వేడి నుంచి కాస్త ఊరట | Sakshi
Sakshi News home page

వేడి నుంచి కాస్త ఊరట

Published Sun, Mar 17 2024 6:18 AM

Maximum temperatures in Telangana have decreased slightly - Sakshi

ఆకాశం మేఘావృతం కావడంతో తగ్గిన ఉష్ణోగ్రతలు.. కానీ ఉక్కపోత 

మరఠ్వాడ నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి 

దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు అక్కడక్కడా తేలికపాటి వానలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. ఆకాశం మేఘావృతం కావడంతో ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో తేమశాతం ఎక్కువగా ఉండడంతో ఉక్కపోత మాత్రం అధికంగానే ఉంది. శనివారం రాష్ట్రంలో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 38.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 20.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

ప్రస్తుతం మరఠ్వాడ నుంచి అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా కోమరిన్‌ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి తక్కువ ఎత్తు నుంచి దక్షిణ, ఆగ్నేయ దిశల వైపుగా గాలులు వీస్తున్నాయి. వాతావరణంలో నెలకొన్న మార్పులతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ సూచించింది. వానలతో పాటు వడగండ్లు కూడా పడతాయని హెచ్చరించింది. 

సాధారణం కంటే తక్కువగా... 
శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సగటున 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌ మేర గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గినట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. భద్రాచలం, హనుమకొండ, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్‌ జిల్లా కేంద్రాల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 3 డిగ్రీలు తక్కువగా నమోదైంది. ఇక రామగుండంలో 3 డిగ్రీల కంటే తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థితిలోనే నమోదయ్యాయి. 
 

Advertisement
Advertisement