breaking news
Puja Khedkar
-
పూజా ఖేద్కర్ మోసం: యూపీఎస్సీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: పరీక్షలలో మోసం, వైకల్యం సాకుగా చూపించడం, ఓబీసీ సర్టిఫికెట్ల దుర్వినియోగం తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజ ఖేద్కర్ కేసును దృష్టిలో ఉంచుకున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది.యూపీఎస్సీ చైర్మన్ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఇకపై యూపీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల నిర్థారణకు ప్రభుత్వ క్లౌడ్ ఆధారిత వేదిక డిజీలాకర్ ద్వారా స్వీకరిస్తుందని తెలిపారు. దూరదర్శన్‌లో బుధవారం ప్రసారమైన కార్యక్రమంలో అజయ్ కుమార్ యూపీఎస్సీ అభ్యర్థులు ఈ మెయిల్లో పంపిన ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. ఒక అభ్యర్థి మాజీ ఐఎఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్ కేసు గురించి అడిగినప్పుడు ‘తాము ఇటువంటి మోసపూరిత వ్యవహారాలను సహించబోమని, ఈ అభ్యర్థిని మూడేళ్లు సస్పెండ్ చేశామని, క్రిమినల్ కేసులో, చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నామని’ అజయ్ కుమార్ తెలిపారు.నకిలీ సర్టిఫికెట్ల సమస్యను పరిష్కరించేందుకు యూపీఎస్సీ త్వరలో ప్రభుత్వ క్లౌడ్-ఆధారిత డాక్యుమెంట్ ధృవీకరణ వేదిక అయిన డిజిలాకర్ ద్వారా సర్టిఫికెట్లను తీసుకుంటుందని అన్నారు. కుల ధృవీకరణ పత్రాలు, బెంచ్‌మార్క్ వైకల్య ధృవీకరణ పత్రాలు, ఆదాయ ధృవీకరణ పత్రాలతో సహా అనేక రకాల సర్టిఫికెట్లను డిజీలాకర్ నుంచే గ్రహించడం జరుగుతుందన్నారు. ప్రామాణికతను కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తెలుసుకున్నట్లు తెలిపారు. గంటసేపు జరిగిన ఈ సెషన్లో అజయ్ కుమార్ అభ్యర్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వయోపరిమితి, ప్రయత్నాల సంఖ్య మారుస్తారనే ఊహాగానాలను నమ్మవద్దని ఆయన అభ్యర్థులను కోరారు. -
పూజా ఖేడ్కర్ తండ్రి వీరంగం.. భారీ నష్టపరిహారం కోసమే ట్రక్కు హెల్పర్ కిడ్నాప్
ముంబై: సప్పెండ్ అయిన ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ తండ్రి దిలీప్ ఖేడ్కర్ వీరంగం సృష్టించారు. తన అసిస్టెంట్ సాయంతో ఒక ట్రక్కు హెల్పర్‌ను కిడ్నాప్ చేశాడు. తమ రెండు కోట్ల ఖరీదైన ఎస్యూవీ వాహనాన్ని ట్రక్కుతో ఢీకొని, అది డ్యామేజ్ అయ్యేందుకు కారణంగా నిలిచిన ట్రక్కు హెల్పర్‌ను భారీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ, దిలీప్ ఖేడ్కర్ అతనిని కిడ్నాప్ చేశాడని పోలీసులు తెలిపారు.ట్రక్కు హెల్పర్ కిడ్నాప్ కేసు విచారణకు పోలీస్స్టేష్టన్కు వస్తామని చెప్పిన పూజా ఖేడ్కర్ తండ్రి దిలీప్ ఖేడ్కర్, తల్లి మనోరమ ఆ తరువాత పరారయ్యారని పోలీసులు తెలిపారు. ట్రక్కు హెల్పర్ ప్రహ్లాద్ కుమార్(22)ను దిలీప్ ఖేడ్కర్ ఇంటి నుంచి రక్షించేందుకు వెళ్లిన పోలీసు బృందంపై మనోరమ ఖేడ్కర్ కుక్కలను ఉసిగొల్పింది. ఈ నేపధ్యంలో పోలీసులు ఆమెపై కూడా కేసు నమోదు చేశారు.నవీ ముంబైలోని ఐరోలి వద్ద దిలీప్ ఖేడ్కర్, అతని అంగరక్షకుడు ప్రఫుల్ సలుంఖే ప్రయాణిస్తున్న అత్యంత ఖరీదైన ల్యాండ్ క్రూయిజర్‌ను సిమెంట్ మిక్సర్ ఢీకొట్టింది. ఈ నేపధ్యంలో ట్రక్కు హెల్పర్ ప్రహ్లాద్ కుమార్‌ను బలవంతంగా తమ కారులో ఎక్కించుకుని దిలీప్ ఖేడ్కర్ పూణేలోని చతుర్శృంగిలోని తమ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ప్రహ్లాద్ కుమార్‌పై దాడి చేశారనే ఆరోపణలున్నాయి. ‘ప్రమాదం జరిగినప్పుడు దిలీప్ ఖేద్కర్, అతని అంగరక్షకుడు కారులో ఉన్నారు. కారుకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ వారు ట్రక్కు సహాయకుడిని కిడ్నాప్ చేశారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పంకజ్ దహనే మీడియాకు తెలిపారు.ప్రహ్లాద్ కుమార్ కనిపించడం లేదంటూ ట్రక్కు యజమాని తమకు ఫిర్యాదు చేశారని, ప్రత్యక్ష సాక్షుల కథనాల ఆధారంగా పోలీసులు ఖేద్కర్ ఇంటికి చేరుకున్నారని పోలీసు అధికారులు తెలిపారు. అక్కడ మనోరమ ఖేద్కర్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని. వారి ఇంటి గోడకు అతికించిన నోటీసును కూడా చింపివేశారని పేర్కొన్నారు. దిలీప్ ఖేడ్కర్ దంపతులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మరో వివాదంలో పూజా ఖేడ్కర్.. ట్రక్కు డ్రైవర్‌ను కిడ్నాప్ చేసి..
