తెలంగాణ వ్యాప్తంగా నేడు పంచాయతీ కార్యవర్గం కొలువుదీరనుంది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లు ప్రమాణం చేయబోతున్నారు. ఈ తరుణంలో.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆ గ్రామంలో మాత్రం అయోమయం నెలకొంది.
వేములవాడ రూరల్ మండంలోని చింతల్‌ఠాణా గ్రామం పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ ఊరి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన చెర్ల మురళి నామినేషన్ వేశాక గుండెపోటుతో మరణించారు. దీంతో అధికారులు ఆ సమయంలో ఏం చేయలేకపోయారు. అయితే అనూహ్యంగా ఆ ఎన్నికల్లో 370 ఓట్ల మెజారిటీతో ఆయనే గెలిచారు. దీంతో మృతి చెందిన వ్యక్తి సర్పంచ్‌గా విజయం సాధించిన గ్రామంగా చింతల్‌ఠాణా రాష్ట్ర దృష్టిని ఆకర్షించింది.
అయితే.. గెలిచిన అభ్యర్ధి భౌతికంగా లేకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫలితాలు వెల్లడించిన రోజునే అక్కడి అధికారులు నివేదిక పంపారు. అయితే ఇప్పటిదాకా ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. దీంతో.. ఇవాళ చింతల్ ఠాణాలో ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారన్న దానిపై స్పష్టత కొరవడింది.
ఉప సర్పంచ్ కు తాత్కాలికంగా సర్పంచ్ బాధ్యతలు అప్పగిస్తారా? లేదంటే తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారా? అనే సందిగ్ధంలో గ్రామస్థులు ఉండిపోయారు. అధికారులు మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని చెబుతుండడం గమనార్హం.


