సోషల్ మీడియా ఇప్పుడు మన జీవితంలో ఓ భాగమైపోయింది. ఉదయం నిద్రలేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు, రీల్స్, వీడియోలు చూస్తూ కాలం గడుపుతున్నాం. అయితే ఇంతగా అలవాటైన ఈ సోషల్ మీడియా అనుభవం అతిత్వరలో మారిపోనుందా?.. ఇది వరకులా అది మనకు వినోదం పంచడం సాధ్యం కాదా?. మెటాపై కేసు విచారణలో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
పిల్లలు, టీనేజర్లపై సోషల్ మీడియా ప్రభావం, వారి వ్యక్తిగత డేటా రక్షణ అంశాలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. అమెరికాలో మెటా సంస్థకు వ్యతిరేకంగా దాఖలైన కీలక కేసు ఇప్పుడు విచారణ దశకు చేరుకుంది. ఈ కేసులో మెటా ఓడిపోతే.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఇప్పటివరకు వినియోగదారులకు అత్యంత సాధారణంగా కనిపించే అనేక ఫీచర్లు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అంతేకాదు, అమెరికాలోని 30 రాష్ట్రాలు కలిసి వేసిన ఈ కేసు మెటాపై ట్రిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక జరిమానా విధించే పరిస్థితికీ దారితీయొచ్చు కూడా.
ఏం జరిగింది?
2023లో అమెరికాలోని 30 రాష్ట్రాలు మెటాపై కేసు దాఖలు చేశాయి. కాలిఫోర్నియా, న్యూయార్క్ వంటి కీలక రాష్ట్రాలు కూడా ఇందులో ఉన్నాయి. పిల్లలు, టీనేజర్లను ఆకర్షించేలా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను రూపొందించి, వారు ఎక్కువసేపు ఆ ప్లాట్‌ఫామ్‌లలో ఉండేలా చేస్తున్నారని రాష్ట్రాలు ఆరోపించాయి. అంతేకాదు..
చిన్నారుల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఫెడరల్, రాష్ట్ర చట్టాలను మెటా ఉల్లంఘించిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా వినియోగదారులను పదేపదే యాప్‌లోకి తిరిగి తీసుకురావడానికి నోటిఫికేషన్లు, సిఫార్సు వ్యవస్థలు, ఆటోప్లే వీడియోలు, అనంతంగా కంటెంట్ చూపించే విధానం వంటి ఫీచర్లను ఉపయోగిస్తోందని రాష్ట్రాలు చెబుతున్నాయి.
నేటి నుంచే కీలక విచారణ
మెటాపై అమెరికా రాష్ట్రాలు దాఖలు చేసిన ఈ కీలక కేసులో ప్రధాన విచారణ నేటి నుంచి(ఆగస్టు 18) ప్రారంభం కానుంది. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో జ్యూరీ ఎదుట వాదనలు జరగనున్నాయి. విచారణ సుమారు 6–8 వారాల పాటు కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్రాలు మెటా యువతను ఎక్కువసేపు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండేలా డిజైన్ చేసిందని ఆరోపిస్తున్నాయి. దీంతో.. తీర్పు ఎలా రానుందా? అనే ఉత్కంఠ ఇప్పటి నుంచే మొదలైంది.
మెటా ఓడితే ఏం మారొచ్చు?
ఈ కేసులో రాష్ట్రాలు కేవలం డబ్బు జరిమానా మాత్రమే కోరడం లేదు. పిల్లలు, టీనేజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పనిచేసే విధానాన్నే మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి.
అందులో ముఖ్యమైనవి..
టీనేజర్ల ఖాతాలకు తల్లిదండ్రుల ధ్రువీకరణ తప్పనిసరి చేయడం.
పిల్లలు, టీనేజర్లు అనేక ఖాతాలు సృష్టించకుండా నియంత్రణలు విధించడం.
యువ వినియోగదారులకు కనిపించే లైక్ కౌంట్లను తొలగించడం.
ఒక కంటెంట్ తర్వాత మరొకటి నిరంతరం చూపించే ఇన్ఫినిట్ స్క్రోల్‌ను నిలిపివేయడం.
టీనేజర్లను ఎక్కువసేపు యాప్‌లో ఉంచేలా పనిచేస్తున్న రికమెండేషన్ అల్గారిథమ్‌లలో మార్పులు చేయడం.
ముఖం, శరీర రూపాన్ని మార్చే కొన్ని ఇమేజ్ ఫిల్టర్లను తొలగించడం.
వీడియోలు ఆటోమేటిక్‌గా ప్లే అయ్యే ఆటోప్లే ఫీచర్‌ను నిలిపివేయడం.
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వంటి తాత్కాలికంగా కనిపించి మాయమయ్యే పోస్టులను పరిమితం చేయడం.
ఇవన్నీ చూస్తే.. ఈ కేసు, మెటాకు రాబోయే తీర్పు ఎంతో కీలకమని స్పష్టమవుతోంది. వ్యతిరేకంగా వస్తే మాత్రం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల ప్రాథమిక వినియోగ అనుభవమే మారిపోయే అవకాశం ఉంది.
పిల్లలను ‘యూజర్లు’గా మార్చడమే లక్ష్యమా?
