విదేశాల్లో పాకిస్థానీయుల భిక్షాటన, అక్రమ వలసల వ్యవహారం ఆ దేశ ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా సహా గల్ఫ్ దేశాల్లో పాక్ పౌరులపై భిక్షాటన, వీసా నిబంధనల ఉల్లంఘన, అక్రమ నివాసం వంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇస్లామాబాద్ అప్రమత్తమైంది. తాజాగా హజ్, ఉమ్రా యాత్రల పేరిట సౌదీ అరేబియాకు వెళ్లే తమ పౌరులు.. భిక్షాటనకు పాల్పడొద్దంటూ బతిమాలినంత పని చేస్తోంది.
పాకిస్థాన్ ఎంబసీ సౌదీ అరేబియాలోని తమ పౌరులను ఉద్దేశించి ఈ సూచనలు చేసింది. హజ్, ఉమ్రా యాత్రికులతో పాటు సౌదీలో పనిచేస్తున్న పాకిస్థానీయులు కూడా స్థానిక చట్టాలను, తమ వీసా నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరింది. ముఖ్యంగా మక్కా, మదీనా పవిత్ర ప్రాంతాల పరిసరాల్లో భిక్షాటన, అనధికారికంగా విరాళాలు లేదా డబ్బులు సేకరించడంపై సౌదీ అధికారులు ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమలు చేస్తున్నారని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టు, నిర్బంధం, డిపోర్టేషన్ వంటి కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఏఐ వీడియోతో..
తమ హెచ్చరికను మరింత బలంగా తెలియజేసేందుకు పాకిస్థాన్ ఎంబసీ సోషల్ మీడియాలో ఓ ఏఐ రూపొందించిన వీడియోను కూడా విడుదల చేసింది. అందులో ఓ వ్యక్తిని సౌదీ అధికారులు అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్నట్లు చూపించారు. స్థానిక చట్టాలను ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాలను ఈ వీడియో ద్వారా యాత్రికులకు వివరించారు. అనుమతి లేని సేవలను వినియోగించుకోవద్దని, చట్టబద్ధమైన మార్గాల్లోనే ఆర్థిక సహాయం, విరాళాల సేకరణ చేపట్టాలని సూచించారు.దేశ పరువు దెబ్బతినేలా వ్యవహరించవద్దని పరోక్షంగా గట్టి సందేశం ఇచ్చింది.
پاکستان سے انے والے تمام عمرہ زائرین اور ورکرز کے نام اہم پیغام pic.twitter.com/BzOScR3lFP
— Pakistan Embassy Saudi Arabia (@PakinSaudiArab) August 16, 2026
సౌదీ నుంచే వేలాది మంది వెనక్కి..
విదేశాల్లో పాక్ పౌరుల భిక్షాటన వ్యవహారం కొత్తది కాదు. పాక్ అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2025లో సౌదీ అరేబియా నుంచి సుమారు 24 వేల మంది పాకిస్థానీయులను భిక్షాటనకు సంబంధించిన ఆరోపణలపై వెనక్కి పంపినట్లు సమాచారం. యూఏఈ నుంచి దాదాపు 6 వేల మంది, అజర్‌బైజాన్ నుంచి సుమారు 2,500 మంది పాక్ పౌరులను కూడా వెనక్కి పంపినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇందులో భిక్షాటన సంబంధిత కేసులే కాదు.. వీసా నిబంధనల ఉల్లంఘన, అక్రమ నివాసం, ఇతర ఇమ్మిగ్రేషన్ ఉల్లంఘనలు, నేరాలకు సంబంధించిన కేసులు కూడా డిపోర్టేషన్లకు కారణాలుగా ఉన్నాయి.
38 వేలకుపైగా డిపోర్ట్
పాక్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2025లో సౌదీ అరేబియా సహా గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల నుంచి వివిధ కారణాలతో 38,616 మంది పాకిస్థానీయులు డిపోర్ట్ అయ్యారు. వీరిలో సౌదీ అరేబియా నుంచి 27,692 మంది, యూఏఈ నుంచి 6,794 మంది, ఒమన్ నుంచి 2,537 మంది ఉన్నారు. అయితే వీరంతా భిక్షాటన కేసుల్లోనే వెనక్కి పంపినవారు కాదని పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
విమానాశ్రయాల్లోనే అడ్డుకట్ట
విదేశాల్లో సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో పాక్ ప్రభుత్వం దేశంలోనే చర్యలు ప్రారంభించింది. 2025లో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన 66,154 మందిని పాక్ విమానాశ్రయాల్లోనే ‘ఆఫ్‌లోడ్’ చేసినట్లు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) వెల్లడించింది. సరైన పత్రాలు లేకపోవడం, ప్రయాణ ఉద్దేశంపై అనుమానాలు, ఇతర ఇమ్మిగ్రేషన్ సమస్యల కారణంగా పలువురిని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ వ్యవహారంలో ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ నెట్‌వర్క్‌లు, అక్రమ వలసలకు సహకరిస్తున్న ఏజెంట్లపై కూడా FIA దృష్టి పెట్టింది. కొందరు ఉమ్రా వీసాలను ఉపయోగించుకుని సౌదీకి వెళ్లి అక్కడ భిక్షాటనకు పాల్పడుతున్నట్లు, మరికొందరు అక్కడి నుంచి ఇతర దేశాలకు అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు పాక్ అధికారులు గుర్తించిన సందర్భాలు ఉన్నాయి.
2024లోనే సౌదీ హెచ్చరిక
భిక్షాటన వ్యవహారంపై సౌదీ అరేబియా 2024లోనే పాకిస్థాన్‌ను హెచ్చరించింది. ఉమ్రా వీసాలను భిక్షాటన కోసం దుర్వినియోగం చేయొద్దని పాక్ ప్రభుత్వం తమ పౌరులకు స్పష్టంగా చెప్పాలని సూచించింది. మక్కా, మదీనా వంటి పవిత్ర ప్రాంతాల్లో భిక్షాటనపై సౌదీ కఠిన వైఖరి అవలంబిస్తోంది. అయినప్పటికీ సమస్య కొనసాగుతుండటంతో తాజాగా మరోసారి పాక్ తన పౌరులను అప్రమత్తం చేసింది.
విదేశాల్లో భిక్షాటన, అక్రమ వలస నెట్‌వర్క్‌లు పాకిస్థాన్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని ఆ దేశ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాక్ సెనేట్ కమిటీకి సమర్పించిన వివరాల ప్రకారం.. 2019 నుంచి 2025 మధ్య వివిధ దేశాల నుంచి 7,873 మంది పాకిస్థానీయులు డిపోర్ట్ కాగా.. వారిలో 1,064 మంది భిక్షాటన కారణంగా వెనక్కి పంపబడ్డారు. ఈ నేపథ్యంలో హజ్, ఉమ్రా యాత్రికులకు పాక్ తాజా హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది. విదేశాల్లో భిక్షాటనకు పాల్పడి దేశ ప్రతిష్ఠను దెబ్బతీయొద్దని, సౌదీ చట్టాలను కచ్చితంగా పాటించాలని ఇస్లామాబాద్ స్పష్టం చేస్తోంది. హజ్–ఉమ్రా యాత్రల సమయంలో జరిగే ఒక్కో ఘటన మొత్తం పాకిస్థాన్ పౌరులపై ప్రతికూల ప్రభావం చూపకుండా ముందుగానే నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది.


