ఏపీ కోటాలో త్వరలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ
రెండు సీట్లపై బీజేపీ కన్ను.. టీడీపీ, జనసేనకు చెరొకటి
జనసేన ఖాతాలో లింగమనేని రమేష్‌కు చాన్స్
టీడీపీ సీటు మళ్లీ సానా సతీష్‌కే కేటాయించే అవకాశం
బాబు తీరుపై రగిలిపోతున్న టీడీపీ సీనియర్లు, యనమల, ఏబీఎన్ రాధాకృష్ణ
సాక్షి, అమరావతి: త్వరలో ఖాళీ కానున్న రాష్ట్రానికి చెందిన నాలుగు రాజ్యసభ స్థానాల కోసం టీడీపీ కూటమిలో భారీ లాబీయింగ్ మొదలైంది. మూడు నెలల సమయం ఉన్నప్పటికీ టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏపీ నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న పరిమళ్ నత్వానీ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్ పదవీకాలం ఈ ఏడాది జూన్‌లో ముగియనుంది. టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్‌బాబు పదవీ కాలం కూడా జూన్ వరకే ఉంది. ఖాళీ కానున్న ఈ నాలుగు స్థానాల కోసం మూడు పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. ఏడాది క్రితం రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవడంతో టీడీపీ, బీజేపీ చెరొకటి పంచుకున్నాయి.
జనసేనకు మొండిచెయ్యి చూపించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా మంత్రివర్గంలోకి మాత్రం తీసుకోలేదు. టీడీపీ తరఫున రాజ్యసభ సీటు మరోసారి సానా సతీష్‌బాబుకే కేటాయించే అవకాశం ఉందన్న సంకేతాలు అందడంతో టీడీపీ సీనియర్లు యనమల తదితరులతోపాటు పెద్దల సభకు వెళ్లే యోచనలో ఉన్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సీఎం చంద్రబాబుపై ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.
జనసేన కోటాలో లింగమనేని
త్వరలో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది. గతంలో రాజ్యసభ స్థానాన్ని వదులుకున్న నేపథ్యంలో ఈసారి తప్పనిసరిగా జనసేనకు ఒక స్థానం కేటాయించక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ స్థానాన్ని అటు సీఎం చంద్రబాబు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి సన్నిహితుడైన లింగమనేని రమేష్‌కి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈమేరకు ఒక అంగీకారం జరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
రెండు సీట్లకు బీజేపీ పట్టు
ఏపీ కోటాలో ఈసారి తమకు రెండు రాజ్యసభ స్థానాలు కేటాయించాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఒక స్థానాన్ని బీజేపీ అధిష్టానం సూచించిన వారికి, రెండో సీటు రాష్ట్ర పార్టీ నేతల్లో ఒకరికి ఇప్పించుకోవాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాజ్యసభలో తమకు సంఖ్యా బలం కీలకం కాబట్టి ఏపీ కోటాలో ఇవ్వాల్సిందేనని బీజేపీ తేల్చి చెబుతోంది. గతంలో నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జోక్యం చేసుకోవడంతో చంద్రబాబుకు మరోమాటకు తావు లేకుండా ఒక సీటు కమలనాథులకు ఇచ్చేశారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
సానాకే మరోసారి చాన్స్..!
రెండు బీజేపీకి, ఒకటి జనసేనకు ఇస్తే ఇక టీడీపీకి మిగిలేది ఒకే ఒక స్థానం. దాన్ని సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడి సానా సతీష్‌బాబుకి రెన్యువల్ చేయడం ఖాయమని ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. నారా లోకేష్‌కి అత్యంత సన్నిహితుడు కావడంతోపాటు చినబాబు వ్యవహారాలన్నీ చక్కబెడుతుండడంతో ఆ సీటు ఇతరులకు దక్కే ఛాన్స్ లేదని చెబుతున్నారు. మరోవైపు సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తనను రాజ్యసభకు పంపాలని చంద్రబాబును కలిసినప్పుడల్లా అడుగుతున్నారు. ఢిల్లీలో చంద్రబాబు తరపున వ్యవహారాలు నడిపే మరో సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు కూడా తనకు అవకాశం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిత్యం టీడీపీ సేవలో తరించే ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా తనకు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.


