తిరువనంతపురం: కేరళలోని శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు శబరికి తరలివెళ్లారు. మకరవిలక్కు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం) అరుణ్ ఎస్ నాయర్ తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా బారికేడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాల పనులు కూడా పూర్తి అయ్యాయి.
ప్రతీ సంవత్సరం మకర సంక్రాంతి రోజున శబరిమల కొండలకు ఎదురుగా ఉన్న పొన్నాంబలమేడుపై మకరజ్యోతిని వెలిగిస్తారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు మాలధారణ, ఇరుముడితో శబరిమలకు చేరకుంటారు. కాగా కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు, ఉత్సవాల రద్దీని నియంత్రించేందుకు దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యపై అధికారులు కఠినమైన పరిమితులను విధించారు. భక్తులు ఇబ్బంది పడకుండా ముందస్తుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కల్పించారు. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నారు. భక్తుల భద్రత కోసం శబరిమల మార్గాల్లో, సన్నిధానం వద్ద అదనపు పోలీసు బలగాలను, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు.
కాగా, మకరవిలక్కు(మకరజ్యోతి) పర్వదినం సందర్భంగా భక్తుల సంఖ్యను అధికారులు క్రమబద్ధీకరించారు. జనవరి 13న వర్చువల్ క్యూ ద్వారా 35,000 మందికి, స్పాట్ బుకింగ్ ద్వారా 5,000 మందికి అవకాశం కల్పించారు. ఈరోజు వర్చువల్ క్యూ ద్వారా 30,000 మంది భక్తులకు పరిమితం చేశారు. ఇక జనవరి 15 నుండి 18 వరకు ప్రతిరోజూ 50,000 మందికి వర్చువల్ క్యూ ద్వారా, 5,000 మందికి స్పాట్ బుకింగ్ ద్వారా అనుమతి కల్పించారు. జనవరి 19న తిరిగి భక్తుల సంఖ్యను 30,000కు తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
పందళం నుండి జనవరి 12న ప్రారంభమయ్యే తిరువాభరణ ఊరేగింపు జనవరి 14న సన్నిధానానికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటల నుండి నిలక్కల్-పంబ మార్గంలో, ఉదయం 11 గంటల నుండి పంబ-సన్నిధానం మార్గంలో భక్తుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. అలాగే జనవరి 12 ఉదయం నుండి జనవరి 15 మధ్యాహ్నం వరకు హిల్ టాప్ వద్ద ప్రైవేట్ వాహనాల పార్కింగ్‌ను నిషేధించారు. దీంతో భక్తులు తమ వాహనాలను నిలక్కల్ వద్దే పార్క్ చేయాల్సి ఉంటుంది. ఎరుమేలి అటవీ మార్గంలో కూడా జనవరి 13 సాయంత్రం రాకపోకలపై ఆంక్షలు విధించారు.
నిరంతర తనిఖీలు..
భక్తుల రద్దీని తట్టుకునేందుకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అల్పాహారం, తాగునీటి సౌకర్యాలను కల్పిస్తోంది. పోలీస్ విభాగం భారీ క్రౌడ్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను రూపొందించగా, ఆర్‌ఏఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ తదితర కేంద్ర బలగాల మద్దతుతో అదనపు సిబ్బందిని మోహరించారు. భక్తుల రవాణా కోసం సుమారు వెయ్యి కేఎస్‌ఆర్‌టీసీ బస్సులను అందుబాటులో ఉంచారు. అటవీ ప్రాంతాల్లో అనధికారిక గుడిసెలు వేయడం, వంట చేయడంపై కఠిన నిషేధం విధించామని, పోలీస్, అటవీ, ఫైర్ ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయని ఏడీఎం తెలిపారు.


