తుప్పుతో భారత్‌కు ఏటా రూ.14.15 లక్షల కోట్ల నష్టం
వార్షిక జీడీపీలో ఇది సుమారు 4.3 శాతానికి సమానం
నిర్దిష్ట కాలపరిమితికి ముందే పాడవుతున్ననిర్మాణాలు, భారీ యంత్రాలు
పునరుద్ధరణ, మరమ్మతులకు ఏటా భారీగా అవుతున్న ఖర్చు
నొమురా నివేదికలో విస్తుపోయే వాస్తవాలు
సరైన యాంటీ–కొరోజన్ వ్యవస్థ, నాణ్యమైన స్టెయిన్‌లెస్ స్టీల్ వాడాలని సూచన
సాక్షి, హైదరాబాద్: ఏదైనా ఒక వస్తువుకు తుప్పు పడితే తుప్పే కదా అని తీసి పారేస్తాం. లోహపు వస్తువులో నాణ్యత లోపించిందని భావిస్తాం. కానీ ఇదే తుప్పు దేశానికి భారీ ఆర్థిక ముప్పును తెచ్చిపెడుతోందంటే మాత్రం ముక్కున వేలేసుకోక తప్పదు. వివరంగా చెప్పాలంటే..తుప్పు అనే చిన్న సమస్య ప్రస్తుతం దేశ ప్రగతికి పెద్ద అవరోధంగా మారింది. ఇనుము, ఉక్కు వస్తువులకు పట్టే తుప్పు (కొరోజన్) కారణంగా భారత్‌కు ఏటా దాదాపు రూ.14.15 లక్షల కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లుతోందని జపాన్‌కు చెందిన ప్రముఖ ఆర్థిక పరిశోధన సంస్థ నొమురా తాజా నివేదిక వెల్లడించింది. ఈ నష్టం వార్షిక స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) సుమారు 4.3 శాతానికి సమానం.
పాడవుతున్న భారీ యంత్రాలు
వాతావరణ మార్పులు, తేమ, రసాయనాల ప్రభావం వల్ల లోహాలు క్రమంగా క్షీణించడం మొదలు పెట్టడాన్నే తుప్పు అంటారు. ఈ ప్రక్రియ చిన్న చిన్న వస్తువులనే కాదు.. అనేక కీలక మౌలిక సదుపాయాలను నిశ్శబ్దంగా నిర్వీర్యం చేస్తోంది. దేశంలో నిర్మిస్తున్న వంతెనలు, రహదారులు, రైల్వే లైన్ల వంటి నిర్మాణాలు, ఓడరేవులు, విద్యుత్ కేంద్రాలు, పారిశ్రామిక రంగానికి చెందిన భారీ యంత్రాలు ఈ సమస్య కారణంగా వాటి నిర్దేశిత కాల పరిమితికి ముందే పాడైపోతున్నాయి.
ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు వాటిని పునరుద్ధరించడానికి, మరమ్మతులు చేయడానికి ఏటా భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. కొత్తగా మరిన్ని ఆధునిక వసతులు, ఆసుపత్రులు, పాఠశాలలు, రహదారుల నిర్మాణానికి ఉపయోగపడాల్సిన నిధులు ఇలా ఉనికిలో ఉన్న పాత ఆస్తులను కాపాడుకోవడానికే వెచ్చించాల్సి రావడం దేశ ఆర్థికాభివృద్ధిని మందగించేస్తోంది.
ఈ రంగాల్లో నష్టాలెక్కువ..
లోహపు విడి భాగాలను ఎక్కువగా ఉపయోగించే మౌలిక సదుపాయాలు, ఆటోమొబైల్, విద్యుత్ ఉత్పత్తి– సరఫరా, టెలికం, రైల్వే రంగాలు తుప్పు సమస్యతో తీవ్రంగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా విద్యుత్ రంగానికి చెందిన వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, టెలికం టవర్లు.. నిరంతరం ఎండ, వాన కారణంగా నిర్దిష్ట కాలపరిమితికి ముందే దెబ్బతింటున్నాయి.
భారత్‌లో తీవ్రం.. ఎందుకంటే..
భారీ వర్షాలు, తేమ: రుతుపవనాల వల్ల కురిసే భారీ వర్షాలు, ఇక్కడి వాతావరణంలో ఉండే అధిక తేమ లోహాలను త్వరగా పాడుచేస్తాయి.
తీరప్రాంత ఉప్పు గాలి: దేశానికి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతం కారణంగా గాలిలో లవణీయత (ఉప్పు శాతం) ఎక్కువగా ఉంటుంది. ఇది సముద్ర తీర ప్రాంతాల్లోని వంతెనలు, ఓడరేవుల నిర్మాణాలను వేగంగా క్షీణింపజేస్తుంది. ఆటో మొబైల్ రంగంపైనా ప్రభావం చూపిస్తోంది.
