కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ మాట మార్చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోనని ప్రకటించారు. నియోజకవర్గ ప్రజల విజ్ఞప్తి మేరకు తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నానని మీడియాతో చెప్పారు. ముర్షిదాబాద్ జిల్లాలోని భరత్‌పూర్ శాసనసభ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
"ఇప్పుడు నా రాజీనామా ప్రశ్నే లేదు. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదు. ప్రజలు నన్ను తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. నేను రాజీనామా చేయాలని వారు కోరుకోవడం లేదు. వారి ఆకాంక్షలను గౌరవిస్తూ, నా రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాను" అని కబీర్ అన్నారు. డిసెంబర్ 17న కోల్‌కతాలో జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరైన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ఇంతకుముందు ప్రకటించారు.
ముర్షీదాబాద్‌లో ఈనెల 6న బాబ్రీ మసీదు తరహా మసీదు (Babri-style mosque) నిర్మాణాన్ని ప్రారంభిస్తానని ప్రకటించడంతో టీఎంసీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో డిసెంబర్ 22న కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని, రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 135 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీ చేయిస్తానని ఆయన ప్రకటించారు. అన్నట్టుగానే ముర్షిదాబాద్‌లోని రెజినగర్‌లో మసీదుకు శనివారం కేంద్ర, రాష్ట్ర బలగాల భారీ భద్రత మధ్య శంకుస్థాపన చేశారు. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు.. డిసెంబర్ 6ను శంకుస్థాపనకు ఎంచుకున్నారు.
బెంగాల్ ‘బాబ్రీ’ మసీదుకు రూ.1.30 కోట్ల విరాళాలు
పశ్చిమ బెంగాల్‌లో మసీదు నిర్మాణానికి ఇప్పటివరకు రూ.1.30 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయని టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ సన్నిహిత నాయకులు తెలిపారు. నాలుగు విరాళాల బాక్సులు, ఒక సంచి నుంచి రూ37.33 లక్షల నగదు, ఆన్‌లైన్‌లో రూ.93 లక్షలు వచ్చాయని ప్రకటించారు. మరో ఏడు బాక్సులు ఇంకా లెక్కించాల్సి ఉందన్నారు. సభా వేదిక వద్ద విరాళాలకోసం 11 బాక్సులను ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
చదవండి: 'మీరు ఫ్యూర్ వెజిటేరియనా.. ఏదో మిస్సవుతున్నారు'
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న హుమాయున్ కబీర్ (Humayun Kabir) 2012లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. తరువాత కొంతకాలం బీజేపీకి వెళ్లి 2020లో అధికార పార్టీలోకి తిరిగొచ్చారు. టీఎంసీ నాయకత్వంతో నిత్యం ఘర్షణ పడుతూనే ఉన్నారు. తాజాగా పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు.


