breaking news
Australian Prime Minister
-
చెన్నైలో బిగ్ బాష్
మెల్బోర్న్: శిక్షణ, క్రీడా విజ్ఞానం, సాంకేతికత, క్రీడా పరిశ్రమ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భారత్, ఆ్రస్టేలియా నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం శుక్రవారం క్రీడా సహకార రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించాయి. ఇందులో భాగంగా తమిళనాడు రాజధాని చెన్నైలో బిగ్ బాష్ లీగ్ (టీ–20) ఆరంభ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో చెన్నైలోని ఎం.ఎ.చిదంబరం స్టేడియం (చేపాక్) వేదికగా జరగనున్న ఆ్రస్టేలియన్ మెన్స్ బిగ్ బాష్ లీగ్(బీబీఎల్) ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పెర్త్ స్కార్చర్స్ జట్టుతో మెల్బోర్న్ రెనెగేడ్స్ తలపడనుంది. తద్వారా భారతదేశంలో ఒక విదేశీ క్రికెట్ లీగ్ మ్యాచ్ నిర్వహిస్తుండడం ఇదే మొదటిసారి కానుంది. మొదటి మ్యాచ్ చెన్నైలో, మిగిలిన మ్యాచ్‌లు ఆ్రస్టేలియాలో జరుగుతాయి. ఎనిమిది జట్లు పాల్గొనే బీబీఎల్.. ఐపీఎల్ తర్వాత ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ పొందిన దేశీయ క్రికెట్ టీ–20 లీగ్‌లలో ఒకటి కావడం విశేషం. ఇది సాధారణంగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో జరుగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ శుక్రవారం ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇద్దరు నేతలు స్టేడియం అంతటా కలియతిరుగుతూ సందడి చేశారు. ఫోన్లో సెల్ఫీలు దిగారు. ఫొటోలకు పోజులిచ్చారు. ప్రజలకు అభివాదంచేస్తూ ఉత్సాహపర్చారు. పరస్పరం ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ‘చెన్నైలో బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ నిర్వహిస్తుండడం నాకు సంతోషంగా ఉంది. భారతదేశంలో మ్యాచ్‌లు నిర్వహించే ఏ క్రీడా లీగ్ అయినా భారీగా ప్రేక్షకులను ఆకర్శించడం ఖాయం’’అని మోదీ పేర్కొన్నారు. భారత్–ఆస్ట్రేలియా క్రీడా సహకార రోడ్‌మ్యాప్‌ను మోదీ, అల్బనీస్ సంయుక్తంగా విడుదల చేశారు. క్రీడా శిక్షణ, క్రీడా విజ్ఞానం, సాంకేతికత, క్రీడా పరిశ్రమ, పెట్టుబడుల రంగాల్లో భాగస్వామ్యాలను ప్రోత్సహించాలన్నదే ఈ రోడ్‌మ్యాప్ ఉద్దేశం. రోడ్‌మ్యాప్‌లో భాగంగా యువ క్రీడాకారుల మధ్య పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడానికి, క్రీడా సంబంధాలను బలోపేతం చేయడానికి ఇరు దేశాలు యూత్ స్పోర్ట్స్ ఫెస్టివల్‌ను కూడా నిర్వహించబోతున్నాయి. ప్రజలను ఏకం చేసే శక్తి క్రీడలకు ఉందని, ఈ రోడ్‌మ్యాప్ భారత్, ఆ్రస్టేలియా మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి తోడ్పడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహిళల క్రికెట్ ప్రపంచ కప్ గెలిచినందుకు ఆ్రస్టేలియాను అభినందించారు. భారత్, ఆస్ట్రేలియాలు అంతర్జాతీయ క్రీడల్లో ఒక ముఖ్యమైన దశాబ్దంలోకి అడుగుపెడుతున్నాయని పేర్కొ న్నారు. క్రీడల పట్ల ఉన్న ప్రేమ, అభిరుచి ఆ్రస్టేలియా, భారత్‌ను ఐక్యం చేశాయని ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ వ్యాఖ్యానించారు. విపక్ష నేతతో మోదీ భేటీ ఆ్రస్టేలియా ప్రతిపక్ష నాయకుడు యాంగస్ టేలర్‌తో ప్రధాని మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. భారత్–ఆ్రస్టేలియా ద్వైపాక్షిక సంబంధాలపై వారిద్దరూ చర్చించుకున్నారు. ఇరుదేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై అభిప్రాయాలు పంచుకున్నారు. మోదీ మూడు రోజుల ఆ్రస్టేలియా పర్యటన శుక్రవారం ముగిసింది -
