కర్ణాటక: ప్రేమ, పెళ్లి పేరుతో యువతులను నమ్మించి సర్వం దోచుకుని మోసగిస్తున్న నయ వంచకుని ఉదంతమిది. చివరకు బాధితులు ఫిర్యాదు చేయడంతో బెంగళూరు బాగలగుంట పోలీసులు గాలించి అరెస్టు చేశారు. హరియానాకు చెందిన శుభాంశు శుక్లా (27) ఆ కిలాడీ. ఇతడు గత నాలుగేళ్లుగా బెంగళూరులోని టీ దాసరహళ్లిలో నివసిస్తున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పుకుని ఫేస్‌బుక్, ఇన్‌స్టా తదితరాల ద్వారా నిందితుడు స్థానిక యువతులను ట్రాప్ చేయడం ప్రారంభించాడు.
ముందు పరిచయం చేసుకుని, ఆపై తీయని మాటలతో ప్రేమ వల విసరడం, వారి నుంచి భారీ మొత్తాల్లో డబ్బు తీసుకోవడం, ఇతరత్ర మోసగించడం ఇతని నైజం. ఓ యువతితో ఇలాగే ప్రేమాయణం నడుపుతున్నాడు. ఆమె ద్వారా ఆమె మైనర్ చెల్లెలిని కూడా మభ్యపెట్టి లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. వారి నుంచి రూ.34 లక్షలు వసూలు చేశాడు. ఇది తెలిసి బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో అతని మోసాలు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి.


