చిన్న కారణాలు పెద్ద భయాలు | Phobia Explained: Types, Causes, Symptoms, Treatment & Real-Life Case Study in Telugu | Sakshi
Sakshi News home page

చిన్న కారణాలు పెద్ద భయాలు

Nov 11 2025 11:56 AM | Updated on Nov 11 2025 12:37 PM

articles about phobias to help raise awareness

భయం అనేది ఒక స్వాభావికమైన ఉద్వేగం. అది ప్రతి జీవితో పాటు మానవులందరిలో ఉండేదే. మనకు ముప్పు తెచ్చిపెట్టే అంశాల పట్ల భయం ఉండటం వల్లనే ఆ ప్రమాదాల నుంచి దూరంగా వెళ్తారు. అందువల్లనే మనుగడ సాధ్యమవుతుంది. ఇలా చూసినప్పుడు అన్ని జీవులతో పాటు మానవ మనుగడను సుసాధ్యం చేసే సహజమైన ఉద్వేగం అది. అయితే కొందరిలో ఆ భయం మోతాదులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఓ బొద్దింక వల్ల ఎలాంటి ప్రమాదం లేకపోయినా కొందరు దానికి భయపడతారు. ఇంకొందరు గోడ మీది బల్లని చూస్తే చాలు వణికిపోతారు. ఇలా ఉండాల్సినంత కాకుండా ఈ భయం అర్థం లేకుండా పెరిగిపోతూ, దాని వల్ల యాంగై్జటీ పెరిగిపోతూ... ఆ భయం మన రోజువారీ వ్యవహారాలకు సైతం అడ్డం పడేటంతగా పెరిగిపోయి ఏ పనీ చేయలేనంతగా ఆందోళన కలిగిస్తుంటే దాన్ని ‘ఫోబియా’ గా అభివర్ణిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఫోబియాలకు మంచి చికిత్స ప్రక్రియలే అందుబాటులో ఉంది. ఈ ఫోబియాల గురించి అవగాహన కోసం ఈ కథనం.

ఒక కేస్‌ స్టడీ :  ఇటీవలే సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్‌కు చెందిన మనీషా అనే గృహిణి చీమలంటే భయంతో ఆత్మహత్య చేసుకుంది. ఇక ఈ చీమలతో పాటు బతకడం నా వల్ల కాదంటూ సూసైడ్‌ నోట్‌ రాసి మరీ ఆమె ఈ ఘాతుకానికి ఒడిగట్టిందంటూ వార్తలు వచ్చాయి. ఇలా చీమల పట్ల ఉండకూడని భయానికి సైకియాట్రీలో ఉన్న పేరు ‘మిర్మెకోఫోబియా’.

ఏమిటీ ఫోబియాలు? 
ఒక్కమాటలో చెప్పాలంటే అంతగా భయపడకూడని అంశాల పట్ల కూడా తీవ్రమైన భయం ఉండటమే ‘ఫోబియా’ అని చెప్పవచ్చు. ఈ భయాల తీవ్రతలు చాలామందికి వేర్వేరుగా ఉంటాయి.  ఉదాహరణకు కొందరికి ఎత్తైన ప్రదేశాలంటే భయం. మరికొందరికి అన్నివైపులా మూసి ఉండే ప్రదేశాలు... అంటే లిఫ్టుల వంటి చోట్ల భయంగా ఉంటుంది. ఇంకొందరికి  హైవేల పై డ్రైవింగ్‌ అంటే విపరీతమైన ఆందోళన. ఇలా చాలామందిలో చాలారకాల భయాలుంటాయి. పాములూ, కీటకాలూ, సూదులూ అంటే అర్థం లేని భయాలుంటాయి. అంతెందుకు... ‘మన్మథుడు’ సినిమాలో హీరోకి నీళ్లపై నిర్మించిన వంతెనపై నడవడం కూడా తనకు భయమంటూ చెబుతాడు. ఇలా చాలామందికి చాలావాటి పట్ల అంటే... ఎరుగుతున్న కీటకాలంటే (ఉదా గబ్బిలాలు), పాకుతుండే పాములంటే... ఆఖరికి సూది వాడాలన్నా అది గుచ్చుకుంటుందేమోనని కొందరికి భయమే. ఇలా ఏ అంశం గురించైనా అర్థం లేని భయాలు కలుగుతుండవచ్చు. కొందరిలో ఇవి చిన్నప్పట్నుంచీ  ఉంటే... మరికొందరిలో పెద్దయ్యాక అభివృద్ధి చెందుతుంటాయి.

