నేడు మోస్తరు వర్షాలు
అలెర్ట్ జారీ చేసిన విపత్తుల నిర్వహణ సంస్థ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బుధవారం పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరి, పన్టీమ గోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటొచ్చు
విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం 41–42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని జైన్ తెలిపారు. శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40–41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
కాగా.. మంగళవారం అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 42.7 డిగ్రీలు, విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 42.4, మన్యం జిల్లా భామినిలో 42.2, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 42, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, కాకినాడ జిల్లా పిఠాపురంలో 41.6, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు, విశాఖ జిల్లా అక్కిరెడ్డిపాలెం 41.5 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