బలపడిన అణు బంధం
మెల్బోర్న్: భారత్, ఆస్ట్రేలియా మధ్య ‘అణు’బంధం మరింత బలపడింది. భారత అణు విద్యుత్ ప్రాజెక్టులకు యురేనియం సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. ఈ మేరకు ఇరుదేశాల మధ్య అత్యంత కీలకమైన పౌర అణుశక్తి ఒప్పందం కుదిరింది. సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ సహా సముద్ర భద్రత, అరుదైన ఖనిజాల రంగాలకు సంబంధించి పలు చరిత్రాత్మక ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్ గురువారం మెల్బోర్న్లో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. కీలక రంగాల్లో పరస్పరం సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆధునిక సాంకేతికతలు, సప్లై చైన్లు, రక్షణ, భద్రతా సహకారం, సముద్ర భద్రతా సహకార రోడ్‌మ్యాప్, ఇంధన భద్రత తదితర అంశాల్లో మొత్తం 18 ఒప్పందాలపై సంతకాలు జరగడం విశేషం. వీటిలో భారత తీర రక్షక దళం(ఐసీజీ), ఆ్రస్టేలియాకు చెందిన మారిటైమ్ బోర్డర్ కమాండ్(ఎంబీసీ) మధ్య జరిగిన ఒప్పందం కూడా ఉంది. ఇది సముద్ర చట్టాల అమలు, సముద్ర ప్రాంతాలపై అవగాహన, సముద్ర సరిహద్దుల రక్షణ వంటి అంశాలలో పరస్పర సహకారానికి దోహదపడుతుంది. ఇంధన భద్రతను బలోపేతం చేసుకుందాం ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం, ద్వైపాక్షిక పెట్టుబడి రక్షణ విధానాన్ని ఖరారు చేసే దిశగా కార్యాచరణను వేగవంతం చేయాలని భారత్, ఆ్రస్టేలియా నిర్ణయించాయి. ఓడల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణలో కలిసికట్టుగా పనిచేయడానికి ఇరుపక్షాలు అంగీకారం తెలిపాయి. భారత్, ఆ్రస్టేలియాలు చారిత్రాత్మక పౌర అణు సహకార ఒప్పందంపై సంతకాలు చేసిన 12 ఏళ్ల తర్వాత పౌర అణుశక్తి ఒప్పందం కుదిరింది. ఇంధన భద్రతా ఫ్రేమ్‌వర్క్ నిబంధనల ప్రకారం.. బొగ్గు, డీజిల్, ఇతర ద్రవ ఇంధనాలు, సహజ వాయువుల స్థిరమైన, సురక్షితమైన, విశ్వసనీయమైన సరఫరాను కొనసాగించడం ద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేసుకోవాలని ప్రతిజ్ఞ చేశాయి. 2028–29 సంవత్సరానికి గాను ఆ్రస్టేలియన్ డిఫెన్స్ కాలేజీలో భారతీయ సైనిక శిక్షకుడిని నియమించాలని నిర్ణయించారు. మరోవైపు భారత్‌లోని గురుగ్రామ్‌లో విక్టోరియా విశ్వవిద్యాలయం తన క్యాంపస్‌ను నిర్వహించుకోవడానికి ఆ్రస్టేలియా పక్షానికి ఆమోద పత్రం అందజేశారు. బెంగళూరులో ఫ్లిండర్స్ యూనివర్సిటీ తన క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి అంగీకారం కుదిరింది. భేటీ అనంతరం మోదీ, అల్బానీస్ ప్రకటన విడుదల చేశారు. భారత స్వచ్ఛ ఇంధన లక్ష్యాలకు నూతన శక్తి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అల్బానీస్‌తో అద్భుతమైన చర్చలు జరిగాయని నరేంద్ర మోదీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చర్చల ఫలితాలను ‘అసాధారణమైనవి’గా అభివర్ణించారు. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధనం, వాతావరణ చర్యలు, అణు శక్తి, కీలక ఖనిజాలు, సాంకేతికత, విద్య వంటి రంగాలపై చర్చించామని తెలిపారు. ఈరోజు అణు శక్తి రంగంలో ఒక కీలక ఒప్పందంపై సంతకం జరిగాయని అన్నారు. ఇది ఆ్రస్టేలియా నుంచి భారత్‌కు యురేనియం సరఫరాకు మార్గం సుగమం చేయడంతోపాటు భారత స్వచ్ఛ ఇంధన లక్ష్యాలకు నూతన శక్తిని ఇస్తుందని ఉద్ఘాటించారు. రెండు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం ఉగ్రవాదం అనేది కేవలం ఏదో ఒక దేశానికే కాకుండా మొత్తం మానవాళికి తీవ్రమైన సవాలుగా పరిణమించిందని భారత్, ఆస్ట్రేలియాలు గుర్తించినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. అందుకే ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం సాగిస్తామన్నారు. తమ సంకల్పం అచంచలమైనదని, సహకారం మరింత బలపడుతూనే ఉందని వెల్లడించారు. ఇండియాతో ఆ్రస్టేలియాకు ఉన్న సంబంధం నేడు ఉన్నంత కీలకమైనదిగా గతంలో ఎప్పుడూ లేదని ప్రధాని ఆంథోనీ అల్బానీస్ పేర్కొన్నారు. పౌర అణుశక్తికి సంబంధించిన ఒప్పందం శాంతియుత ప్రయోజనాల కోసం ఆ్రస్టేలియా నుంచి భారత్‌కు యురేనియం ఎగుమతులను సులభతరం చేస్తుందని వివరించారు. శిలాజ రహిత ఇంధన విద్యుత్ సామర్థ్యం వాటాను పెంచడానికి భారత్‌కు యురేనియం సరఫరా చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే ఆ్రస్టేలియన్ వనరుల రంగానికి అదనపు మార్కెట్ అందుబాటులోకి వస్తుందన్నారు. తమ భాగస్వామ్యం ఎన్నడూ లేనంత బలంగా ఉందని తేల్చిచెప్పారు. రక్షణ, భద్రతా సహకారంపై ఉమ్మడి ప్రకటన ‘ఆచరణాత్మక భాగస్వామ్యాన్ని’మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుందన్నారు. భారతదేశాన్ని ఒక అగ్రశ్రేణి భద్రతా భాగస్వామిగా పరిగణిస్తున్నట్లు అల్బానీస్ ప్రకటించారు. భారత్‌లో అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ప్రతిపాదిత భారత్–ఆ్రస్టేలియా సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇది ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్తుతుందని పేర్కొన్నారు. గురువారం ఆ్రస్టేలియా–ఇండియా సీఈఓల ఫోరమ్, ఎకనామిక్ రోడ్‌మ్యాప్ బిజినెస్ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. భారత్‌లో విమానయానం, ఆర్థిక సేవలు, కీలక ఖనిజాలు, సాంకేతికత, ఆహార శుద్ధి వంటి రంగాల్లో వృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి విస్తృతంగా పెట్టుబడులు పెట్టాలని ఆ్రస్టేలియా పారిశ్రామికవేత్తలకు, కంపెనీలకు పిలుపునిచ్చారు. ఇండియాలో 500 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ‘ఆ్రస్టేలియన్ సూపర్’కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాల్ ష్రోడర్ చేసిన ప్రకటనను మోదీ స్వాగతించారు. -
భారత్ ప్రగతి అద్భుతం
కాన్బెర్రా: భారత్ సాధిస్తున్న ఆర్థిక ప్రగతి ఇండో–పసిఫిక్ ప్రాంతానికి అద్భుతమైన అవకాశమని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్ పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి ఆతిథ్యం ఇచ్చేందుకు తాను ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. కాన్‌బెర్రాలోని పార్లమెంట్లో గురువారం ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు ఎదగనుందన్నారు. 2022లో కుదిరిన ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందంతో రెండు దేశాల వాణి జ్య సంబంధాలు గణనీయంగా పెరిగా యన్నారు. 1991లో పర్యాటకుడిగా భారత్ వెళ్లిన తాను, ప్రధానిగా రెండు పర్యాయాలు భారత్ సందర్శించినట్లు చెప్పారు. భారత్‌ను దగ్గర్నుంచి పరిశీలించాలనుకునే వారిక బస్సు, రైలు ప్రయాణం ఉత్తమమని సలహాఇచ్చారు. ‘అదొక అద్భుతమైన అనుభవం. ప్రజల ఆప్యాయత చూసేందుకు చక్కని అవకాశం’అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ చివరిసారిగా 2023లో ఆస్ట్రేలియాలో పర్యటించారు. -
ఆస్ట్రేలియా టీనేజర్లకు స్క్రీన్ లాకౌట్
