
న్యూఢిల్లీ: పరీక్షలలో మోసం, వైకల్యం సాకుగా చూపించడం, ఓబీసీ సర్టిఫికెట్ల దుర్వినియోగం తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజ ఖేద్కర్ కేసును దృష్టిలో ఉంచుకున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది.
యూపీఎస్సీ చైర్మన్ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఇకపై యూపీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల నిర్థారణకు ప్రభుత్వ క్లౌడ్ ఆధారిత వేదిక డిజీలాకర్ ద్వారా స్వీకరిస్తుందని తెలిపారు. దూరదర్శన్‌లో బుధవారం ప్రసారమైన కార్యక్రమంలో అజయ్ కుమార్ యూపీఎస్సీ అభ్యర్థులు ఈ మెయిల్‌లో పంపిన ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. ఒక అభ్యర్థి మాజీ ఐఎఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్ కేసు గురించి అడిగినప్పుడు ‘తాము ఇటువంటి మోసపూరిత వ్యవహారాలను సహించబోమని, ఈ అభ్యర్థిని మూడేళ్లు సస్పెండ్ చేశామని, క్రిమినల్ కేసులో, చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నామని’ అజయ్ కుమార్ తెలిపారు.
నకిలీ సర్టిఫికెట్ల సమస్యను పరిష్కరించేందుకు యూపీఎస్సీ త్వరలో ప్రభుత్వ క్లౌడ్-ఆధారిత డాక్యుమెంట్ ధృవీకరణ వేదిక అయిన డిజిలాకర్ ద్వారా సర్టిఫికెట్లను తీసుకుంటుందని అన్నారు. కుల ధృవీకరణ పత్రాలు, బెంచ్‌మార్క్ వైకల్య ధృవీకరణ పత్రాలు, ఆదాయ ధృవీకరణ పత్రాలతో సహా అనేక రకాల సర్టిఫికెట్లను డిజీలాకర్ నుంచే గ్రహించడం జరుగుతుందన్నారు. ప్రామాణికతను కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తెలుసుకున్నట్లు తెలిపారు. గంటసేపు జరిగిన ఈ సెషన్‌లో అజయ్ కుమార్ అభ్యర్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వయోపరిమితి, ప్రయత్నాల సంఖ్య మారుస్తారనే ఊహాగానాలను నమ్మవద్దని ఆయన అభ్యర్థులను కోరారు.