
ముంబై: సప్పెండ్ అయిన ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ తండ్రి దిలీప్ ఖేడ్కర్ వీరంగం సృష్టించారు. తన అసిస్టెంట్ సాయంతో ఒక ట్రక్కు హెల్పర్‌ను కిడ్నాప్ చేశాడు. తమ రెండు కోట్ల ఖరీదైన ఎస్‌యూవీ వాహనాన్ని ట్రక్కుతో ఢీకొని, అది డ్యామేజ్ అయ్యేందుకు కారణంగా నిలిచిన ట్రక్కు హెల్పర్‌ను భారీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ, దిలీప్ ఖేడ్కర్ అతనిని కిడ్నాప్ చేశాడని పోలీసులు తెలిపారు.
ట్రక్కు హెల్పర్ కిడ్నాప్ కేసు విచారణకు పోలీస్‌స్టేష్టన్‌కు వస్తామని చెప్పిన పూజా ఖేడ్కర్ తండ్రి దిలీప్ ఖేడ్కర్, తల్లి మనోరమ ఆ తరువాత పరారయ్యారని పోలీసులు తెలిపారు. ట్రక్కు హెల్పర్ ప్రహ్లాద్ కుమార్(22)ను దిలీప్ ఖేడ్కర్ ఇంటి నుంచి రక్షించేందుకు వెళ్లిన పోలీసు బృందంపై మనోరమ ఖేడ్కర్ కుక్కలను ఉసిగొల్పింది. ఈ నేపధ్యంలో పోలీసులు ఆమెపై కూడా కేసు నమోదు చేశారు.
నవీ ముంబైలోని ఐరోలి వద్ద దిలీప్ ఖేడ్కర్, అతని అంగరక్షకుడు ప్రఫుల్ సలుంఖే ప్రయాణిస్తున్న అత్యంత ఖరీదైన ల్యాండ్ క్రూయిజర్‌ను సిమెంట్ మిక్సర్ ఢీకొట్టింది. ఈ నేపధ్యంలో ట్రక్కు హెల్పర్ ప్రహ్లాద్ కుమార్‌ను బలవంతంగా తమ కారులో ఎక్కించుకుని దిలీప్ ఖేడ్కర్ పూణేలోని చతుర్శృంగిలోని తమ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ప్రహ్లాద్ కుమార్‌పై దాడి చేశారనే ఆరోపణలున్నాయి. ‘ప్రమాదం జరిగినప్పుడు దిలీప్ ఖేద్కర్, అతని అంగరక్షకుడు కారులో ఉన్నారు. కారుకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ వారు ట్రక్కు సహాయకుడిని కిడ్నాప్ చేశారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పంకజ్ దహనే మీడియాకు తెలిపారు.
ప్రహ్లాద్ కుమార్ కనిపించడం లేదంటూ ట్రక్కు యజమాని తమకు ఫిర్యాదు చేశారని, ప్రత్యక్ష సాక్షుల కథనాల ఆధారంగా పోలీసులు ఖేద్కర్ ఇంటికి చేరుకున్నారని పోలీసు అధికారులు తెలిపారు. అక్కడ మనోరమ ఖేద్కర్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని. వారి ఇంటి గోడకు అతికించిన నోటీసును కూడా చింపివేశారని పేర్కొన్నారు. దిలీప్ ఖేడ్కర్ దంపతులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.