ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ ఐదో ర్యాంక్ ద్వయం సాత్విక్–చిరాగ్ 21–12, 15–21, 19–21తో ప్రపంచ 37వ ర్యాంక్ జంట హి జి టింగ్–రెన్ జియాంగ్ యు (చైనా) చేతిలో ఓడిపోయింది. గతంలో హి జి టింగ్–రెన్ జియాంగ్ యులతో ఆడిన మూడుసార్లూ గెలుపొందిన సాత్విక్–చిరాగ్లకు ఈసారి ఓటమి తప్పలేదు.
పురుషుల సింగిల్స్లో భారత రైజింగ్ స్టార్ ఆయుశ్ శెట్టి కూడా తొలి రౌండ్ను దాటలేకపోయాడు. అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్లో ఆయుశ్ 11–21, 21–13, 10–21తో పరాజయం చవిచూశాడు. మహిళల సింగిల్స్లో భారత ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఉన్నతి హుడా 21–123, 21–16, 16–21తో హాన్ కియాన్ (చైనా) చేతిలో ఓడిపోగా... అష్మిత చాలిహా 21–18, 22–20తో కలోయానా నల్బంతోవా (బల్గేరియా)పై విజయం సాధించింది.