మెల్బోర్న్ (ఆస్ట్రేలియా): పదహారేళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించడా న్ని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బ నీస్ స్వాగతించారు. ప్రపంచంలోనే మొట్టమొ దటిదైన ఈ నిషేధం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. అయితే నిషేధం అమలు కష్టంతో కూడుకున్నదని ఆయన హెచ్చరించారు. నిషేధం అమలుతో తమ ఖాతాలు మూతపడినట్లు తెలుసుకున్న పిల్లలు బాధ పడ్డారని తల్లిదండ్రులు తెలిపారు. కొందరు చిన్న పిల్లలు తమ ముఖాలపై మీసాలు, గడ్డం చిత్రించుకుని, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల వయసు అంచనా సాంకేతికతను మోసం చేయగలిగారని వెల్లడించారు. తల్లిదండ్రులు, అన్నలు లేదా అక్కలు కూడా.. కొంతమంది పిల్లలకు ఈ ఆంక్షలను తప్పించుకోవడానికి సహాయం చేస్తారని భావిస్తున్నారు.కన్నవారికి మనశ్శాంతి తథ్యం‘బిగ్ టెక్ కంపెనీల నుంచి ఆస్ట్రేలియా కు టుంబాలు అధికారాన్ని తిరిగి పొందే రోజు ఇది. పిల్లలు పిల్లల్లా ఉండటానికి, తల్లిదండ్రులకు మరింత ప్రశాంతత లభించడానికి నిషేధం ఉపకరిస్తుంది’.. అని అల్బనీస్.. ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్ప్‌తో వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా పిల్లలు.. వారి బాల్యాన్ని హాయిగా గడిపేందుకు వీలు కల్పిస్తుంది. ఆస్ట్రేలియా తల్లిదండ్రులకు మరింత మనశ్శాంతినిస్తుంది. ఆస్ట్రేలియా చేయగలిగితే, మనం ఎందుకు చేయలేం?’ అని ప్రపంచ సమాజం ఆస్ట్రేలియా వైపు చూస్తుంది’.. అని అల్బనీస్ చెప్పారు. ఒక బిడ్డ ఆత్మహత్యకు సోషల్ మీడియా కారణమని ఆరోపించే తల్లిదండ్రులతో సహా, సోషల్ మీడియా సంస్కరణ మద్దతుదారుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఉల్లంఘిస్తే భారీ జరిమానాబుధవారం నుంచి 16 ఏళ్లలోపు ఆస్ట్రేలియా పిల్లల ఖాతాలను తొలగించడానికి సహేతుక మైన చర్యలు తీసుకోకపోతే, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, కిక్, రెడ్డిట్, స్నాప్‌చాట్, థ్రెడ్స్, టిక్‌టాక్, ఎక్స్, యూట్యూబ్, ట్విచ్ వంటి ప్లాట్‌ఫాంలు గరిష్టంగా 49.5 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే.. సుమారు 32.9 మిలియన్ల అమెరికన్ డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.క్రిస్మస్ నాటికి నివేదికఈ నిషేధాన్ని ఆస్ట్రేలియాలోని ఈ–సేఫ్టీ కమిషనర్ జూలీ ఇన్మాన్ గ్రాంట్ అమలు చేస్తారు. వయస్సు పరిమితిని కచ్చితత్వంతో అమలు చేయడానికి ప్లాట్‌ఫాంల వద్ద ఇప్పటికే సాంకేతికత, వారి వినియోగదారుల వ్యక్తిగత డేటా అందుబాటులో ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. వయసు పరిమితిని ఎలా అమలు చేస్తున్నారు?, ఎన్ని ఖాతాలు మూతపడ్డాయి? అనే అంశంపై సమాచారం ఇవ్వాలని కోరుతూ లక్షిత పది ప్లాట్‌ఫాంలకు గురువారం నోటీసులు పంపుతానని వెల్లడించారు. ‘ఈ వయస్సు పరిమితులు ఎలా అమలు అవుతున్నాయో, అవి ప్రాథమికంగా పనిచేస్తున్నాయో లేదో క్రిస్మస్ లోపు ప్రజలకు సమాచారం అందిస్తాం’.. అని ఇన్మాన్ గ్రాంట్ చెప్పారు. కమ్యూనికేషన్స్ మంత్రి అనికా వెల్స్ మాట్లాడుతూ, బుధవారానికి ఆస్ట్రేలియాలో 200,000 కంటే ఎక్కువ టిక్‌టాక్ ఖాతాలు నిలిపివేసినట్లు వివరించారు. -
WikiLeaks: అసాంజ్‌కు విముక్తి
సైపన్/కాన్బెర్రా: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్‌కు పూర్తి విముక్తి దొరికింది. అమెరికా పసిఫిక్ ద్వీప భూభాగంలో ఉత్తర మరియానా దీవుల రాజధాని సైపన్లోని ఫెడరల్ కోర్టు అసాంజ్‌ను బుధవారం విడుదల చేసింది. అంతకుముందు మూడు గంటలపాటు విచారణ సాగింది. గూఢచర్య చట్టానికి విరుద్ధంగా అమెరికా జాతీయ రక్షణ పత్రాలను పొందడం, వాటిని బయట పెట్టడం వంటి నేరాలను అసాంజ్ అంగీకరించారు. అయితే, ‘‘రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛపై నాకు నమ్మకముంది. అందులో భాగంగానే ఓ జర్నలిస్టుగా రహస్య పత్రాలను సేకరించి బయట పెట్టా. అమెరికా రాజ్యాంగానికి చేసిన తొలి సవరణ ప్రకారం నా చర్యలకు రక్షణ ఉంది’’ అని చెప్పుకొచ్చారు. ఆయన నేరాంగీకార వాంగ్మూలాన్ని అనుమతిస్తున్నట్టు చీఫ్ యూఎస్ డి్రస్టిక్ట్ జడ్జి రమొనా వి.