ఇకపై 20 వేల మందికే స్పాట్ బుకింగ్
ఆ సంఖ్య దాటితే.. తర్వాతి రోజు స్లాట్ కేటాయింపు
నీలక్కల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
అయ్యప్ప దర్శనానికి 6 గంటల సమయం
కుప్పకూలి మృతిచెందిన 58 ఏళ్ల భక్తురాలు
పథనంతిట్ట: ముందెన్నడూ లేనివిధంగా మండల పూజ ప్రారంభం నుంచే శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. ఆదివారం సాయంత్రం సన్నిధానంలో అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకోగా.. సోమవారం రికార్డు స్థాయిలో 1.25 లక్షల మంది భక్తులు ఆ హరిహరపుత్రుడిని దర్శించుకున్నారు. నిజానికి ఆన్‌లైన్ (www.sabarimalaonline.org)లో రోజుకు 70 వేల మందికి స్లాట్ బుకింగ్ అవకాశం కల్పించారు. అదనంగా 20వేల మందికి స్పాట్ బుకింగ్‌కు ఏర్పాట్లు చేశారు. అయితే.. సోమవారం ఏకంగా 37 వేల మంది భక్తులు స్పాట్ బుకింగ్ చేసుకున్నారని, అందుకే రద్దీ విపరీతంగా పెరిగిందని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) అధికారులు చెబుతున్నారు.
భారీ క్యూలైన్లు
సోమవారం నుంచి నీలక్కల్, పంపాబేస్, శబరిమల సన్నిధానం కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా.. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు కనిపిస్తున్నారు. పంపా కంట్రోల్ రూమ్ వద్ద బస్సు దిగిన భక్తులు త్రివేణీ బ్రిడ్జిని దాటడానికి అరగంట పట్టిందని, అక్కడి నుంచి పంపా గణపతి ఆలయానికి చేరుకోవడానికి గంట సమయం పట్టిందని కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌కు చెందిన సుందరేశ అనే భక్తుడు ‘సాక్షి డిజిటల్’కి వివరించారు. ఇక శరణ్‌గుత్తి ప్రాంతంలోనూ నిమిషానికి నాలుగు అడుగులు వేసేలా రద్దీ ఉందని హైదరాబాద్‌కు చెందిన పవన్ కుమార్ గురుస్వామి వివరించారు. మారక్కూటం నుంచి 18 మెట్ల వరకు గంట సమయం.. పదునెట్టాంబడిని అధిరోహించాక.. అయ్యప్ప స్వామి దర్శనానికి మరో గంట పడుతోందని పేర్కొన్నారు. వృద్ధులు, చిన్నారులను నేరుగా ధ్వజస్తంభం నుంచి అయ్యప్ప దర్శనానికి వదులుతున్నా.. 18 మెట్లను చేరేవరకు వారికి ఇబ్బందులు తప్పడం లేదని సైదాబాద్‌కు చెందిన రవికుమార్ గురుస్వామి తెలిపారు. నీలిమలను అధిరోహించినప్పటి నుంచి భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకోవడానికి 6 గంటల సమయం పడుతున్నట్లు వివరించారు.
నీలక్కల్‌లోనే నిలిపివేత
భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పంపాలో స్పాట్ బుకింగ్ కౌంటర్ల సంఖ్యను 7కు పెంచినట్లు అధికారులు తెలిపారు. అయితే.. పంపా బేస్‌లో రద్దీని బట్టి ఆన్‌లైన్ బుకింగ్ లేని భక్తులను నీలక్కల్‌లో నిలిపివేస్తున్నామన్నారు. నీలక్కల్‌లో భక్తులకు వసతి సదుపాయాలున్నాయని వెల్లడించారు. అటు పంపాబేస్ నుంచి నీలిమలను అధిరోహించాక శరణ్‌గుత్తి, మారక్కూటం క్యూకాంప్లెక్సుల్లో తాగునీరు, స్నాక్స్, టీ, కాఫీ అందజేసే వెసులుబాట్లు కల్పిస్తామన్నారు. ప్రతిచోట సిబ్బందిని నియమించామన్నారు. రద్దీని అదుపుచేయడానికి ఎక్కడికక్కడ పోలీసులను మోహరించినట్లు అదనపు డీజీపీ ఎస్.శ్రీజిత్ వివరించారు. భక్తులు పరిస్థితిని అర్థం చేసుకుని, పోలీసులకు సహకరించాలని కోరారు. ‘‘సోమవారం 20 వేల మందికి స్పాట్ బుకింగ్‌కు ఏర్పాట్లు చేశాం. అయితే.. 37 వేల మంది భక్తులు వచ్చారు. అందుకే.. బుధవారం నుంచి 20 వేల స్పాట్ బుకింగ్ నిబంధనను కచ్చితంగా పాటిస్తాం. అదనంగా వచ్చే భక్తులకు తర్వాతి రోజు స్లాట్లను కేటాయిస్తాం’’ అని ఆయన వెల్లడించారు. ఈ సీజన్‌లో మంగళవారం మధ్యాహ్నం వరకు 1.97 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లు తెలిపారు.

నీలక్కల్ వద్ద భారీగా ట్రాఫిక్
శబరిమలకు వ్యక్తిగత వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో.. ఎరుమేలి-పంపా, రాణి-పంపా మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్‌లు నెలకొంటున్నాయి. ముఖ్యంగా ప్లాపల్లి, నీలక్కల్ వద్ద వాహనాలు నత్తనడకను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కాగా.. అప్పాచిమేడు ప్రాంతంలో ఓ భక్తురాలు కుప్పకూలి మృతిచెందారు. ఆమెను కోళిక్కోడ్ జిల్లా కోయిలాండికి చెందిన సతీ(58)గా పోలీసులు గుర్తించారు. భారీ క్యూలైన్ల కారణంగా ఆమె ఊపిరి ఆడక.. ఉక్కిరిబిక్కిరి అయ్యి.. మరణించినట్లు తెలుస్తోంది.