నిర్హేతుకమైన ఈ భయాల ప్రభావాలు ఇలా...  
అకారణమైన ఈ భయాలు కొందరిలో వాళ్ల పనులను వాళ్లు చేసుకోనివ్వనంతగా దుష్ప్రభావాన్ని చూపుతాయి. చాలామంది తాము చేయాల్సిన పనిని వాయిదా వేయడం లేదా దాన్నుంచి తప్పుకుని తిరగడం చేస్తూ సమస్య నుంచి దూరంగా  పారిపోతుంటారు. ఇది జీవితంలో ఎన్నో ఆనందాలను దూరం చేస్తుంది లేదా సులభంగా జరిగిపోయే పనులనూ జరగకుండా అడ్డుపడుతుంటుంది. ఉదాహరణకు ఓ ఆఫీసులో ఉద్యోగం చేసే వ్యక్తికి ఎత్తులంటే భయం. అతడు ఉద్యోగం చేసే ఆఫీసు ఏ పదో అంతస్తులోనో ఉంటే... మంచి వేతనం వచ్చే ఉద్యోగాన్ని కూడా తేలిగ్గా వదిలేసుకుంటాడు. అలాగే మరో వ్యక్తికి ఎత్తైన ఫ్లై ఓవర్‌ అంటే భయం. దాంతో ఫ్లై ఓవర్‌ ఎక్కితే కేవలం రెండు కిలోమీటర్లలో అధిగమించే దూరాన్ని... అదనంగా మరో పది కిలోమీటర్లు ప్రయాణించి చేరుతాడు. నిజానికి చూసేవారికి ఈ భయాలు అర్థం లేనివిగా కనిపిస్తాయి. పైగా ఇలాంటి చిన్నకారణాలతో పెద్ద పెద్ద ప్రయోజనాలు కోల్పోతారా అని ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఫోబియాలతో బాధపడేవారికి అదే జీవన్మరణ సమస్య.

ఈ ఫోబియాల (భయాల) విస్తృతి ఎంతంటే... 
ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తిలోనూ అన్ని రకాల భయాలూ అంతో ఇంటో ఉండనే ఉంటాయి. నిజానికి ఈ భయాలకు ఏ వ్యక్తి కూడా అతీతుడు కాడు. ఉదాహరణక బల్లి మీద పడితే ఎవరైనా మొదట ఆందోళన చెందుతారు. కాకపోతే ఆ తర్వాత వెంటనే సర్దుకుంటారు. కానీ మనలోని 29% మందిలో ఏదో ఒక అంశంపైన ‘ఫోబియా’లు  ఉండనే ఉంటాయి. అందునా పురుషులతో పోలిస్తే  మహిళల్లో ఈ ఫోబియాలు రెట్టింపు మందిని బాధిస్తుంటాయని అంచనా.  

భయం, ఫోబియాల మధ్య తేడా... 
ఏదైనా ఆందోళన గొలిపే పరిస్థితుల్లో భయం కలగడమనేది చాలా సహజమైన ప్రక్రియ. ప్రమాదకరమైన ఆ పరిస్థితులనుంచి బయటపడటానికీ లేదా వాటి నుంచి దూరంగా పరుగెత్తడానికి భయం అవసరం కూడా. నిజానికి భయం కలగడం ఒక రక్షణాత్మకమైన చర్య. ఏవైనా ్రపాణాంతకమైన పరిస్థితుల్లో దాన్ని ఎదుర్కోడానికీ లేదా వీలుకాని పక్షంలో దాన్నుంచి దూరంగా పారిపోవడానికి ఈ భయం తోడ్పడుతుంది. దీన్నే ఫైట్‌ ఆర్‌ ఫ్లైట్‌ మెకానిజమ్‌గా చెబుతారు. జీవులన్నింటి మనుగడకూ ఇదే అంశం దోహదపడుతుంది. ఇదీ భయం వల్ల కలిగే ప్రయోజనం. 