మంగ్లోనా ప్రకటించారు. అసాంజ్‌కు ఐదేళ్ల రెండు నెలల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఇప్పటికే బ్రిటిష్ జైల్లో ఐదేళ్లు శిక్ష అనుభవించిన కారణంగా ఆయన్ను విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. ‘‘మీరు ఈ న్యాయస్థానం నుంచి స్వేచ్ఛా వ్యక్తిగా బయటకు వెళ్లవచ్చు’’ అని ప్రకటించారు. అనంతరం అసాంజ్ కోర్టు నుంచి బయటికొచ్చారు. ఈ పరిణామం పట్ల ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మీడియా ఎదురుచూపులువిచారణను కవర్ చేయడానికి ప్రపంచవ్యాప్త మీడియా సైపన్లోని కోర్టు దగ్గరికి చేరుకుంది. గంటలపాటు బయట వేచి చూసినా విచారణను చిత్రీకరించేందుకు మీడియాను కోర్టు హాల్లోకి అనుమతించలేదు. అసాంజ్ కోర్టు హాలు నుంచి బయటకు వస్తున్న ఫొటోను ఆయన భార్య స్టెల్లా ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘భావోద్వేగంతో కంటతడి పెట్టకుండా ఉండలేకపోతున్నా’ అన్నారు. అసాంజ్ విడుదల స్వాగతించదగ్గ పరిణామమని ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ అన్నారు. అసాంజ్ విడుదలకు ఆ్రస్టేలియా సకల ప్రయత్నాలు చేసిందన్నారు. ఇది చరిత్రాత్మకమైన రోజని అసాంజ్ న్యాయవాది జెన్నిఫర్ రాబిన్సన్ అన్నారు. ఆయన విడుదలకు సాయం చేసినందుకు అల్బనీస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వందేళ్లలో అమెరికా ఎవరిపైనా గూఢచర్య చట్టం ప్రయోగించలేదని, జర్నలిస్టు అయిన అసాంజ్పైనే మోపిందని ఆయన తరఫున వాదించిన మరో న్యాయవాది బారీ పొలాక్ తన క్లయింట్ అన్యాయానికి గురయ్యారన్నారు. శుభాకాంక్షలు చెప్పిన న్యాయమూర్తి విచారణ సందర్భంగా అసాంజ్‌కు న్యాయమూర్తి రమోనా ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం విశేషం. ‘‘వచ్చే వారం మీ పుట్టిన రోజని తెలిసింది. మీరు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. జూలై 3న అసాంజ్ 54వ ఏట అడుగుపెట్టనున్నారు. భార్యను, తండ్రిని హత్తుకుని..ఆస్ట్రేలియా రాయబారులతో కలిసి అసాంజ్ ప్రైవేట్ విమానంలో సైపన్ దీవుల నుంచి బయల్దేరి బుధవారం రాత్రి ఆ్రస్టేలియా రాజధాని కాన్బెర్రా చేరుకున్నారు. కుడిచేయి పైకెత్తి పిడికిలి బిగించి విమానం నుంచి బయటికొస్తున్న ఆయన్ను చూసి మద్దతుదారులంతా పెద్దగా నినాదాలు చేశారు. విమానాశ్రయంలో తనకోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భార్య స్టెల్లా, తండ్రి జాన్ షిప్టన్లను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. వారు అసాంజ్‌ను హత్తుకుని కన్నీటిపర్యంతమయ్యారు. -
బంధాన్ని భంగపరిస్తే సహించం
సిడ్నీ: ఖలిస్తాన్ వేర్పాటువాద మూకలు ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడులకు తెగబడటాన్ని భారత ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రేలియా, భారత్ బంధానికి భంగం కల్గించేలా జరుగుతున్న ఇలాంటి కుట్రలను సహించేది లేదని కరాఖండిగా చెప్పేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మోదీ ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌తో విస్తృతస్తాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ తర్వాత అల్బనీస్ సమక్షంలోనే మీడియాతో మాట్లాడారు. ‘ భారత్, ఆస్ట్రేలియాల స్నేహపూర్వక సంబంధాలకు హాని తలపెట్టే ఎలాంటి శక్తులనైనా ఉపేక్షించేది లేదు. ఈ అంశంలో కఠినంగా వ్యవహరిస్తున్న అల్బనీస్‌కు నా కృతజ్ఞతలు. హిందూ ఆలయాలపై ఖలిస్తాన్ వేర్పాటువాదుల ఆగడాలను అణచేసేందుకు, ఖలిస్తాన్ మూకల కార్యకలాపాలపై ఇకమీదటా కఠిన చర్యలను కొనసాగిస్తానని అల్బనీస్ మరో సారి నాకు మాటిచ్చారు’ అని మోదీ ప్రకటించారు. టీ20 వేగంతో బంధం బలోపేతం భారత్, ఆస్ట్రేలియా సత్సంబంధాల బలోపేతాన్ని క్రికెట్ పరిభాషలో మోదీ సరదాగా చమత్కరించారు. ‘‘రెండు దేశాల మైత్రీ బంధం వేగంగా బలపడుతోంది. క్రికెట్‌కు వేగాన్ని తెచ్చిన టీ–20 మోడ్‌లోకి వచ్చేసింది. రెండేళ్లలో ఇక్కడికి రెండుసార్లు వచ్చా. ఏడాదిలో ఇది మా ఆరో భేటీ. ఇరుదేశాల బంధంలో పరిణతికి, సత్సంబంధాలకు ఇది నిదర్శనం. ఈసారి భారత్‌లో జరగబోయే క్రికెట్ ప్రపంచ కప్ పోటీలను వీక్షించేందుకు అల్బనీస్‌ను, ఆస్ట్రేలియాలోని క్రికెట్ వీరాభిమానులకు ఇదే నా ఆహ్వానం. ఇదే సమయంలో దీపావళి పర్వదిన వేడుకలు చూడొచ్చు. అల్బనీస్‌తో నిర్మాణాత్మక చర్చలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమున్నత శిఖరాలకు చేరుస్తాయి’’ అన్నారు. ఆస్ట్రేలియాలోని పలు వ్యాపారసంస్థల సీఈవోలతో కూడా మోదీ మాట్లాడారు. పలు రంగాల్లో భారత్‌లో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. భారత్‌లోని డిజిటల్ ఆర్థిక, నవకల్పనల వ్యవస్థను ఆస్ట్రేలియాలోని వ్యాపారాలతో అనుసంధానించాలని ఆల్బనీస్ ఆకాంక్షించారు. -
మెరుగైన స్నేహబంధం కోసం ఎదురుచూస్తున్నాం
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: భారత్– ఆస్ట్రేలియా బలీయ స్నేహబంధం కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా బుధవారం అహ్మదాబాద్ చేరుకున్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్నుద్దేశిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం అహ్మదాబాద్ చేరుకున్న అల్బనీస్ నేరుగా సబర్మతీ ఆశ్రమానికి వెళ్లి మహాత్మునికి నివాళులర్పించారు. ‘వాణిజ్యం, భద్రత వంటి అంశాల్లో క్రియాశీలకంగా ఉన్న భారత్‌తో బహుముఖ బంధాలను బలపరుచుకునేందుకు ఆస్ట్రేలియాకు లభించిన అద్భుత అవకాశం ఇది. నూతన సాంకేతికత, ఆవిష్కరణలకు చోదక శక్తి భారత్. మా దేశంలో పెద్దసంఖ్యలో వైవిధ్య భారత్, ఆస్ట్రేలియా ప్రజల వల్లే మా దేశం ఇంతగా అభివృద్ధి చెందింది ’ అని భారత్‌కు విచ్చేసిన సందర్భంగా అల్బనీస్ వ్యాఖ్యానించారు. భారతీయ డిగ్రీలకు ఆస్ట్రేలియాలో గుర్తింపు ‘ఆస్ట్రేలియా–భారత్ విద్యార్హత గుర్తింపు వ్యవస్థ’ను అందుబాటులోకి తెస్తున్నట్లు అల్బనీస్ ప్రకటించారు. అంటే ఆస్ట్రేలియా చదువుకుంటున్న, చదివిన భారతీయ విద్యార్థుల డిగ్రీలను ఇండియాలో అనుమతిస్తారు. అలాగే భారత్‌లో చదివిన డిగ్రీనీ ఆస్ట్రేలియాలో గుర్తింపునకు అనుమతిస్తారు. మరోవైపు గాంధీనగర్‌లోని గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియాకు చెందిన డీకెన్ యూనివర్సిటీ తన అంతర్జాతీయ బ్రాంచ్ క్యాంపస్‌ను నెలకొల్పనుంది. ఆస్ట్రేలియా నాలుగేళ్లపాటు చదవనున్న భారతీయ వి ద్యార్థులకు ‘మైత్రి’ పేరిట ఉపకారవేతనం సైతం అందిస్తామని అల్బనీస్ చెప్పారు. నేడు మోదీతో కలిసి టెస్ట్ మ్యాచ్ వీక్షణ బుధవారం గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గురువారం అహ్మదాబాద్‌లోని మోతెరా నిర్మించిన నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటను ప్రధాని మోదీతో కలిసి వీక్షిస్తారు. అల్బనీస్‌తో కలిసి మ్యాచ్ చూసేందుకు మోదీ సైతం బుధవారమే అహ్మదాబాద్ చేరుకున్నారు. తర్వాత అల్బనీస్ ముంబై చేరుకుంటారు. శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి ముర్మును మర్యాదపూర్వకంగా కలుస్తారు. తర్వాత మోదీతోపాటు ఇరుదేశాల వార్షిక సదస్సులో పాల్గొంటారు. సమగ్ర వ్యూహాత్మక ఒప్పందం తదితరాలపై చర్చించనున్నారు. ప్రధానిగా అల్బనీస్‌కు ఇదే తొలి భారత పర్యటన. -
