బంధాన్ని భంగపరిస్తే సహించం

PM Narendra Modi raises temple attacks in talks with Australia PM Albanese - Sakshi

ఆస్ట్రేలియాలో ఆలయాలపై వేర్పాటువాదుల దాడులపై ప్రధాని మోదీ ఆగ్రహం

భేటీ సందర్భంగా అల్బనీస్‌తో ద్వైపాక్షిక అంశాలపై విస్తృత చర్చ

సిడ్నీ: ఖలిస్తాన్‌ వేర్పాటువాద మూకలు ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడులకు తెగబడటాన్ని భారత ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రేలియా, భారత్‌ బంధానికి భంగం కల్గించేలా జరుగుతున్న ఇలాంటి కుట్రలను సహించేది లేదని కరాఖండిగా చెప్పేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మోదీ ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌తో విస్తృతస్తాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ తర్వాత అల్బనీస్‌ సమక్షంలోనే మీడియాతో మాట్లాడారు.

‘ భారత్, ఆస్ట్రేలియాల స్నేహపూర్వక సంబంధాలకు హాని తలపెట్టే ఎలాంటి శక్తులనైనా ఉపేక్షించేది లేదు. ఈ అంశంలో కఠినంగా వ్యవహరిస్తున్న అల్బనీస్‌కు నా కృతజ్ఞతలు. హిందూ ఆలయాలపై ఖలిస్తాన్‌ వేర్పాటువాదుల ఆగడాలను అణచేసేందుకు, ఖలిస్తాన్‌ మూకల కార్యకలాపాలపై ఇకమీదటా కఠిన చర్యలను కొనసాగిస్తానని అల్బనీస్‌ మరో సారి నాకు మాటిచ్చారు’ అని మోదీ ప్రకటించారు.

టీ20 వేగంతో బంధం బలోపేతం
భారత్, ఆస్ట్రేలియా సత్సంబంధాల బలోపేతాన్ని క్రికెట్‌ పరిభాషలో మోదీ సరదాగా చమత్కరించారు. ‘‘రెండు దేశాల మైత్రీ బంధం వేగంగా బలపడుతోంది. క్రికెట్‌కు వేగాన్ని తెచ్చిన టీ–20 మోడ్‌లోకి వచ్చేసింది. రెండేళ్లలో ఇక్కడికి రెండుసార్లు వచ్చా. ఏడాదిలో ఇది మా ఆరో భేటీ. ఇరుదేశాల బంధంలో పరిణతికి, సత్సంబంధాలకు ఇది నిదర్శనం. ఈసారి భారత్‌లో జరగబోయే క్రికెట్‌ ప్రపంచ కప్‌ పోటీలను వీక్షించేందుకు అల్బనీస్‌ను, ఆస్ట్రేలియాలోని క్రికెట్‌ వీరాభిమానులకు ఇదే నా ఆహ్వానం.

ఇదే సమయంలో దీపావళి పర్వదిన వేడుకలు చూడొచ్చు. అల్బనీస్‌తో నిర్మాణాత్మక చర్చలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమున్నత శిఖరాలకు చేరుస్తాయి’’ అన్నారు. ఆస్ట్రేలియాలోని పలు  వ్యాపారసంస్థల సీఈవోలతో కూడా మోదీ మాట్లాడారు. పలు రంగాల్లో భారత్‌లో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. భారత్‌లోని డిజిటల్‌ ఆర్థిక, నవకల్పనల వ్యవస్థను ఆస్ట్రేలియాలోని వ్యాపారాలతో అనుసంధానించాలని ఆల్బనీస్‌ ఆకాంక్షించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top