
క్వార్టర్స్ తొలి గేమ్‌లో విజయం
‘డ్రా’లతో ముగించిన హారిక, వైశాలి, దివ్య
‘ఫిడే’ మహిళల ప్రపంచ కప్ చెస్
బతుమి (జార్జియా): ‘ఫిడే’ మహిళల ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి సెమీఫైనల్‌కు చేరువైంది. శనివారం యుజిన్ సాంగ్ (చైనా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో హంపి విజయం సాధించింది. హంపి 53 ఎత్తుల్లో ప్రత్యర్థి ఆట కట్టించింది. ఈ పోరులో ఇద్దరి మధ్య జరిగే రెండో గేమ్‌ను హంపి ‘డ్రా’గా ముగించుకున్నా సరే సెమీ ఫైనల్లోకి ప్రవేశిస్తుంది.
మరో క్వార్టర్ ఫైనల్ పోరులో ఇద్దరు భారత ప్లేయర్లు ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్ తలపడగా... తొలి గేమ్ ‘డ్రా’గా ముగిసింది. 31 ఎత్తుల తర్వాత ఇద్దరు ప్లేయర్లు సమ ఉజ్జీలుగా నిలిచారు. క్వార్టర్ ఫైనల్ బరిలో నిలిచిన మరో భారత ప్లేయర్ ఆర్. వైశాలి కూడా తన తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది.
వైశాలి, టాన్ జోంగీ (చైనా) మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరు 72 ఎత్తుల వరకు సాగి సమంగా ముగిసింది. హారిక, దివ్య మధ్య... వైశాలి, టాన్ జోంగీ మధ్య రెండో గేమ్‌లో ఎవరు గెలిస్తే వారు సెమీస్ చేరతారు. నాలుగో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ తొలి గేమ్‌లో టింగ్‌జీ లీ (చైనా) తొలి గేమ్‌లో 40 ఎత్తుల్లో స్థానిక ప్లేయర్ జాగ్‌నిడ్జ్ నానా (జార్జియా)ను ఓడించింది.