అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం అలాగే వెనక్కి మళ్లింది. చిన్నపాటి విద్యుత్ సమస్య వల్లే ఇలా జరిగిందని.. విమానం సురక్షితంగానే దిగిందని వైట్‌హౌజ్ వర్గాలు ప్రకటించాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్ దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఎయిర్‌ఫోర్స్ విమానంలో ఆయన బయల్దేరారు. అయితే కాసేపటికే విద్యుత్ సమస్య తలెత్తడంతో.. ప్రెస్ కేబిన్‌లోని లైట్లు ఆరిపోయాయి. దీంతో సిబ్బంది సేఫ్టీ ప్రొటోకాల్ ప్రకారం విమానాన్ని తిరిగి యూఎస్ బేస్‌కు మళ్లించారు.
#AirForce one is returning back to Washington DC because the crew detected a minor electrical issue. @POTUS Trump and staff are safe. pic.twitter.com/4EBPfEMw8w
— @BeeNewsDailyB (@BeenewsdailyB) January 21, 2026
వాషింగ్టన్ సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ట్రంప్ మరో విమానంలో(బ్యాకప్ ఎయిర్‌ఫోర్స్ వన్) దావోస్‌కు వెళ్లినట్లు ప్రెస్ సెక్రటరీ కరోలీనా లెవిటీ స్పష్టం చేశారు. ఇలాంటి సందర్భాల్లో ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం సాధారణమని తెలిపారామె.
ట్రంప్ రెండో దఫా అధ్యక్ష పదవి చేపట్టాక.. భారీ ఖర్చుతో బోయింగ్ 747-200 మోడల్ విమానాలు రెండింటికీ మార్పులు(ఒకటి బ్యాకప్) చేయించారు. ట్రంప్ ప్రయాణించే విమానాలు ఎయిర్‌ఫోర్స్ వన్(Air Force One) నిర్వహణ ఖర్చు చాలా ఎక్కువ. ఒక్క గంట ప్రయాణానికి సుమారు 2,00,000–2,50,000 డాలర్లు (రూ.16–20 కోట్లు) వరకు ఖర్చు అవుతుంది(ఇంధనం, సిబ్బంది, భద్రతా, నిర్వహణ.. అన్నీ కలిపి). ఈ భారం పన్నుల రూపంలో మోసేది అమెరికన్లే. అయితే.. అధికారిక పర్యటనలే కాదు తన వ్యక్తిగత పర్యటనలకూ ఆయన ఈ విమానాన్ని వినియోగిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.


