శబరిమల: 18 మెట్ల వద్ద నల్ల త్రాచు.. పట్టుకున్న అటవీ బృందం | King Cobra Spotted at Sabarimala’s 18 Sacred Steps; Forest Team Captures Snake Swiftly | Sakshi
Sakshi News home page

శబరిమల: 18 మెట్ల వద్ద నల్ల త్రాచు.. పట్టుకున్న అటవీ బృందం

Nov 20 2025 6:42 PM | Updated on Nov 20 2025 7:09 PM

King Cobra Spotted at Sabarimala’s 18 Sacred Steps; Forest Team Captures Snake Swiftly

పథనంతిట్ట: ఓవైపు శబరిమల సన్నిధానం భక్తులతో కిక్కిరిసిపోగా.. ఓ నల్లత్రాచు పాము 18 మెట్లను అధిరోహించేందుకు ప్రయత్నించిన ఉదంతమిది..! ఈ సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పెరియార్ రిజర్వ్ ఫారెస్ట్ అటవీ అధికారుల కథనం ప్రకారం.. మంగళవారం శబరిమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. సాయంత్రం వేళల్లో ఆ రద్దీ పెరగడంతో నిమిషానికి 80 మంది స్వాములు 18 మెట్లను అధిరోహించారు.

ఈ క్రమంలో పద్దెనిమిది మెట్ల సమీపంలో ఓ నల్లత్రాచు కలకలం రేగింది. అటుగా వచ్చిన పాము.. మెట్లపైకి ఎక్కేందుకు యత్నించింది. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు పైనుంచి కేకలు వేస్తూ.. అదిరించడంతో ఆ పాము మెల్లిగా వెనక్కి మరలి.. గణపతి హోమం వైపు వెళ్లింది. సమాచారం అందుకున్న అటవీ బృందం.. కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న స్నేక్ క్యాచర్లను అక్కడకు పంపింది.

అటవీ శాఖ స్నేక్ క్యాచర్లు క్షణాల్లో చాకచక్యంతో ఆ పామును ఓ బ్యాగులో బంధించారు. ఈ వీడియోను రాష్ట్ర అటవీశాఖ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. శబరిమలలో మండల సీజన్‌కు ముందే అటవీశాఖ పంపాబేస్, నీలిమల, శరణ్‌గుత్తి, సన్నిధానం, నీలక్కల్ ప్రాంతాల్లో స్నేక్ క్యాచర్ల బృందాలను మోహరించింది. ఇప్పటి వరకు ఈ బృందాలు ఆయా ప్రాంతాల్లో 10కి పైగా విషసర్పాలు, మరో పాతిక దాకా సాధారణ సర్పాలను పట్టుకున్నట్లు వివరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement