అయోధ్య: కోట్లాది రామ భక్తుల కల నేటి(మంగళవారం)తో సంపూర్ణమయ్యింది. భారత నాగరికత, ధర్మానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామాలయ నిర్మాణం చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఈ చారిత్రక ప్రయాణంలోని కీలక ఘట్టాలు, వాటి వివరాలు ఇలా..
రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠాపన
తేదీ: జనవరి 22, 2024, సోమవారం
రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠాపన ఘట్టం కోసం జనవరి 16, 2024 నుండే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. బాలాజీ తాంబట్ నేతృత్వంలోని వేద పండితులు ఏడు రోజుల పాటు జరిపిన అధివాస క్రతువులు (తీర్థ పూజ, జలయాత్ర, ధాన్యాధివాసం, ఘృతాధివాసం) తర్వాత ప్రధాన ఘట్టం ప్రారంభమైంది.
ప్రధాని మోదీ దీక్ష
ప్రాణ ప్రతిష్ఠాపనకు ముందు, ప్రధాని మోదీ 11 రోజుల పాటు కఠినమైన అనుష్ఠానం (నియమ నిష్ఠలు, ఉపవాసం) పాటించారు.
ముహూర్తం
అత్యంత శుభప్రదమైన అభిజిత్ ముహూర్తంలో (మధ్యాహ్నం 12:15 నుండి 12:45 వరకు), ప్రధాని మోదీ కర్తగా గర్భగుడిలో ఐదేళ్ల బాల రాముడి (రామ్‌లల్లా) విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అరుణ్ యోగిరాజ్ చెక్కిన ఈ 51 అంగుళాల శ్యామల వర్ణ విగ్రహంపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దశావతారాలు కూడా ఉన్నాయి.
దేశమంతా పండుగ
అయోధ్యలో జరిగిన బాలరాముని ప్రాణప్రతిష్ఠాపనను దేశమంతా ఒక పండుగలా జరుపుకుంది. యావత్ ప్రపంచం ఈ ఘట్టాన్ని వీక్షించింది. హిందూ ధర్మంలో కొత్త శకం ప్రారంభమయ్యిందని పండితులు అభివర్ణించారు.
రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠాపన (రాజా రాముడి ప్రతిష్ఠ)
తేదీ: జూన్ 5, 2025, గురువారం
రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం నాటికి ఆలయ సముదాయంలోని మొదటి అంతస్తు నిర్మాణం పూర్తయింది. గర్భగుడిలో బాల రాముని దర్శనం తర్వాత, భక్తులకు శ్రీరామ దర్బార్ దర్శనం లభించింది.
ప్రతిష్ఠాపన
ఈ దర్బార్‌లో రాముడిని యువరాజు రూపంలో కొలువుదీర్చారు. భార్య సీతా దేవి, తమ్ముడు లక్ష్మణుడు, పరమ భక్తుడు హనుమంతుని విగ్రహాలను కూడా ప్రతిష్టించారు. ఈ సమయానికే ఆలయ నిర్మాణానికి సంబంధించిన పలు నిర్మాణాలు పూర్తిచేసుకుని భక్తులకు అందుబాటులోకి వచ్చాయి.
ధ్వజారోహణం (ధర్మ ధ్వజం ప్రతిష్ఠ)
తేదీ: నవంబర్ 25, 2025, మంగళవారం
ధ్వజారోహణం అనేది ఆలయ నిర్మాణం, ధార్మిక సంస్థాపనలో చివరి, అత్యంత ముఖ్యమైన వేడుక. ఈ రోజున ఆలయ శిఖరంపై ధర్మ ధ్వజాన్ని (కాషాయ జెండాను) ఎగురవేస్తారు. ధ్వజారోహణం అనేది ఆలయ ధార్మిక శక్తిని, ధర్మ సంస్థాపన విజయాన్ని సూచిస్తుంది. ఇది దేవాలయ నిర్మాణం పూర్తయిందని తెలియజేస్తుంది. నేడు జరిగే ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ , ట్రస్ట్ సభ్యులు తదితరులు హాజరు కానున్నారు.
ఇది కూడా చదవండి: నేడు అయోధ్యలో మహా ఘట్టం


