
అమెజాన్ (Amazon) సహ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) మాజీ భార్య మెకెంజీ స్కాట్ మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. శాన్ రాఫెల్‌కు చెందిన లాభాపేక్షలేని సంస్థ ‘10,000 డిగ్రీస్’కు తాజాగా 42 మిలియన్ డాలర్లు (రూ. 372 కోట్లు) విరాళం అందించారు. ఈ విరాళం, విద్యలో వైవిధ్యం, సమానత్వం, చేరికకు (DEI: Diversity, Equity, and Inclusion) ఆమె చూపుతున్న దృఢమైన మద్దతును మరోసారి రుజువు చేస్తోంది.
విద్యార్థుల అభ్యుదయానికి ఆమె నిబద్ధత స్పష్టంగా కనిపిస్తుంది. మొట్టమొదటి తరం, తక్కువ ఆదాయ కుటుంబాల విద్యార్థులకు సహాయం చేయడంలో స్కాట్ ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ‘నేటివ్ ఫార్వర్డ్’ అనే సంస్థకు గతంలో ఆమె 10 మిలియన్ డాలర్లు విరాళం ఇవ్వడం ఈ దిశగా మరో ఉదాహరణ. ఇది యూఎస్‌లో స్థానిక విద్యార్థులకు అతి పెద్ద స్కాలర్‌షిప్ అందించే సంస్థగా గుర్తింపు పొందింది.
దాతృత్వానికి మారుపేరు
ఫోర్బ్స్ ప్రకారం 2025 అక్టోబర్ 11 నాటికి స్కాట్ రియల్‌టైమ్ నెట్వర్త్ 32.5 బిలియన్ డాలర్లు. ఆమె 2019లో జెఫ్ బెజోస్‌తో విడాకులు పొందిన తర్వాత, అమెజాన్‌లో 4% వాటాను పొందారు. ఆ ఏడాది మేలో, ఆమె గివింగ్ ప్లెడ్జ్పై సంతకం చేసి, తన జీవితకాలంలో సంపదలో కనీసం సగం విరాళంగా ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు.
స్కాట్ విరాళాలు ఇచ్చే సంస్థలపై నియంత్రణ విధించకుండా, అవి తమ అవసరాలను బట్టి నిధులను ఎలా వినియోగించాలో స్వేచ్ఛను ఇస్తారు. ఇది ‘తీగలు లేని దాతృత్వం’ (no-strings-attached philanthropy)గా గుర్తింపు పొందింది.