పూణె: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఛీటింగ్ వ్యవహారంలో సస్పెండ్ అయిన ఐఏఎస్ ప్రొబెషనర్ పూజా ఖేద్కర్ మరోమారు వార్తల్లో నిలిచారు. ముంబైలోని ఐరోలిలో కిడ్నాప్ అయిన ఓ ట్రక్ డ్రైవర్ పూణేలోని చతుశృంగి ప్రాంతంలో గల పూజా ఖేడ్కర్ ఇంట్లో కనిపించడం సంచలనంగా మారింది.సామాజిక కార్యకర్త విజయ్ కుంభార్ ట్వీట్‌తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివాదాస్పదురాలిగా మారి, సస్పెండ్ అయిన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తల్లి సాగించిన మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 13న ఐరోలి ప్రాంతంలోని సిగ్నల్ వద్ద ఓ ట్రక్ డ్రైవర్ కిడ్నాప్ అయ్యాడు. బాధితుడు నవీ ముంబైకి చెందిన ప్రహ్లాద్ కుమార్ (22). ఆయన తన మిక్సర్ ట్రక్కును తీసుకెళ్తూ ఒక కారును ఢీకొన్నాడు. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అతనిని బలవంతంగా తమ కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేశారు. ఈ నేపధ్యంలో ప్రహ్లాద్ కుమార్ కనిపించడం లేదంటూ సంబంధీకులు రబాలే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. Pune Video: Ex-IAS Probationer Puja Khedkar's Mother Confronts Police During Rescue Of Allegedly Kidnapped Driver From Her Home pic.twitter.com/zYkEsSyi7L— Momentum News (@kshubhamjourno) September 14, 2025కేసు దర్యాప్తులో భాగంగా అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఖరత్ ఆ కారును ట్రాక్ చేసే దిశగా పూణేకు వెళ్లారు. ఆ కారు వివాదాస్పద ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ ఇంటి లొకేషన్లో కనిపించింది. దీంతో ఖరత్ బృందం కిడ్నాప్ అయిన డ్రైవర్‌ను రక్షించినట్లు విజయ్ కుంభార్ తన ట్వీట్లో వివరించారు. ఈ కేసు దర్యాప్తు లో పూజా ఖేడ్కర్ తల్లి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిందని, కనీసం తలుపు కూడా చాలాసేపటి వరకూ తెరవలేదని సమాచారం. పోలీసులు పూజా ఖేడ్కర్ తల్లి చేసిన కిడ్నాప్ వ్యవహహారంపై దర్యాప్తు చేపట్టారు. -
పూజా ఖేద్కర్ కేసు జాప్యం దేనికి?
న్యూఢిల్లీ: మాజీ ఐఏఎస్ శిక్షణా అధికారిణి పూజా ఖేద్కర్‌కు సుప్రీం కోర్టు(Supreme Court)లో మరోసారి ఊరట లభించింది. ఆమెను అరెస్ట్ చేయొద్దంటూ గతంలో జారీ చేసిన ఆదేశాలను మంగళవారం మరోసారి కోర్టు పొడిగించింది. ఈ క్రమంలో.. దర్యాప్తు ఆలస్యంపైనా సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.తనంతట తానుగా విచారణకు సహకరిస్తానని ఆమె చెప్పారు. అయినా కూడా ఇంత ఆలస్యం దేనికి? అంటూ ఢిల్లీ పోలీసులపై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వెల్లగక్కింది. ఈ కేసులో త్వరగతిన దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.2022 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) పరీక్షలో ఫోర్జరీ డాక్యుమెంట్లను సమర్పించారని పూజా ఖేద్కర్‌పై అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి.. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని పేర్కొంటూ ముందస్తు బెయిల్ కోరుతూ ఆమె తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే కోర్టు దానిని తిరస్కరించడంతో.. ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయతే ముందస్తు బెయిల్‌పై విచారణ జరుగుతుండగానే.. ఈ ఏడాది జనవరిలో ఆమెను అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఆ ఆదేశాలను పొడిగించింది. పూజా ఖేద్కర్(Puja Khedkar) వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు ఢిల్లీ పోలీసుల తరఫు వాదనలు వినిపించిన అదనపు సాలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు. కానీ, పరీక్ష రాసే సమయం నాటికి ఆమెకు కంటి చూపు సరిగా లేదని, ఆమె ఫోర్జరీకి పాల్పడిందన్న అభియోగంలోనూ నిజం లేదని పూజా తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఆ వాదనను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు ఆమె లాయర్‌కు తేల్చి చెప్పింది.ఈ పిటిషన్‌పై ఇప్పటివరకు ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. ఫోర్జరీ వ్యవహారంపై విచారణకు ఆమెను కస్టడీలోకి తీసుకునే విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ క్రమంలో విచారణ త్వరగతిన పూర్తయ్యేలా చూడాలని ఢిల్లీ పోలీసులను ఆదేశిస్తూ పూజా పిటిషన్ విచారణను ఏప్రిల్ 15కి వాయిదా వేసింది.