వార్న్‌కు ఘన నివాళి
మెల్బోర్న్: శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందిన స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా నివాళులు అర్పించారు. ఎంసీజీ బయట ఉన్న అతని విగ్రహం వద్ద పూలు ఉంచి ఆస్ట్రేలియా ఫ్యాన్స్ స్పిన్ దిగ్గజం జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మరోవైపు వార్న్ కుటుంబ సభ్యులు అనుమతిస్తే అధికారిక లాంఛనాలతో అతనికి అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆస్ట్రేలియా దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు. ‘మా దేశానికి చెందిన గొప్ప వ్యక్తుల్లో ఒకడిగా వార్న్ నిలిచిపోతాడు. అతని బౌలింగ్‌లో ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వార్న్ తన జీవితాన్ని కూడా అద్భుతంగా జీవించాడు’ అని ఆయన సంతాపం ప్రకటించారు. ఎంసీజీలోని గ్రేట్ సదరన్ స్టాండ్‌కు షేన్ వార్న్ పేరు పెడుతున్నట్లు కూడా ఆసీస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. వార్న్ సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన ఇంగ్లీష్ కౌంటీ ‘హాంప్‌షైర్’ ప్రధాన కేంద్రమైన సౌతాంప్టన్‌లో కూడా అతనికి సంతాపం ప్రకటిస్తూ పలు కార్యక్రమాలు జరిగాయి. రోజ్ బౌల్ మైదానంలో ఇంగ్లండ్ అభిమానులు వార్న్‌కు నివాళులు అర్పించారు. -
ఆస్ట్రేలియా ప్రధాని భారత్‌లో పర్యటన
-
మత పెద్దను ఆహ్వానించడంపై ప్రధాని విచారం
సిడ్నీ: స్వలింగ సంప్కరులను వ్యతిరేకించిన ఇస్లాం మత పెద్ద షేక్ షాడీ అల్సులీమాన్ ను ఇఫ్తార్ విందుకు ఆహ్వానించడం పట్ల ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కమ్ టర్న్‌బుల్ విచారం వ్యక్తం చేశారు. ప్రధాని అధికారిక నివాసం కిరిబల్లి హౌస్ లో గురువారం నిర్వహించిన రంజాన్ విందుకు అల్సులీమాన్ తో పాటు పలువురు ముస్లిం పెద్దలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో 2013లో స్వలింగ సంప్కరులకు వ్యతిరేకంగా అల్సులీమాన్ మాట్లాడిన వీడియో యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. వాధ్యులు వ్యాప్తి చెందడానికి, సమాజం గతి తప్పడానికి స్వలింగ సంపర్కులు కారణమవుతున్నారని అల్సులీమాన్ అందులో పేర్కొన్నారు. ఆస్ట్రేలియా నేషనల్ ఇమామ్ ల సంఘానికి అధ్యక్షుడైన అల్సులీమాన్ చేసిన వ్యాఖ్యలను టర్నబుల్ ఖండించారు. బహుళ సంస్కృతులకు ఆలవాలమైన ఆస్ట్రేలియాలో ఇలాంటి వ్యాఖ్యలకు తావులేదన్నారు. అల్సులీమాన్ చేసిన వ్యాఖ్యల గురించి ముందే తెలిసివుంటే ఆయనను విందుకు ఆహ్వానించేవాడిని కాదన్నారు. కాగా, ఆస్ట్రేలియా ప్రభుత్వం తొలిసారిగా ఇఫ్తార్ విందు నిర్వహించడం విశేషం. -
ఆస్ట్రేలియాలో మరో దారుణం
-
ఆస్ట్రేలియాలో మరో దారుణం: 8 మంది చిన్నారుల మృతి
మెల్బోర్న్ : సిడ్నీలోని కేఫ్ ఘటన, పాకిస్థాన్ పెషావర్‌లో చిన్నారుల నరమేధం మనోఫలకంపై నుంచి చెరగక ముందే ఆస్ట్రేలియాలోని సౌత్ క్వీన్స్ ల్యాండ్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. సౌత్ క్వీన్స్‌ల్యాండ్‌లోని కెయిర్న్స్ పట్టణంలోని ఓ ఇంటిలో మహిళ (34) తీవ్రంగా గాయపడినట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆ ఇంటి ఆవరణలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఎనిమిది మంది చిన్నారులను మృతదేహలను గుర్తించారు. ఆ మృతదేహలన్నీ ఏడాదిన్నర వయస్సు గల చిన్నారుల నుంచి 15 సంవత్సరాల వయస్సు గల వారివి ఉన్నాయని చెప్పారు. పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు ఆ మృతదేహాలపై గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా సోదరులుగా భావిస్తున్నామని చెప్పారు. గాయపడిన మహిళ ఆరోగ్యం పరిస్థతి ప్రస్తుతం నిలకడగా ఉందని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ ఇంటిని అణువణువు తనిఖీ చేస్తున్నారు. అలాగే ఇంటి పరిసరాల్లోని వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనతో ఆస్ట్రేలియా ఒక్కసారిగా ఉల్కిపడింది. దేశం ప్రస్తుతం క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటుందని ప్రధాని టోని అబ్బాట్ తెలిపారు. ఈ దారుణంపై మాట్లాడేందుకు మాటలు రావడం లేదన్నారు. -
మోడీకి ఆస్ట్రేలియా ప్రధాని కృతజ్ఞతలు
న్యూఢిల్లీ: వారం క్రితం భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబోట్.. తనకు ఇచ్చిన ఆతిథ్యానికి మోడీ భారత ప్రధానికి ధన్యవాదాలు తెలియజేశారు. మంగళవారం మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. నిర్ణయాలు అమలయ్యేలా కృషి చేయాలని ఇద్దరు నేతలు అంగీకరించారు. జమ్మూకాశ్మీర్‌లో ఇటీవల వరదలు సంభంవించడం, అపార నష్టం వాటిల్లడం పట్ల ఆస్ట్రేలియా ప్రధాని విచారం వ్యక్తం చేశారు. -
ప్రజాస్వామ్య శక్తిగా భారత్!
ఆస్ట్రేలియా ప్రధాని అబాట్ ముంబై: భారత్ ‘ప్రజాస్వామ్య మహాశక్తి’గా రూపొందుతోందంటూ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్ ప్రశంసించారు. కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధిలో దూసుకుపోతూ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోందన్నారు. భారత్‌లో వ్యాపారాభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నాయన్నారు. భారత్‌లో 2 రోజుల పర్యటనకు వచ్చిన టోనీ అబాట్ గురువారం ముంబైలో తనతో పాటు భారత్ వచ్చిన వ్యాపార, పారిశ్రామిక వేత్తలనుద్దేశించి ప్రసంగించారు. మోడీ చెబుతున్న ‘మేక్ ఇన్ ఇండియా’ తరహా పిలుపును ఆస్ట్రేలియా వాణిజ్యాభివృద్ధి కోసం తానూ ఇచ్చానన్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంత దేశాల మధ్య ఆర్థిక, సామాజిక సంబంధాలకోసం ఉద్దేశించిన ‘న్యూ కొలంబో ప్లాన్’ను ముంబై యూనివర్సిటీలో ప్రారంభించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరువాత సార్కేతర దేశాల నుంచి ఒక ప్రభుత్వాధినేత భారత్ పర్యటనకు రావడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య పౌర అణు ఒప్పందం కుదరనుంది. దీని ద్వారా భారత్‌కు యురేనియం ను అమ్మేం దుకు ఆస్ట్రేలియాకు వీలవుతుంది. -
సచిన్ ను కలవనున్న ఆస్ట్రేలియా ప్రధాని
ముంబై: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్ ఈ ఉదయం భారత వాణిజ్య రాజధాని ముంబైకి చేరుకున్నారు. రాజభవన్ లో మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావును ఆయన కలిశారు. హోటల్ తాజ్‌మహల్ ప్యాలెస్ వద్ద 26/11 అమరవీరులకు ఆయన నివాళి అర్పించారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను ఆసీస్ ప్రధాని కలవనున్నారు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగే కార్యక్రమంలో అబాట్ తో పాటు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ఆడమ్ గిల్ క్రిస్ట్, బ్రెట్ లీ కూడా సచిన్ ను కలుస్తారు. ఈ మధ్యాహ్నం భారత వ్యాపారవేత్తలతో టోనీ అబాట్సమావేశం కానున్నారు. శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తో ఆయన భేటీ అవుతారు.


