పిల్లలకు ప్రేమ పంచడంలో తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా. బిడ్డలను కంటిరెప్పలా సాకడంతో పాటు, వారి ఆనందం కోసం ఎంతో శ్రమిస్తుంటారు. పిల్లల కళ్లలో సంతోషం చూడటానికి ఎన్ని ఇబ్బందులనైనా పంటి బిగువున భరిస్తారు. తన గారాలపట్టి ఆనందం కోసం ఓ తండ్రి చేసిన పని ఇప్పుడు పతాక శీర్షికల్లో నిలిచింది.
అందరి లాగే బచ్చు చౌదరికి తన కుటుంబమే ప్రపంచం. ముఖ్యంగా కూతురంటే అతడికి ఎనలేని ప్రేమ ఆమె ఏది అడిగినా కాదనడు. అలాగనీ అతడేమి పెద్ద జమీందారు కాదు. అతడో చాయ్ వాలా. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లా (Midnapore District) మౌలా గ్రామంలో ఒక చిన్న టీ స్టాల్ నడుపుతున్నాడు. కొన్నేళ్ల క్రితం స్కూటీ కొనిపెట్టమని తన కూతురు సుష్మ అడిగింది. అంతమాత్రం ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న బచ్చుకు బండి కొనడం అంటే కష్టమే అనిపించింది. కానీ కూతురు సంతోషమే తనకు ముఖ్యమని భావించాడు.
బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. ప్రతి రోజు తాను సంపాదించిన మొత్తంలో కొంత మొత్తం పొదుపు చేయడం ప్రారంభించాడు. టీ అమ్మి సంపాదించిన డబ్బు నుంచి రోజూ కొన్ని 10 రూపాయల నాణేలను పక్కన పెట్టేవాడు. వీటిని ఒక పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో వేసేవాడు. అతడు ఇలా వరుసగా నాలుగు సంవత్సరాలు పాటు చేశాడు. నాణేలతో డబ్బా నిండిపోవడంతో ఇటీవల దగ్గరలోని టూవీలర్ షోరూమ్‌కు వెళ్లాడు.
రూ. 69 వేల నాణేలు!
వెంటనే వెళ్లి నాణేలతో కూడిన పెద్ద డబ్బాను షోరూమ్‌కు తెచ్చాడు. డబ్బాలోని నాణేలను నేల మీద పోయగానే... అక్కడున్నవారంతా ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టారు. నాణేలతో పాటు కొన్ని నోట్లను కూడా బచ్చు పొదుపు చేశాడు. వీటన్నింటిని 8 మంది రెండున్నర గంటల పాటు లెక్కించారు. డబ్బాలోని నాణేలన్ని కలిపి రూ. 69 వేలుగా లెక్క తేలింది. నోట్ల రూపంలో కూడబెట్టింది కూడా కలుపుకుంటే లక్ష రూపాయలు అయ్యాయి. మరో విశేషం ఏంటంటే బచ్చు చౌదరి కూతురు సుష్మ కూడా రూ. 10 వేలు పొదుపు చేసింది.
ఆశ్చర్యపోయాం
షోరూమ్ ఉద్యోగి అరిందమ్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. ''బచ్చు చౌదరి మా దగ్గరికి వచ్చి మొదట స్కూటర్ల ధరల గురించి అడిగారు. నాణేలు తీసుకుంటారా అని అడిగితే, తీసుకుంటామని చెప్పాం. డబ్బా నిండా నాణేలు తెచ్చి మా ముందు పోయడంతో ఆశ్చర్యపోయాం. మా కెరీర్‌లో ఇలాంటి అనుభవం మాకు ఎప్పుడూ ఎదురు కాలేదు. కూతురి సంతోషం కోసం అతడు చూపించిన అంకిత భావం మమ్మల్ని భావోద్వేగానికి గురి చేసింద''ని అన్నారు.
చదవండి: చిన్న కారణాలు.. పెద్ద భయాలు
మా కల నెరవేరింది
తన కూతురి కోసం స్కూటర్ కొనడం చాలా సంతోషంగా ఉందని బచ్చు చౌదరి తెలిపారు. "నా కూతురు చాలా సంవత్సరాల క్రితం స్కూటర్ (Scooter) అడిగింది. అప్పుడు నేను దానిని కొనలేకపోయాను. కాబట్టి, నేను నాకు వీలైనంత పొదుపు చేయడం ప్రారంభించాను. దీనికి సమయం పట్టింది, కానీ నేను ఆమె కోసం దాన్ని చేశాను. స్కూటర్ కొనుక్కోవాలనేది నా కూతురు కల మాత్రమే కాదు, నాది కూడా. ఇప్పుడు మా కల సాకారమయిందని" బచ్చు తెలిపారు.