కానీ ఫోబియాలో ఇలా జరగదు. అక్కడ వాస్తవంగా లేని ప్రమాదాన్ని సైతం బాధితులు ఊహిస్తూ ఉంటారు. ఉదాహరణకు చాలా భయంకరమైన కుక్క ఎదురైనప్పుడుఅది కరుస్తుందేమో అని భయపడటం సహజం. కానీ ఒకవేళ అది  పెంపుడు కుక్క అయినప్పటికీ భయపడటంలో అర్థం ఉండదు. అలాగే పాము కనిపిస్తే భయం కలగడం సహజం. అయితే టీవీ స్క్రీన్‌ మీద పాము కనిపించినా లేదా పాము బొమ్మ చూసినా భయపడటం అంటే అది ‘ఫోబియా’కు సూచన అని అర్థం.  ఇక్కడ డాగ్స్‌ వల్ల కలిగే అనవసర భయాలను ‘సైనో ఫోబియా’ (గ్రీక్‌ భాషలో సైనో అంటే కుక్క అని అర్థం) అనీ, పాముల వల్ల కలిగే భయాన్ని ‘ఒఫిడియో ఫోబియా’  లేదా ‘ఓఫియో ఫోబియా’ అంటారు. కొన్నిసార్లు దాన్నే ‘హెర్పెటో ఫోబియా’ అని కూడా అంటారు. అంటే ‘ఓఫిడియో ఫోబియా’లో పాములంటే భయమైతే ‘హెర్పెటో ఫోబియా’లో పాము జాతికే చెందిన బల్లులూ, బల్లిలాంటి ఇతర జీవుల భయాలను కలుపుకుని ‘హెర్పెటో ఫోబియా’ అంటారు. ఇక ఈ భయాలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే అరుదుగా కొందరికి స్నానం చేయడమన్నా భయముంటుంది దీన్ని ‘ఆల్బుటోఫోబియా’ అనీ, పసుపురంగుకు భయపడటాన్ని ‘గ్జాంథోఫోబియా’ అనీ, చివరకు అద్దంలో చూసుకోడానికి బయపడటాన్ని ‘స్పెక్ట్రోఫోబియా’ అని అంటారు.

భయాలు ఎలా మొదలవుతాయంటే... 
సాధారణంగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్లలో చాలా అనవసరమైన భయాలు ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ అవి తగ్గుతూ పోతుంటాయి. ఉదాహరణకు పిల్లలందరికీ చీకటి అంటే భయం. అయితే వయసు పెరుగుతున్నకొద్దీ ఆ భయాన్ని వారు క్రమంగా అధిగమిస్తారు. ఒకవేళ అధిగమించనంత దాన్ని పూర్తిగా ఫోబియా అనడానికి వీలు కాదు. అయితే ఏదైనా భయం వల్ల మనం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడం, దానివల్ల మన రోజువారీ పనులకూ, సామాజిక జీవనానికీ, పిల్లల్లోనైతే స్కూల్‌ జీవితానికీ, నిద్రకు ఆటంకం కలిగితే దాన్ని ఫోబియాగా గుర్తించి, దానికి అవసరమైన చికిత్స అందించాల్సి ఉంటుంది.

ఏయే వయసు పిల్లల్లో ఎలాంటి భయాలు..?

పిల్లల్లో సాధారణంగా కొన్ని కొన్ని వయసుల్లో కొన్ని విషయాలంటే భయం ఎక్కువగా ఉండవచ్చు. అవి... 

0 – 2 ఏళ్ల పిల్లల్లో ... పెద్ద శబ్దాల పట్ల, అపరిచితులతో, తల్లిదండ్రులనుంచి విడిగా ఉండాల్సి రావడం వల్ల, పెద్ద పెద్ద వస్తువులంటే, కొన్ని జంతువుల పట్ల భయం ఉంటుంది. 

3 – 6 ఏళ్ల పిల్లల్లో ... దెయ్యాలు, భూతాల వంటి అభూత కల్పనాత్మక పాత్రలంటే భయంతో పాటు ఒంటరిగా పడుకోవాల్సి రావడం, వింత శబ్దాలంటే భయం కలుగుతుంది. 