ఇదే ఈ కేసులో ప్రధాన ఆరోపణ. పిల్లలు, టీనేజర్లు ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కువసేపు ఉండేలా మెటా ఉద్దేశపూర్వకంగా కొన్ని ఫీచర్లను రూపొందించిందని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఒక వీడియో పూర్తయిన వెంటనే మరొకటి మొదలవడం, స్క్రోల్ చేస్తూనే కొత్త కంటెంట్ రావడం, తరచూ నోటిఫికేషన్లు రావడం వంటి అంశాలు వినియోగదారులను మళ్లీ మళ్లీ యాప్‌లోకి తీసుకువస్తాయని వాటి వాదన. అంటే.. యూజర్ యాప్‌ను ఉపయోగిస్తున్నాడా? లేక యాప్ యూజర్‌ను ఉపయోగిస్తోందా? అనే పెద్ద ప్రశ్న ఈ కేసులో ముందుకు వస్తోంది.
లైక్ బటనే కీలకం?
సోషల్ మీడియాలో లైక్ అనేది సాధారణంగా కనిపించే చిన్న సంఖ్య. కానీ పిల్లలు, టీనేజర్లపై దాని ప్రభావం పెద్దదిగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఎంతమంది లైక్ చేశారు? ఇతరుల పోస్టులకు తన పోస్టుకు వచ్చిన స్పందన ఎంత? ఇతరులతో పోలిస్తే తాను ఎలా ఉన్నాను? అనే ఆలోచనలు యువతలో సామాజిక పోలికలకు దారితీయొచ్చని ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో మెటా స్వయంగా నిర్వహించిన పరిశోధనల నుంచి కూడా రాష్ట్రాల న్యాయవాదులు ఆధారాలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. లైక్ కౌంట్లు సోషల్ కంపారిజన్*కు దారితీస్తాయని, ఇన్‌స్టాగ్రామ్‌లో అలాంటి పోలికలు ఒంటరితనం, శరీర రూపంపై ప్రతికూల భావన, నెగెటివ్ మూడ్‌తో సంబంధం కలిగి ఉన్నాయని మెటా అంతర్గత పరిశోధనలు సూచించినట్లు రాష్ట్రాలు వాదిస్తున్నాయి.
మెటా వాదన ఏంటి?
అయితే ఈ ఆరోపణలను మెటా పూర్తిగా ఖండిస్తోంది. యువతకు మద్దతు ఇవ్వడంలో తమ సంస్థకు దీర్ఘకాలిక నిబద్ధత ఉందని, కేసులోని ఆధారాలు తమ వైఖరిని సమర్థిస్తాయని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే మరో రాష్ట్రంలో మెటాకు ఎదురుదెబ్బ తగిలింది. న్యూ మెక్సికోలోని ఒక కేసులో మెటాపై 942 మిలియన్ డాలర్ల జరిమానా విధించడంతో పాటు యువ వినియోగదారులకు సంబంధించిన పలు మార్పులు చేయాలని ఆదేశించారు. 18 ఏళ్లలోపు వినియోగదారులకు లైక్ కౌంట్లను తొలగించడం, నగ్న చిత్రాలకు సంబంధించిన మెసేజింగ్‌ను నిరోధించడం, పుష్ నోటిఫికేషన్లను నిర్దిష్ట సమయాలకు పరిమితం చేయడం వంటి ఆదేశాలు అందులో ఉన్నాయి. మెటా ఆ తీర్పును అప్పీల్ చేయనున్నట్లు తెలిపింది.
ఈ కేసు చాలా పెద్దదే!
న్యూ మెక్సికో కేసు ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం. కానీ తాజా కేసులో 30 రాష్ట్రాలు కలిసి మెటాను ఎదుర్కొంటున్నాయి. ఈ రాష్ట్రాలు అమెరికా జనాభాలో దాదాపు మూడింట రెండొంతుల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అందువల్ల మెటా ఈ కేసులో ఓడిపోతే.. తీర్పు ప్రభావం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా అమెరికా అంతటా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో పిల్లలు, టీనేజర్ల అనుభవాన్ని మార్చే అవకాశం ఉంది.
సోషల్ మీడియా భవిష్యత్తుపై ప్రభావం?
ఈ కేసు మరో అసలు ప్రశ్నను కూడా ముందుకు తెస్తోంది. పిల్లలను ఆకర్షించడానికి రూపొందించిన సోషల్ మీడియా ఫీచర్లకు ఎంతవరకు పరిమితులు ఉండాలి? కంపెనీల వ్యాపార ప్రయోజనాల కంటే చిన్నారుల మానసిక ఆరోగ్యం, గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వాలా? తల్లిదండ్రుల నియంత్రణ ఎంతవరకు ఉండాలి?.
మెటా ఓడితే.. లైక్‌ల సంఖ్య కనిపించని ఇన్‌స్టాగ్రామ్, నిరంతర స్క్రోల్ లేని ఫేస్‌బుక్, తల్లిదండ్రుల అనుమతి అవసరమయ్యే టీనేజర్ ఖాతాలు, పరిమితమైన నోటిఫికేషన్లు వంటి కొత్త సోషల్ మీడియా అనుభవం మొదలయ్యే అవకాశం ఉంది.