ఒకేతరహా నిర్మాణ నిబంధనలు: అమెరికా, జపాన్ వంటి దేశాలు వాతావరణ పరిస్థితులను బట్టి వేర్వేరు ప్రాంతాలకు వేర్వేరు భద్రత ప్రమాణాలను పాటిస్తాయి. కానీ మన దేశంలో కశీ్మర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే రకమైన నిర్మాణ నిబంధనలను అనుసరిస్తున్నారు.
చౌకైన, నాణ్యత లేని భద్రతా ప్రమాణాలు
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌కు సంబంధించిన ప్రమాణాలు కొనసాగుతున్నప్పటికీ వాతావరణ తీవ్రతను బట్టి ఏ ప్రాంతంలో ఎలాంటి తుప్పు నివారణ పద్ధతులు (ఉదాహరణకు ప్రత్యేక పూతలు లేదా గాల్వనైజేషన్) వాడాలో స్పష్టంగా పేర్కొనలేదు. దీనివల్ల నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టర్లు కేవలం నిబంధనల కోసమే అన్నట్టుగా అత్యంత చౌకైన, నాణ్యత లేని భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నారు. ఫలితంగా వంతెనలు, ఫ్లైఓవర్లు కొద్ది సంవత్సరాలకే ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇది కేవలం ఆర్థిక నష్టమే కాకుండా ప్రజల ప్రాణాలకు కూడా ముప్పుగా పరిణమిస్తోంది. సరైన యాంటీ–కొరోజన్ వ్యవస్థను, నాణ్యమైన స్టెయిన్‌లెస్ స్టీల్‌ను వాడితే దేశ ఉత్పాదకత పెరిగి జీడీపీకి అదనంగా 1.5 శాతం లబ్ధి లభిస్తుందని నివేదిక స్పష్టం చేస్తోంది.
నొమురా సూచనలు
01 కఠిన చట్టాలు:
దేశంలో నిర్మించే ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులో తుప్పు నివారణ చర్యలను తప్పనిసరి చేయాలి.
02 అంతర్జాతీయ ప్రమాణాలు:
వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా మన దేశ నిర్మాణ నిబంధనలను అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా మార్చాలి.
03 అవగాహన పెంపు
⇒ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లలో అధునాతన యాంటీ–కొరోజన్ సాంకేతికతలపై అవగాహన పెంచాలి
అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతలు
హాట్–డిప్ గాల్వనైజేషన్: ఇనుము, ఉక్కుపై ద్రవరూప జింక్ పూతను పూయడం ద్వారా తుప్పు పట్టకుండా రక్షణ కల్పించవచ్చు.
క్యాథోడిక్ ప్రొటెక్షన్: విద్యుత్ ప్రవాహాన్ని ఉపయోగించి భూగర్భ పైప్‌లైన్లు, సముద్రపు వంతెనల లోహ క్షీణతను అడ్డుకోవచ్చు.
ఎపోక్సీ కోటింగ్స్: ఉక్కు ఉపరితలాలపై ప్రత్యేక ప్లాస్టిక్ పొరను అమర్చి తేమ, రసాయనాల ప్రభావం పడకుండా చూడొచ్చు.
వెదరింగ్ స్టీల్: ఈ రకమైన ప్రత్యేక ఉక్కు వాతావరణ ప్రభావానికి గురైనప్పుడు దానికదే ఒక రక్షణ పొరను ఏర్పరచుకుని మరింత క్షీణించకుండా ఆగుతుంది.
నానో–టెక్నాలజీ పూతలు: లోహాల రంధ్రాలను పూడ్చే సరికొత్త రసాయన పూతలు కూడా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి.
ఇతర దేశాల్లో ఇలా..
పర్యావరణ విభజన (జోనింగ్): అమెరికా తన దేశాన్ని వివిధ వాతావరణ మండలాలుగా (తీరప్రాంతం, మంచు ప్రాంతం, పొడి ప్రాంతం) విభజించింది.
ఏ ప్రాంతంలో నిర్మించే వంతెనకైనా అక్కడి వాతావరణ తీవ్రతకు సరిపోయే రక్షణ వ్యవస్థలను మాత్రమే వాడాలనే నిబంధన ఉంది.
కాలపరిమితి వ్యయ అంచనా:
జపాన్‌లో ఏదైనా ప్రాజెక్టును చేపట్టేటప్పుడు కేవలం నిర్మాణ ఖర్చునే కాకుండా, రాబోయే 50 లేదా 100 సంవత్సరాల పాటు దానికి అయ్యే మరమ్మతుల ఖర్చును కూడా లెక్కించి, అత్యుత్తమ యాంటీ–కొరోజన్ మెటీరియల్‌ను ఎంపిక చేస్తారు.
తప్పనిసరి తనిఖీలు:
యూరప్‌లో వంతెనలు, రైల్వే మార్గాన్నినిర్ణిత కాల వ్యవధిలో అధునాతన సెన్సార్ల ద్వారా తనిఖీ చేసి, తుప్పు ప్రారంభ దశలోనే నివారణ చర్యలు చేపడతారు.