7 – 16 ఏళ్ల పిల్లల్లో ... ఇలాంటి పిల్లల్లో అభూతకల్పనాత్మకమైన అంశాల కంటే  వాస్తవ విషయాలపట్ల భయం కలుగుతుంది. అంటే ఆడుతున్నప్పుడు గాయాలవుతాయనే భయాలు, జబ్బు చేసినప్పుడు కలిగే భయాలు, స్కూల్లో పెర్‌ఫార్మెన్స్‌ తగ్గుతున్నప్పుడూ, ప్రకృతి విలయాలు, ఇతరత్రా ప్రకృతి విపత్తులు,  ఉత్పాతాలంటే భయాలుంటాయి.

ఫోబియాలు కలగడానికి కారణమయ్యే అంశాలు : 
ఫోబియాలను కలిగించడానికి కారణమయ్యే అంశాలు ఇవీ అంటూ నిర్దిష్టంగా చెప్పడానికి కుదరదు.  అయితే చాలా సందర్భాల్లో కొన్ని భయాలు పెద్దల నుంచి పిల్లలకు వస్తుంటాయి. ఇలా కుటుంబాల్లో వంశపారంపర్యంగా వస్తుండవచ్చు. ఈ భయాలకు సాంస్కృతిక అంశాలూ కారణం కావచ్చు. తల్లిదండ్రులకు ఒక తరహా భయాలు ఉంటే అవి పిల్లలకు వచ్చే అవకాశాలు మూడింతలు ఎక్కువ. పిల్లల పట్ల మరీ ఎక్కువ రక్షణాత్మకంగా వ్యవహరించే తల్లిదండ్రుల పిల్లలతో పాటు... మరీ ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసిన తల్లిదండ్రుల పిల్లల్లోనూ ఫోబియాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఏదైనా ఒక భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొనలేక దాన్ని అధిగమించే ప్రయత్నంలో తీవ్రమైన  ఒత్తిడి అనుభవించి, అప్పటికీ అధిగమించని వారిలో ఫోబియాలు అభివృద్ధి చెందే అవకాశాలు మరీ ఎక్కువ.

సాధారణంగా మనలో ఉండే భయాలు, ఫోబియాలు : 
సాధారణంగా మనందరిలో భయాలూ, ఫోబియాలను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి... 

జంతువుల పట్ల ఫోబియా... చాలామందికి పాములు, తేళ్ల వంటి విషజీవులన్నా, సాలెపురుగులూ లేదా ఇతర కీటకాలూ, ఎలుకలు, కుక్కలు, బొద్దింకలు, గబ్బిలాలంటే భయంగా ఉంటుంది. 

కొన్ని రకాల పరిసరాల కారణంగా వచ్చే ఫోబియా... ఉదాహరణకు ఎత్తుకు ఎక్కాక కిందికి చూడటం వల్ల, తుఫానుల్లో చిక్కుకోవడం, విశాలమైన జలరాశి మధ్యన ఉన్నప్పడు ఆ అనంతమైన నీటిని చూడటం వల్ల, చిమ్మచీకటిలో ఉండిపోవాల్సి రావడం పట్ల భయాలు కలుగుతాయి.  

కొన్ని పరిస్థితుల వల్ల కలిగే ఫోబియాలు: కొన్ని పరిస్థితుల్లో మనకు చాలా భయంగా ఉంటుంది. ఉదాహరణకు... అన్నివైపులా మూసుకుపోయి ఉన్నట్లుండే పరిసరాల పట్ల... అంటే ఉదాహరణకు ఊపిరానట్టుగా ఉండే ఇరుకు గదులు, లిఫ్టుల్లో చిక్కుకుపోవడాల పట్ల (క్లాస్ట్రోఫోబియా), వేగంగా డ్రైవింగ్‌ చేస్తున్న సమయాల్లో, గుహల్లోకి ప్రవేశించినప్పుడు, బ్రిడ్జ్‌పైకి వెళ్లినప్పుడు. 

గాయం, రక్తం, ఇంజెక్షన్‌ వంటి భయాలు : చాలామంది ఇంజెక్షన్‌ వంటి వాటికి భయపడుతుంటారు. లేదా ఎవరికైనా జబ్బుగా ఉండటం లేదా తాము చనిపోతామేమో లాంటి భయాల వంటివి ఉంటాయి.

