ట్యాక్సీ డ్రైవర్ల ఆగడాలకు బ్రేక్ వేసేలా కఠిన చర్యలు
రూ.51.24 లక్షల జరిమానా వసూలు
ప్రయాణికుల ఫిర్యాదుల మేరకు ఆర్టీవో ప్రత్యేక డ్రైవ్
దాదర్: ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తూ ఇష్టరాజ్యమేలుతున్న ట్యాక్సీ డ్రైవర్లపై ముంబై ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో నియమాలు ఉల్లంఘించిన 3,176 మంది ట్యాక్సీ డ్రైవర్ల నుంచి రూ.51.24 లక్షల జరిమానా వసూలు చేశారు. ప్రయాణికుల నుంచి ఆర్టీవో హెల్ప్‌లైన్‌కు (Helpline) వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ డ్రైవ్ చేపట్టినట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు.
ఎక్కువ చార్జీల వసూలు.. దురుసు ప్రవర్తన
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో సుమారు 30–35 వేల ట్యాక్సీలున్నాయి. ఇందులో కొన్ని సొంతంగా యజమానులే నడిపేవి కాగా మరికొందరు డ్రైవర్లకు బాధ్యతలు అప్పగిస్తారు. అయితే అనేక మంది డ్రైవర్లు సమీప దూరాలకు కిరాయి నిరాకరిస్తారు. మరికొందరు తమకు అనుకూలంగా, గిట్టుబాటు అయ్యే విధంగా ఉన్న కిరాయిలను మాత్రమే స్వీకరిస్తారు. ఇలాంటి డ్రైవర్ల వల్ల సామాన్యులు, వృద్ధులు, ఆస్పత్రులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురతున్నారు.
ఉదయం విధులకు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు ట్యాక్సీలు దొరక్క సతమతమవుతున్నారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో కూడా ఇదే పరిస్ధితి. సమీప కిరాయి అనే సరికి ట్యాక్సీ డ్రైవర్లు (Taxi Drivers) నిరాకరిస్తున్నారు. కొందరైతే ఆగకుండా దూసుకెళుతున్నారు. ఇలాంటి ట్యాక్సీ డ్రైవర్లకు ముకుతాడు వేయాలని 2022లో ఆర్టీఓ వివిధ ప్రదేశాలు, రైల్వే స్టేషన్ల బయట ట్యాక్సీ స్టాండ్లు ఏర్పాటు చేసింది. అక్కడ ఒక ఆర్టీవో అధికారి, సిపాయి నియమించడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. అయితే రోడ్లపై నిలబడి ట్యాక్సీల కోసం ఎదురుచూసే సామాన్యప్రజల వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
మారువేషాల్లో తనిఖీలు
అత్యవసర సమయంలో ట్యాక్సీలు దొరకడం లేదు. ఒకవేళ దొరికినా సమీప కిరాయి అంటే కనీసం వాహనం ఆపకుండానే ముందుకు వెళుతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు ఆర్టీవో ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. అధికారులు బృందాలుగా ఏర్పడి మారువేషాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీరు సాధారణ ప్రయాణికుల్లాగా వ్యవహరిస్తూ కిరాయి నిరాకరించిన డ్రైవర్లను పట్టుకుంటున్నారు. అంతేగాకుండా ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ట్యాక్సీ డ్రైవర్ల దూకుడు తగ్గడం లేదు.
చదవండి: కూతురి కలను నిజం చేసిన నాన్న!
దీంతో ఇలాంటి వారికి ముకుతాడు వేసేందుకు అదనంగా ప్రత్యేక బలగాలను, ప్లయింగ్ స్కాడ్‌లను మోహరించాలని ఆర్టీవో నిర్ణయించింది. తనిఖీలతోపాటు ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదులను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ట్యాక్సీ డ్రైవర్ల ఆగడాలకు బ్రేక్ వేయాలంటే బాధితులు కచ్చితంగా ఫిర్యాదు చేయాలని ఆర్టీవో అధికారులు సూచించారు. లేదా తమ అసౌకర్యం గురించి వివరిస్తూ మొబైల్ ఫోన్‌లో ట్యాక్సీ, డ్రైవర్ ఫోటో తీసి ఆర్టీవో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచిస్తున్నారు.


