బస్తర్: చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో నేడు (సోమవారం) అద్భుతమైన ప్రజాస్వామ్య ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా మావోయిస్టుల గుప్పిట్లో నలిగిపోయిన ఈ ప్రాంతంలో.. ఏనా డూ జాతీయ పండుగలకు నోచుకోని 47 మారుమూల గ్రామాల్లో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. బీజాపూర్, నారాయణ్ పూర్, సుక్మా జిల్లాల పరిధిలోని ఈ గ్రామాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలను ఒక చారిత్రక ఘట్టంగా స్థానికులు చెబుతున్నారు.
మావోయిస్టుల ప్రభావం కలిగిన ఈ ప్రాంతంలో జరిగిన ప్రజాస్వామ్య వేడుక.. మావోయిస్టుల ప్రాబల్యం తగ్గుముఖం పడుతోందనడానికి నిదర్శనంగా నిలిచింది. గత రెండేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కూడిన వ్యూహాలు, భద్రతా దళాల నిరంతర ఆపరేషన్ల కారణంగా బస్తర్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు గణనీయంగా మెరుగయ్యాయి. గత ఏడాది (2025) 53 గ్రామాల్లో గణతంత్ర వేడుకలు జరగగా, ఈ ఏడాది మరో 47 గ్రామాలు ఈ ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములయ్యాయి.
ఒకప్పుడు ప్రమాదకరంగా భావించిన ఈ ప్రాంతాల్లో, ఇప్పుడు గ్రామస్తులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జాతీయ జెండాను ఎగురవేయడం విశేషం. ప్రస్తుతం బస్తర్ వ్యాప్తంగా 100కు పైగా భద్రతా క్యాంపులు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ భద్రతా వలయం కారణంగా మారుమూల గ్రామాలకు రోడ్లు, పాఠశాలలు, వైద్య సేవలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్, బ్యాంకింగ్ వంటి కనీస సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి.
ఇటీవల మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన జాగర్గుండాలో బ్యాంకింగ్ సేవలు తిరిగి ప్రారంభం కావడం ఈ మార్పునకు అద్దం పడుతోంది. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తోందని ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ తెలిపారు. జనవరి 26, ఈ 47 గ్రామాల్లో ఆవిష్కృతమైన త్రివర్ణ పతాకం కేవలం జెండా మాత్రమే కాదు, బస్తర్‌లో నెలకొంటున్న శాంతికి, ప్రజాస్వామ్యానికి ఒక సరికొత్త ఆరంభానికి శక్తివంతమైన చిహ్నమని ఆయన పేర్కొన్నారు.