ఫోబియా లక్షణాలు... 
ఏదైనా భయం కాస్తా ఫోబియాగా రూపోందినప్పుడు మొదట తీవ్రమైన ఉద్విగ్నత (యాంగై్జటీ) కలిగి అది కాస్తా మరింత తీవ్రమైన (΄్యానిక్‌ అటాక్‌) రూపం తీసుకుంటుంది.  దీన్ని ‘ఫుల్‌బ్లోన్‌ ΄్యానిక్‌ ఎటాక్‌’గా చెప్పవచ్చు. మనం ఏదైనా విషయానికీ లేదా అంశానికీ భయపడుతుంటే... దానికి మనం ఎంత దగ్గరగా ఉంటే భయం అంతగా తీవ్రమవుతుంది. ఇక ఈ భయం తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే దాన్ని అధిగమించడం లేదా దాన్నుంచి బయటపడటం అంతే కష్టమవుతుంది. ఈ ఆందోళన / భయం / ఉద్విగ్నత (యాంగై్జటీ) తాలూకు లక్షణాలు రెండు రకాలుగా కనిపిస్తాయి. అవి... 

భౌతికంగా కనిపించే లక్షణాలు : ∙ఊపిరి పీల్చుకోవడం కష్టం కావడం ∙గుండె వేగం పెరగడం ∙చెమటలు పట్టడం ∙ఛాతీలో నొప్పి లేదా ఛాతీ బిగదీసుకుపోవడం ∙వణుకు ∙నిద్రవస్తున్నట్లు లేదా కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడం ∙కడుపులో తిప్పినట్లుగా / దేవినట్లుగా ఉండటం. ∙ఒంట్లోంచి వేడి ఆవిరులు బయటకు వస్తున్న భావన.  

ఉద్వేగపూరితమైన లక్షణాలు : ∙యాంగై్జటీ ఎక్కువ కావడం ఆ తర్వాత ΄్యానిక్‌ అటాక్‌గా మారడం ∙స్థలం లేదా పరిస్థితుల నుంచి పారిపోవాలన్న బలమైన కాంక్ష  ∙తనపై తాను అదుపు కోల్పోవడం ∙కాసేపట్లో చచ్చిపోతామేమోన్న భావన ∙ మితిమీరి స్పందిస్తున్నామని తెలిసినా దాన్ని నియంత్రించుకోలేని శక్తి. 

ఫోబియాల దుష్ప్రభావాలిలా : ఫోబియాలకు చికిత్స చేయించకుండా వదిలేస్తే అవి వ్యక్తిగత జీవితాన్ని దుర్భరం చేస్తాయి. వాటిని దాచిపెట్టినా సరే... దాని ఫలితాలు  జీవితాన్ని చాలా తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. ఉదాహరణకు విమాన ప్రయాణం అంటే భయం ఉంటే దాన్ని దాచితే జీవితంలో చాలా కోల్పోవచ్చు. అలాగే కొన్ని ఫోబియాల వల్ల వ్యక్తిగత జీవితంలో స్నేహితులను, బంధువులకు దూరం కావడం, ఉద్యోగం కోల్పోవాల్సి రావడం వంటి తీవ్రపరిణామాలు సంభవించవచ్చు. ఫోబియా ఉన్నవారు వాటిని అధిగమించదలచినప్పుడు క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది  తప్ప... అకస్మాత్తుగా అంతా చక్కబడదు. మిగతా వారిలో పోలిస్తే ఆల్కహాల్‌  అలవాటు ఉన్నవారికి ఫోబియాలకు గురయ్యే అవకాశాలు పదింతలెక్కువ. ఇక అలాగే ఫోబియాలు ఉన్నవారు ఆల్కహాల్‌కు అలవాటు పడే అవకాశాలూ రెండింతలెక్కువ.   ఒక్కోసారి ఫోబియా వల్ల కలిగే యాంగై్జటీ (ఉద్విగ్నత) ప్రమాదకరమైన పరిస్థితికి, కొన్నిసార్లు గుండెజబ్బులకు దారితీయవచ్చు.

