మిసిసిపీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మధ్యంతర ఎన్నికల్లో ఊహించని పరిణామం ఎదురైంది. రిపబ్లికన్ పార్టీకి దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న మిసిసిపీ రాష్ట్రంలో డెమోక్రాట్లు చారిత్రక విజయం సాధించారు. ఆ పార్టీ అభ్యర్థి స్కాట్ కొలోమ్ (43) సిట్టింగ్ రిపబ్లికన్ సెనేటర్ సిండీ హైడ్ స్మిత్‌ను ఓడించారు. దీంతో 1982 తర్వాత మిసిసిపీ నుంచి సెనేట్‌కు ఎన్నికైన తొలి డెమోక్రటిక్ అభ్యర్థిగా కొలోమ్ చరిత్ర సృష్టించారు. ట్రంప్ మద్దతిచ్చిన అభ్యర్థి ఓటమి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
రోజుల తరబడి ఉత్కంఠ
మిసిసిపీ సెనేట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజుల తరబడి కొనసాగింది. ఇరువురి మధ్య పోటీ హోరాహోరీగా సాగడంతో కొన్నిసార్లు కొలోమ్‌కు కేవలం స్వల్ప ఓట్ల ఆధిక్యం మాత్రమే కనిపించింది. చివరకు ఆయన విజయం ఖాయమైంది. 67 ఏళ్ల హైడ్ స్మిత్ 2018లో తొలిసారి సెనేటర్‌గా ఎన్నికయ్యారు. 2020లో మరోసారి విజయం సాధించారు.
ట్రంప్ మద్దతు ఉన్నా ఓటమి
ఈ ఎన్నికల్లో హైడ్బ స్మిత్‌కు ట్రంప్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఆమెను 100 శాతం మెగా విధానాలకు కట్టుబడి ఉన్న నాయకురాలిగా అభివర్ణించారు. హైడ్ స్మిత్ కూడా ట్రంప్‌కు తన విధేయతను ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు. కొలోమ్‌ను అతివాద ప్రగతిశీల నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం ఆమెకు అనుకూలంగా రాలేదు.
44 ఏళ్ల తర్వాత మారిన చరిత్ర
మిసిసిపీ నుంచి చివరిసారిగా 1982లో జాన్ స్టెన్నిస్ డెమోక్రటిక్ పార్టీ తరఫున సెనేటర్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రిపబ్లికన్ల ఆధిపత్యం కొనసాగుతోంది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఈ రాష్ట్రంలో దాదాపు 23 శాతం పాయింట్ల ఆధిక్యంతో గెలిచారు. అలాంటి రాష్ట్రంలో డెమోక్రటిక్ అభ్యర్థి విజయం సాధించడం విశేషం.
ప్రచారానికి భారీ ఖర్చు
ఈ ఎన్నికల్లో ఇరు పార్టీల అనుబంధ సంస్థలు పెద్దఎత్తున ఖర్చు చేశాయి. డెమోక్రాట్లకు మద్దతుగా పనిచేసే సెనేట్ మెజారిటీ పీఏసీ దాదాపు 21 లక్షల డాలర్లు ప్రకటనల కోసం వెచ్చించింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేట్ లీడర్‌షిప్ ఫండ్ కూడా దాదాపు అంతే మొత్తంలో ప్రచారం చేసింది.
152 ఏళ్ల తర్వాత అరుదైన ఘనత
మిసిసిపీ నుంచి చివరిసారిగా సెనేట్‌కు ఎన్నికైన నల్లజాతీయుడు బ్లాంచ్ బ్రూస్. ఆయన 1874లో ఎన్నికయ్యారు. ఇప్పుడు స్కాట్ కొలోమ్ ఆ రాష్ట్రం నుంచి సెనేట్‌కు ఎన్నికైన తొలి నల్లజాతీయుడిగా 152 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించారు.
ఓటమిని అంగీకరించిన హైడ్-స్మిత్
బుధవారం రాత్రి హైడ్ స్మిత్ తన ఓటమిని అంగీకరించారు. ఓటర్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని, కొలోమ్‌కు అభినందనలు తెలుపుతున్నానని వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఈ విజయంతో వచ్చే ఏడాది అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లకు కనీసం 55 స్థానాలు లభించనున్నాయి. అలాస్కా రాష్ట్రంలోని ఒక్క సెనేట్ ఎన్నిక ఫలితం మాత్రమే ఇంకా ప్రకటించాల్సి ఉంది.
ఇదీ చదవండి: యూపీలో 403 స్థానాల్లో పోటీ.. ఎవరీ ‘తెలంగాణ’ నాగేశ్వరరావు?


