుండా.. ఆల్-ఇండియా టూరిస్టు అనుమతి పత్రాలతో తమ రాష్ట్రంలోకి వచ్చే బస్సులకు భారీ జరిమానాలు విధించింది. దీంతో.. బస్ ఆపరేటర్లు కేరళకు బస్సులు నడిపేది లేదని తేల్చిచెప్పారు. 10 రోజుల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు ప్రైవేటు బస్సుల యజమానుల సంఘం అధ్యక్షుడు ఎన్.అంబలగన్ మీడియాకు తెలిపారు.
కేరళీయులకూ ఇబ్బందులే..
అయ్యప్ప భక్తులను శబరిమలకు తీసుకువచ్చే ప్రైవేటు బస్సులు.. తిరుగు ప్రయాణంలో తమిళనాడుకు వచ్చే కేరళీయులకు సేవలు అందిస్తున్నాయి. తమిళనాడులోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ బస్సులు సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ విషయంలో భక్తులు, ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, కేరళ సర్కారు ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వాలని, ప్రైవేటు బస్ ఆపరేటర్లపై వేధింపులను ఆపాలని అంబలగన్ డిమాండ్ చేశారు. భక్తుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, మినీ బస్సులకు కూడా అనుమతినివ్వాలని కోరారు. ఇందుకోసం కేరళ సర్కారుతో చర్చలకు సిద్ధమని పేర్కొన్నారు.