ఫోబియాలూ... చికిత్స : 
ఫోబియాకు సమర్థమైన చికిత్స సైకోథెరపీ (కౌన్సెలింగ్‌). దీనితో పాటు కొన్నిసార్లు కొన్ని మందులు కూడా ఉపయోగించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ రెండూ అవసరమవుతాయి.

మొదట స్వయంసహాయం... 
ఫోబియాల విషయానికి వస్తే స్వయంసహాయ పద్థతులు చాలా బాగా పనిచేస్తాయి. అయితే ఒకవేళ వాటి వల్ల రోగి యాంగై్జటీ తగ్గక ΄్యానిక్‌ అటాక్స్‌ వస్తూనే ఉంటే అప్పుడు నిపుణుల సహాయం కావాలి. ఇప్పుడు శుభవార్త ఏమిటంటే... గతంతో పోలిస్తే ఫోబియాల చికిత్సతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.

రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ అభ్యాసం చేయడం... 
మనకు ఏదైనా విషయంలో భయం వేయగానే ఉద్విగ్నత (యాంగై్జటీ) కలుగుతుంది. దానివల్ల కొన్ని గుండెవేగం పెరగడం, ఊపిరి ఆడనట్లుగా ఉండటం (సఫొకేటింగ్‌) వంటి భౌతిక లక్షణాలు కనిపిస్తాయి. వీటి వల్ల మన భయం మరింతగా పెరిగినట్లయి, నిరాశలోకి కూరుకుపోతారు. అందుకే యాంగై్జటీని అధిగమించే ప్రయత్నంలో భాగంగా రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ను నేర్చుకుని, వాటిని అభ్యాసం చేయడం వల్ల క్రమంగా ఉద్విగ్నతను, ΄్యానిక్‌ ఫీలింగ్స్‌ను ఎదుర్కోవచ్చు. రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌లో బలంగా ఊపిరిపీల్చడం (డీప్‌ బ్రీతింగ్‌), ధ్యానం, యోగా వంటి వాటితో ఉద్విగ్న పరిస్థితుల్లోనూ స్థిమితంగా ఉండటం ్రపాక్టీస్‌ చేయవచ్చు.

ప్రతికూల ఆలోచనలను అధిగమించడం... 
వాస్తవానికి ఒక ఫోబియా స్థితిలో అసలు భయం కంటే... దాని వల్ల కలిగే ప్రతికూల (నెగెటివ్‌) ఆలోచనల వల్లనే ఎక్కువగా భయం కలుగుతుంది. ఉదాహరణకు ఒక బ్రిడ్జ్‌పై వెళ్తుంటే... అది బాగానే ఉన్నా... ఒకవేళ కుప్పకూలితే అన్న ఆలోచన కలగగానే ఆ అనంతర పరిణామాలను ఊహించడం వల్ల కలిగే భయమే ఎక్కువ. కాబట్టి ఇలాంటి అనవసరమైన ప్రతికూల ఆలోచనలను దూరం చేసుకుంటే భయాలు  కలగవు. కొన్ని సాధారణ ఆలోచనలనూ వదులుకోవాలి. ఏదైనా సంఘటన తర్వాత మనకూ అది జరుగుతుందనే ఆలోచన రావడం సహజమే అయినా అదేపనిగా వాటి గురించే ఆలోచించకూడదు. ఉదాహరణకు ఇటీవల బస్సు దహనం సంఘటనలూ, బస్సు ప్రమాదాలూ వరసగా చోటు చేసుకున్నాయి. దాంతో మనం ఎక్కే బస్సు కూడా ప్రమాదానికి లోనవుతుందేమో అన్న ఆలోచన రావడం సహజం. కానీ అదే నెగెటివ్‌ ఆలోచన మనను ఆవరించకుండా చూసుకోవాలి. అలాగే మనం  విమాన ప్రయాణం చేస్తూ ఉంటే... ఇటీవల గుజరాత్‌లో కూలినట్టుగా అది కుప్పకూలిపోతోందేమోనని ఆలోచనను మనల్ని ఆవరించకుండా చూసుకోవాలి.  

కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ (సీబీటీ) : ఫోబియాలను గణనీయంగా తగ్గించేందుకు ఉపయోగపడే చికిత్స ప్రక్రియ కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ. సీబీటీ అంటే ఒకరకమైన కౌన్సెలింగ్‌. దీనితో పాటు మందులు కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు యాంటీ డిప్రెసెంట్స్, బీటా బ్లాకర్‌ మెడిసిన్స్, బెంజోడయాజిపైన్స్‌ వంటి మందులతో పాటూ సీబీటీ చేయాల్సి ఉంటుంది. 

