ఆంధ్రప్రదేశ్ లాటరీ ద్వారా రూ.3,000 కోట్లు ఆర్జనకు గ్రీన్‌సిగ్నల్
ఆన్‌లైన్ గేమింగ్ పన్ను ద్వారా రూ.1,400 కోట్లు
స్థానిక సంస్థల వినోద పన్ను ద్వారా రూ,2,300 కోట్లు
రెండో, మూడో స్థాయి అమ్మకాలపై వ్యాట్ ద్వారా రూ.1,300 కోట్లు
వృత్తి పన్ను పెంపు ద్వారా రూ.400 కోట్లు
ఎస్‌జీఎస్‌టీపై ఒక శాతం సెస్‌తో రూ.4,700 కోట్ల ఆదాయంపై కన్ను
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటికే విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, సహజ వనరుల దోపిడీ, పేకాట క్లబ్బులు, విద్యుత్తు చార్జీల బాదుడుతోపాటు సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలకు తూట్లు పొడిచి ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసిన చంద్రబాబు సర్కారు తాజాగా.. ఆదాయం కోసం ఆంధ్రప్రదేశ్ లాటరీని తీసుకురావాలని ప్రతిపాదించింది. వివిధ సెస్‌లు, పన్నుల ద్వారా రాష్ట్ర ప్రజలపై మరో రూ.13,100 కోట్ల మేర అదనపు భారం మోపాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబు మంత్రులు, ఉన్నతాధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశం సాక్షిగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
లాటరీ.. ఆన్‌లైన్ గేమింగ్ పన్నులు..
ఆంధ్రప్రదేశ్ లాటరీని తీసుకురావడం ద్వారా రూ.3,000 కోట్లు ఆర్జించాలని చంద్రబాబు సర్కారు ప్రతిపాదించింది. ఆన్‌లైన్ గేమింగ్ పన్ను ద్వారా రూ.1,400 కోట్లు ఆర్జించాలని నిర్దేశించుకుంది. ఎస్‌జీఎస్‌లపై ఒక శాతం సెస్ విధించడం ద్వారా రూ.4,700 కోట్లను ఆర్జించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన 55వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల వినోద పన్ను ద్వారా రూ.2,300 కోట్లు ఆర్జించాలని ప్రతిపాదించారు. అలాగే రెండో, మూడో స్థాయి అమ్మకాలపై వ్యాట్ విధించడం ద్వారా రూ.1,300 కోట్లు ఆర్జించాలని ప్రతిపాదన చేశారు.
వృత్తి పన్ను పెంపు ద్వారా రూ.400 కోట్లు, విజయవాడ, విశాఖపట్టణం మున్సిపల్ పరిధిలో వృత్తి పన్ను వసూళ్లను బదిలీ ద్వారా రూ.110 కోట్లు ఆర్జించాలని ప్రతిపాదించారు.వసూళ్ల పెంపు కోసం పన్ను ఆధార విస్తరణ, బకాయిల వసూళ్లు, ఐటీ ఆధారిత పర్యవేక్షణ, కొత్త ఆదాయ వనరుల అన్వేషణపై దృష్టి పెట్టడం ద్వారా 2025–26లో రాష్ట్రం స్వంత ఆదాయ వృద్ధి లక్ష్యాలను అధిగమించనున్నారు. ఈమేరకు ఆదాయ విభాగాల లక్ష్యాలు, సాధనపై ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ ఈ సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. బడ్జెట్ లక్ష్యాలకు తగినట్లు ఆదాయం రావడం లేదన్నారు. రెవెన్యూ రాబడులు రూ.1.34 లక్షల కోట్లు లక్ష్యం కాగా డిసెంబర్ వరకు కేవలం రూ.7,400 కోట్లు మాత్రమే వచ్చినట్లు పేర్కొన్నారు.


