
తాత్త్వికథ
ఒక ఊర్లో ఓ బలవంతుడైన యువకుడు ఉండేవాడు. తన శరీరాన్ని చూసి జనం భయపడుతుండటంతో అతడిలో గర్వం మొదలయ్యింది. దాంతో చిన్నాపెద్దా, ఆడామగా తేడా చూడకుండా ఊర్లోవాళ్ళని ఏడిపించడం ప్రాంరంభించాడు. తనకు అందరూ భయపడాల్సిందేనని, తను చేయలేని పని ఏదీ లేదని ఇష్టానుసారం వ్యవహరించేవాడు. ఒకరోజు వ్యవసాయం పని మీద పక్క ఊరికి వెళ్ళాడు. అతడు వస్తున్నది చూసి అందరూ వెళ్ళి ఇండ్లల్లో దాక్కొన్నారు.
అదే ఊరి దగ్గర బిడ్డను గట్టుపైన పడుకోబెట్టి వర ఇపొలంలోని కలుపు మొక్కలను ఏరి పారేస్తోంది ఓ మహిళ. ఆ బలవంతుడి రాకను ఆమె గమనించలేదు. తన పనిలో తాను లీనమై ఉంది. లేత ఎండ గట్టు మీద ఉన్న బిడ్డపై పడటంతో ఆ బిడ్డ ఏడుపు లంకించుకున్నాడు. బిడ్డ ఏడుపు పట్టించుకోకుండా ఆ బలవంతుడు ‘‘నేనంటే నీకు భయం లేదా?’’ అని అడిగాడు ఆమెను. ఆ అహంభావి గురించి విని ఉన్న ఆమె అతడి పొగరు తగ్గించడానికి అదే అదనుగా భావించింది.‘‘నేను భయపడటం పక్కన పెట్టు. మొదట నా బిడ్డ ఏడుపు ఆపించు చాలు’’ అంది. ‘అదెంత పని’ అని అతడు ఆ బిడ్డ ముందర కెళ్ళి నిలబడ్డాడు. బిడ్డను భయపెడుతూ రకరకాల విన్యాసాలు చేశాడు. అయితే ఆ బిడ్డ ఏమాత్రం ఏడుపు ఆపలేదు.
ఆశ్చర్యపోతూ అతడు ‘‘ఈ బిడ్డ నన్ను చూసి ఎందుకు భయపడటం లేదు? ఏడుపు ఎందుకు ఆపడం లేదు’’ అని అడిగాడు.ఆమె కొంచెం ధైర్యం తెచ్చుకుని ‘‘నువ్వు ఎవరో, నీ ప్రతాపం ఏమిటో ఈ బిడ్డకు తెలియదు. అందుకే ఈ బిడ్డ నీ బెదిరింపులను పట్టించుకోలేదు. మన గురించి ప్రపంచానికంతా తెలుసనుకుంటే ఎలా? నాలుగు ఊర్లు దాటి పెద్ద నగరాలకు వెళ్తే నువ్వెవరో జనానికి తెలియదు. కొందరు గుర్తించినా, అక్కడ నిన్ను ఢీ కొట్టేవాళ్ళు చాలామంది ఎదురవుతారు. మనం మంచి పనులు చేసి, మంచి పేరు తెచ్చుకుంటే ఇక్కడే కాదు, ఎక్కడైనా చెల్లుబాటవుతాము.
చదవండి: Nhatyela Sreedharan బీడీ కార్మికుడిగా పుట్టి.. ద్రావిడ భాషల వారధిగా!
ఇప్పటికైనా నీ కండలు చూసుకుని మురిసిపోవద్దు. వయసు ఎల్లకాలం ఉండదని గుర్తుపెట్టుకో.’’ అని హితవు పలికింది. ‘ఈ విశాల విశ్వంలో మనం సముద్రంలోని ఇసుక రేణువంత. మనకు ఎన్ని ఉన్నా... మిడిసిపాటు వద్దు, మంచితనం ముద్దు’ అని గుర్తించి ముందుకు నడిచాడు ఆ బలవంతుడు. ఆమె తన బిడ్డను ఎత్తుకుని ముద్దులాడటంతో ఆ బిడ్డ ఏడుపు ఆపింది.
ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!
– ఆర్.సి. కృష్ణస్వామి రాజు