పథనంతిట్ట: శబరిమలలో రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు తప్పిపోకుండా ఉండేందుకు కేరళ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గడిచిన నాలుగు రోజుల్లో శబరిమలకు వచ్చిన భక్తుల్లో చిన్నారుల వాటా 15శాతంగా ఉండడంతో.. వారి భద్రతకు వొడఫోన్-ఐడియా(వీఐ)తో కలిసి సురక్ష బ్యాండ్‌లను ప్రవేశపెట్టారు. తప్పిపోయిన చిన్నారులను ట్రాక్ చేసేందుకు ఈ బ్యాండ్ ఉపయోగపడుతుంది.
బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసులు, వీఐ ప్రతినిధులు ఆ బ్యాండ్లను ఆవిష్కరించారు. మండల, మకరవిళక్కు సీజన్‌లో సెల్ సిగ్నల్స్ మెరుగుపరిచేందేకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వీఐ ప్రతినిధులు తెలిపారు. నీలక్కల్, పంపా, శబరిమల, సన్నిధానం ప్రాంతాల్లో ప్రత్యేకంగా 13 సెల్‌టవర్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంతాల్లో వేగవంతమైన డేటా కనెక్టివిటీ ఉంటుందన్నారు. ఎక్కడా సెల్ సిగ్నల్ డ్రాపవ్వకుండా.. కనెక్టివిటీ ఉంటుందన్నారు.
పిల్లల భద్రతకు ఇలా..
చిన్నారులతో కలిసి వచ్చే అయ్యప్ప భక్తులు పంపాలోని ‘వీఐ సెక్యూరిటీ కియోస్క్’ల వద్ద సెక్యూరిటీ బ్యాండ్‌ను తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా ఈ బ్యాండ్ల కోసం రిజిస్టర్ అవ్వొచ్చు.
కేరళలోని ప్రతి వీఐ స్టోర్‌లో చిన్నారుల సురక్ష బ్యాండ్‌లు లభ్యమవుతాయి.
ఈ బ్యాండ్‌లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ప్రతి బ్యాండ్‌కు ప్రత్యేక డిజిటల్ కోడ్/ఐడీ ఉంటుంది.
ఒకవేళ ఈ బ్యాండ్ ఉన్న చిన్నారులు తప్పిపోతే.. వారిని ట్రాక్ చేసి, గుర్తించవచ్చని పథనంతిట్ట ఎస్పీ ఆనంద్ వెల్లడించారు.
గత ఏడాది శబరిమల సీజన్‌లో పైలట్ ప్రాజెక్టుగా ఈ బ్యాండ్‌లను ప్రవేశపెట్టామని, అవి సత్ఫలితాలనివ్వడంతో ఈ సారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.