చివరగా... కౌన్సెలింగ్, కాగ్నిటివ్‌ థెరపీ, రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌లతో పాటు అవసరాన్ని బట్టి మందులు, ఇతర ప్రక్రియలన్నింటి సహాయంతో చేసే చికిత్సలు... వీటన్నింటి సహాయంతో ఇప్పుడు ఫోబియాలను దాదాపుగా పూర్తిగా తగ్గించడం సాధ్యమే.

ఫోబియా వర్గీకరణ ఇలా... 
సైకియాట్రిస్టులు ఫోబియాలను సాధారణంగా మూడు రకాలుగా వర్గీకరిస్తుంటారు. 

  1. సామాజిక ఫోబియా (సోషల్‌ ఫోబియా) : సాధారణంగా ఇవి అందరిలోనూ ఉండే సహజ భయాలే అయినా కొందరిలో మితిమీరి ఉంటాయి. ఉదాహరణకు కొందరు నలుగురిలో మాట్లాడటానికి చాలా ఎక్కువగా భయపడుతుండవచ్చు. అలాగే మరికొందరు బయట తినడం అనే విషయం పట్ల తీవ్రంగా ప్రతిస్పందిస్తూ దాని వల్ల కలిగే పరిణామాలను అతిగా ఊహించుకుంటారు. సాధారణంగా సోషల్‌ ఫోబియాలు చికిత్సకు ఒక పట్టాన తేలిగ్గా లొంగవు. సామాజిక ఫోబియాలు తమకు చిన్నప్పుడు ఎదురైన సామాజిక అవమానాల కారణంగా కలుగుతాయి. సాధారణంగా పదవ ఏటి కంటే ముందు ఎదురైన సామాజిక అవమానాల కారణంగా ఏర్పడ్డ భయాలు కొందరిలో కాలక్రమేణా తొలగిపోవచ్చు. కానీ యుక్తవయసులో తమ స్నేహితుల నిరాదరణకు గురైన కారణంగా ఏర్పడ్డ భయాలు అంత తేలిగ్గా తొలగిపోవు. కొందరిలో అవి వయసుతో పాటు పెరుగవచ్చు.  

  2. నిర్దిష్ట ఫోబియాలు (స్పెసిఫిక్‌ ఫోబియాస్‌): ఈ ఫోబియాలు నిర్దిష్టంగా ఫలానా అంశం వల్ల కలుగుతుండే భయాలు అని చెప్పవచ్చు. ఉదాహరణకు పాములు, నీళ్లు, ఎత్తులు, లిఫ్ట్, విమానప్రయాణం, వ్యాధుల పట్ల భయం మొదలైనవి.

  3. అగారోఫోబియా : ఇది ఇంటికి దూరంగా ఉన్నప్పుడు లేదా మనకు సురక్షితంగా ఉన్న స్థలానికి దూరంగా ఉన్నప్పుడు కలిగే తీవ్రమైన భయాలు అని చెప్పవచ్చు

ప్యానిక్‌ అటాక్‌ అంటే...
ఏదైనా ఫోబియాకు గురై భయపడటంలోని తీవ్రత తారస్థాయికి చేరినప్పుడు కలిగే మానసిక స్థితిని ΄్యానిక్‌ అటాక్‌గా చెప్పవచ్చు. ఇది కలిగినప్పడు కనిపించే లక్షణాలివి... తమకు భయంగొలిపే ప్రదేశం / అంశం / పరిస్థితి నుంచి దూరంగా పారిపోవాలన్న బలమైన కాంక్ష ∙తీవ్రమైన భయం ∙గుండెవేగంలోని తీవ్రత చాలా ఎక్కువగా పెరగడం ∙శ్వాస అందకపోవడం ∙వణుకు ∙ఒక్కోసారి స్పృహతప్పడం ∙చనిపోయినట్లుగా అనుభూతి చెందడం.  


డాక్టర్‌ పులి వనజారెడ్డి కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌ 

నిర్వహణ: యాసీన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement