పథనంతిట్ట: ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమలకు వెళ్తున్న యాత్రికుల బస్సు కేరళలోని మావత్తుపుళ సమీపంలోని త్రికలత్తూర్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 11 మంది అయ్యప్ప భక్తులు గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీ నుంచి శ్రీదుర్గా ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సులో ఇద్దరు చిన్నారులు సహా.. 33 మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు బయలుదేరారు.
వీరి బస్సు గురువారం తెల్లవారుజామున త్రికలత్తూర్‌లోని ఎంసీ రోడ్డు మీదుగా వెళ్తుండగా.. అటుగా వేగంగా దూసుకువచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పాలక్కాడ్‌కు చెందిన లారీ డ్రైవర్ రెమీ, బస్సు డ్రైవర్ గౌతమ్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ముందు వైపు సీట్లలో కూర్చున్న అయ్యప్ప భక్తులు బాలాజీ, వెంకటేశ్, మోహన్ బాబు, గోవింద్, చంద్రారెడ్డి, శ్రీనివాసులు, ఉమాపతి, ఉదయ్‌కుమార్, దీపికలకు స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను అలువాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. యాత్రికులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని వెల్లడించారు.
తప్పిన పెను ప్రమాదం
లారీ బస్సును వేగంగా ఢీకొనడంతో.. బస్సు డ్రైవర్ నియంత్రణను కోల్పోయి, పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టారు. దాంతో విద్యుత్తు స్తంభం సగానికి విరిగిపోయింది. ఆ సమయంలో అటుగా వెళ్లిన స్థానికులు వెంటనే పోలీసులు, విద్యుత్తు శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో.. అధికారులు వెంటనే విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. ఈ ఘటనతో ఉదయం వరకు ఆ మార్గంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ నెలకొంది. పోలీసులు గురువారం ఉదయం క్రేన్ సాయంతో లారీని రోడ్డు నుంచి తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.


