మరోసారి ఐపీఎల్‌ వేలంలో ముస్తాఫిజుర్‌ | Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auction | Sakshi
Sakshi News home page

మరోసారి ఐపీఎల్‌ వేలంలో ముస్తాఫిజుర్‌

Nov 12 2026 8:15 AM | Updated on Nov 12 2026 8:22 AM

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auction

source: X

బంగ్లాదేశ్‌ స్టార్‌ బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ మరోసారి ఐపీఎల్‌ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. గత ఎడిషన్‌లో ఎదురైన చేదు అనుభవం మరువకముందే అతడితో సహా మొత్తం ఏడుగురు ఆటగాళ్లు (ముస్తాఫిజుర్ రహ్మాన్‌, నహిద్ రాణా, రిషద్ హొస్సేన్, హసన్ మహ్మద్, తౌహిద్ హృదయ్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం) ఐపీఎల్‌ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధికారి ఒకరు ధృవీకరించారు.

గతంలో ఏం జరిగింది..?
2025 డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను రూ.9.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోటీ తర్వాత కేకేఆర్‌ అతడిని సొంతం చేసుకుంది. అతడి కనీస ధర రూ.2 కోట్లు కాగా, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన బంగ్లాదేశ్ ఆటగాడిగా నిలిచాడు.

అయితే, బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై దాడులు, హింసకు సంబంధించిన వార్తలు వెలువడిన నేపథ్యంలో ముస్తాఫిజుర్‌ను జట్టులో కొనసాగించడంపై విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాల మధ్య బీసీసీఐ సూచనల మేరకు 2026 జనవరిలో కేకేఆర్ అతడిని విడుదల చేసింది. అతడి స్థానంలో మరో ఆటగాడిని తీసుకునేందుకు ఫ్రాంచైజీకి అనుమతి లభించింది.

టీ20 ప్రపంచకప్ సమయంలోనూ వివాదం
ముస్తాఫిజుర్‌ను విడుదల చేయాలన్న బీసీసీఐ నిర్ణయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భద్రతా కారణాలను చూపుతూ భారత్‌లో జరిగిన 2026 టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని కోరింది. అయితే, ఐసీసీ ఆ విజ్ఞప్తిని తిరస్కరించడంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకుంది. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం లభించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్ 2027 వేలంలో ఏడుగురు బంగ్లాదేశ్ ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకున్నారన్న వార్త ఆసక్తికరంగా మారింది. అయితే, వేలంలో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకోవడం ఒక దశ మాత్రమే. ఫ్రాంచైజీలు వారిని కొనుగోలు చేస్తాయా, తుది జాబితాలో చోటు దక్కుతుందా అన్నది వేచి చూడాలి.

ఇదీ చదవండి: ఐపీఎల్‌లో సంచలన ట్రేడ్‌ పూర్తి


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement