లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని వసతి గృహాల్లో వరుసగా ఫుడ్‌పాయిజనింగ్ ఘటనలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి చెప్పారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని చంద్రబాబు ప్రభుత్వాన్ని సోమవారం లోక్‌సభలో కోరారు. నాయుడుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తితో పాటు రాష్ట్రంలో జరిగిన పలు సంఘటనలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు.
ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలల్లో పరిశుభ్రత లోపం, పాడైన ఆర్‌వో ప్లాంట్లు, శుభ్రం చేయని నీటిట్యాంకులు, వంటగది అపరిశుభ్రతవల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం వంటి వివరాలు తెలపాలని కోరారు. దీనికి కేంద్ర విద్యా శాఖ సహాయమంత్రి జయంత్ చౌదరి జవాబిస్తూ.. ఇటీవల కొన్ని పాఠశాలల్లో నీరు, ఆహారం కలుషితం కావడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వారందరికీ చికిత్సచేసి డిశ్చార్జ్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని చెప్పారు.
రాష్ట్రంలో 22 పీఎంకేకేలు
నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఏపీలో 22 ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాలు (పీఎంకేకేలు) ఏర్పాటు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి జయంత్ చౌదరి తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. వీటి ద్వారా 2022–25 మధ్య 12,091 మంది శిక్షణ పొందారన్నారు.
మడ అడవుల అభివృద్ధికి రూ.13.077 కోట్లు
రాష్ట్రంలో మడ అడవుల అభివృద్ధి కోసం రూ.13.077 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయమంత్రి కీర్తివర్థన్ సింగ్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ తనూజారాణి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. మడ అడవులను ప్రోత్సహించడానికి, పునరుద్ధరించడానికి, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థల స్థితిస్థాపకతను పెంచడానికి మాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్‌లైన్ హాబిటాట్స్, టాంజిబుల్ ఇన్‌కమ్స్ ప్రారంభించినట్లు చెప్పారు.
ప్రభుత్వ బడుల్లో భారీగా తగ్గిన విద్యార్థుల సంఖ్య..
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిందని కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి జయంత్ చౌదరి చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ సమాచారం ప్రకారం.. 2024–25లో 1–8 తరగతుల విద్యార్థుల నమోదు తగ్గి నట్లు చెప్పారు. 2022–23లో 31,71,466 మంది బడికి రాగా.. 2024–25లో 26,15,935 మంది మాత్రమే హాజ రైనట్లు తెలిపారు. 2022–23 కంటే 2024–25లో 5,55,531 మంది తగ్గిపోయారని చెప్పారు.


