ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. ప్రపంచ 45వ ర్యాంకర్ వైవోన్ లీ (జర్మనీ)తో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 21–13, 23–25, 19–21తో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌కంటే ముందు వైవోన్ లీతో ఆడిన మూడుసార్లూ గెలిచిన సింధు ఈసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. 65 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు నిర్ణాయక మూడో గేమ్‌లో 19–15తో ఆధిక్యంలో ఉంది.
విజయానికి రెండు పాయింట్ల దూరంలోనే ఉన్న సింధు... అనూహ్యంగా తడబడి ప్రత్యర్థికి వరుసగా ఆరు పాయింట్లు సమర్పించుకొని ఓటమి పాలైంది. భారత్‌కే చెందిన రైజింగ్ స్టార్ తన్వీ శర్మ తొలి రౌండ్‌లో 21–17, 16–21, 21–19తో నత్సుకి నిదైరా (జపాన్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ 18–21, 21–13, 15–21తో మూడో సీడ్ చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోగా... ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ 22–20, 21–19తో అర్నాడ్ మెర్‌క్లె (ఫ్రాన్స్)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.


