450 సీసీకెమెరాల ఏర్పాటు
24 గంటలూ కమాండ్ కంట్రోల్‌లో నిఘా
భద్రతను పరిశీలించిన డీజీపీ చంద్రశేఖర్
పథనంతిట్ట: హరిహరపుత్రుడైన అయ్యప్పస్వామి కొలువుదీరిన శబరిమలలో పకడ్బందీ నిఘా కొనసాగుతోంది. ఇప్పటికే సన్నిధానం, పంపాబేస్ వద్ద కేంద్ర బలగాలు మోహరించగా.. పంపా నుంచి శబరిపీఠం వచ్చే మార్గంలో.. నడపండాల్ వద్ద క్యూలైన్‌లో అధునాతన మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా ఉండేందుకు కేరళ పోలీసులు 450 సీసీకెమెరాలను అమర్చారు. సన్నిధానంలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం(సీసీసీ)లో సిబ్బంది 24 గంటలూ ఈ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తుంటారు. సన్నిధానం, పంపా నుంచి నడకదారి, పంపా పరిసర ప్రాంతాల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు.

వేర్వేరు శాఖల సహకారం
ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) 90 సీసీకెమెరాలను అమర్చగా.. పోలీసు, ఎక్సైజ్, అటవీశాఖలు మిగతా నిఘానేత్రాలను అందజేశాయి. భక్తుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేరళ పోలీసులు చెబుతున్నారు.

డీజీపీ పరిశీలన
శబరిమలలో భద్రతను కేరళ డీజీపీ ఆర్.చంద్రశేఖర్ స్వయంగా పరిశీలించారు. సోమవారం రాత్రి ఆయన సన్నిధానం చేరుకున్నారు. తొలుత అయ్యప్ప స్వామిని దర్శించుకుని, ఆ తర్వాత భక్తుల భద్రతకు చేసిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడా.. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు.


