2027 వర్షాకాలానికి ముందే పనులు పూర్తి: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల సమగ్ర పునరుద్ధరణ పనులను నవంబర్ రెండోవారంలో ప్రారంభించి, 2027 వర్షాకాలానికి ముందే పూర్తి చేస్తామని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. మూడు బరాజ్‌లను పటిష్టం చేయడంతోపాటు వాటి నిర్వహణ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు అవసరమైన డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిందని తెలిపారు. కుందన్‌బాగ్‌లోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో బరాజ్ పునరుద్ధరణ ప్రతిపాదనలపై మంత్రి సమీక్షించారు. డిజైన్ కన్సల్టెన్సీ రూపొందించిన పునరుద్ధరణ ప్రణాళికలో గ్రౌటింగ్‌తో పునాదుల బలోపేతం, స్టిల్లింగ్ బేసిన్ల విస్తరణ, కొత్త కట్–ఆఫ్ వాల్స్ నిర్మాణం వంటి కీలక పనులు ఉన్నాయని చెప్పారు.
వరద ప్రవాహ వేగాన్ని నియంత్రించే ఏర్పాట్లలో ఉన్న లోపాలను సరిచేయడంతోపాటు పునాదుల స్థిరత్వాన్ని పెంచడం, పునాదుల కింద నీటి చొరబాటును అరికట్టడం ఈ పనుల ప్రధాన ఉద్దేశమని వివరించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ)తోపాటు ఇతర నిపుణుల కమిటీల అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకొని పునరుద్ధరణ ప్రణాళికను రూపొందించినట్టు మంత్రి వెల్లడించారు.
అక్టోబర్ 5న సీడబ్ల్యూసీకి డిజైన్లు
డిజైన్ కన్సల్టెంట్ అందించిన డిజైన్లను పూణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్)లో కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ నమూనాల ద్వారా పరీక్షిస్తున్నట్టు మంత్రి ఉత్తమ్ తెలిపారు. వివిధ స్థాయిల్లో వరద ప్రవాహం ఉన్నప్పుడు బరాజ్‌ల వద్ద నీటి ప్రవాహ తీరు ఎలా ఉంటుందో, ప్రతిపాదించిన పునరుద్ధరణ చర్యలు వాటిని తట్టుకునే విషయంలో ఎంత మేరకు సమర్థవంతంగా పనిచేస్తాయో ఈ పరీక్షలతో నిర్థారిస్తారని చెప్పారు. పునరుద్ధరణ డిజైన్లను అక్టోబర్ 5న న్యూఢిల్లీలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలోని సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ముందు ఉంచనున్నట్టు ఉత్తమ్ వెల్లడించారు. కమిటీ నిపుణులు వాటిని పరిశీలించి అవసరమైన సూచనలు, సిఫార్సులు చేస్తారని తెలిపారు.
పునరుద్ధరణ పనులకు మళ్లీ టెండర్లు
డిజైన్లకు సాంకేతిక అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను ఏకకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పునరుద్ధరణ పనులకు సంబంధించిన సమగ్ర వ్యయ అంచనాలను నీటిపారుదల శాఖ సిద్ధం చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ అనుమతి కోసం అవసరమైన కాంట్రాక్టు విధానాన్ని కూడా ఖరారు చేస్తున్నట్టు తెలిపారు. డిజైన్లకు అనుమతి లభించిన వెంటనే టెండర్లు పిలిచి, పనులను అప్పగించేలా మొత్తం ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
పునరుద్ధరణ పనులు పూర్తయి జాతీయ సాంకేతిక సంస్థల నుంచి అవసరమైన భద్రతా అనుమతులు వచ్చిన తర్వాతే బరాజ్‌లను తిరిగి వినియోగంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. డిజైన్ల పరిశీలన నుంచి టెండర్లు, పనుల అమలు, తుది భద్రతా ధ్రువీకరణ వరకు ప్రతి దశను పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్‌డీఎస్‌ఏ ఆదేశాలను పూర్తిస్థాయిలో పాటిస్తూ, ప్రతి దశను నిపుణుల పరిశీలనకు లోబడి నిర్వహించాలని అధికారులకు సూచించారు.


